తూరుపు వాకిట సూర్యుడి తొలికిరణం ప్రసరించే ప్రభాతం. నేను నిద్ర లేచాను. నిద్ర లేవగానే నేను చేసే మొదటి పని; నా మనసుకి నేనొక వాగ్దానం చేసుకోవడం. ‘నిన్నటి కంటే ఈ రోజు ఇంకాస్త మెరుగ్గా జీవించాలి’ అన్న వాగ్దానం.సరిగ్గా ఆరుగంటలకి వాట్సప్‌లో సందేశమొస్తే చూశాను:‘‘ఒక ప్రేమికుడు తన ప్రేయసిని ఇలా అడిగాడట: నా ప్రేమను తెలుపుతూ ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా?’ అని అడిగేందుకు మొట్టమొదటిసారి నేను మోకాళ్ళపై నిల్చున్నాను. నువ్వుకాక మరో అమ్మాయి కోసం అలా నేను మోకాళ్ళపై నిలబడే రోజు ఏదో తెలుసా?’’ప్రేమికుడి ప్రశ్నకు ఆశ్చర్యపోతూ ‘ఏ రోజు’ అనడిగింది ఆమె. అప్పుడతను ‘‘మన అమ్మాయిని బడికి పంపేందుకు సిద్ధం చేస్తూ షూ లేసు ముడివేసే రోజు’’ అని చెప్పాడు.ఆ సందేశాన్ని పంపింది స్వప్న దీప్‌. నా మనసులో ఇదీ అని చెప్ప లేని ఒక భావన.

అతనికి బదులేం ఇవ్వ లేదు. రెండు నిమిషాలకి అతన్నుండి మరో సందేశం వచ్చింది ఫోన్లో. ‘‘కావ్య గారూ! ఇందాక నేను పంపిన వాక్యాల్ని మీతో చెప్పాలనిపిస్తోంది. మీలాంటి గొప్ప వ్యక్తి చేయందుకునే అర్హత నాకుందో లేదో తెలీదు కానీ మనసులో భావాన్ని మీకు తెలపకపోతే కుదురుగా ఉండలేకపోతోంది హృదయం. మిమ్మల్ని నేనింతవరకూ చూడలేదు. కేవలం చరవాణి పరి చయం. వాట్సప్‌ స్నేహం. నేనెలా ఉంటానో కూడా మీకు తెలీదు. కానీ మీతో జీవితం పంచుకోవా లనిపిస్తోంది.

అ... అయామ్‌ ఇన్‌ లవ్‌... విత్‌ యు’’నా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ ఎందుకో జారి పరుపుపై పడింది.ఫఫఫఆర్నెల్ల క్రితం, ఓ వారపత్రికలో నే రాసిన ‘స్ఫూర్తి’ అన్న కథ చదివి నాకు ఫోన్‌ చేశాడు స్వప్నదీప్‌. ఏదో ప్రభుత్వ రంగ బీమా సంస్థలో లీగల్‌ ఆఫీసర్‌నని చెప్పాడు. అతనిలో ఓ ‘సునిశిత మైన పాఠకుడి’ని చూసి, సాహిత్యపరమైన సంభా షణ జరిపేదాన్ని అప్పుడప్పుడు. అంతే. ఆ పరి చయం లేదా స్నేహం ఇలాంటి పరిణామానికి దారి తీస్తుందని కలలో కూడా ఊహించలేదు నేను. ఇంతదాకా స్వప్నదీప్‌ని చూడాలనుకోలేదు. ఇప్పుడనిపిస్తోంది. అతన్ని చూడాలి. ‘‘స్వప్నదీప్‌ గారూ! ఈ రోజు సాయంత్రం మనం కలుద్దామా?’’ అన్న వాక్యాన్ని అతనికి ఫోన్‌లో పంపాను.