అంతా చిటికెలో జరిగిపోయింది. ముందు మైకం కమ్మింది. తర్వాత... మెడ ఒరుసుకుంటూ బంగారం మాయమయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపల ఎనిమిది తులాల బంగారు తాడు మంగళసూత్రాలతో సహా గల్లంతయింది. తేరుకునే సరికి ఇరవై ఏళ్లయువకుడు పారిపోతూ... ఆగి వున్న బైక్‌మీదకి లంఘించడం...తోడుదొంగలు ఏక్సిలేటర్ రైజ్‌చేసి పారిపోవడం చూసింది ముప్ఫై ఏళ్ల వాసంతి.‘ప్లజర్’ స్కూటర్ పక్కకు వాల్చి రోడ్డు మార్జిన్‌లో పడబోతుంటే పాపం ఎవరో నీళ్లు మొహాన చల్లి సేద తీర్చారు.వాసంతి తల విదిల్చి ఆగమేఘాల మీద స్కూటర్ పోనిచ్చి త్రీ టౌన్ పోలీస్టేషన్ ముందాగింది. సైడ్ స్టాండ్ వేసి నడుముకి కొంగు బిగించి లోపలికెళ్లింది. ఆమె కంగారుగా వచ్చిన తీరుకి స్టేషన్ సిబ్బంది ఏదో కంప్లైంట్ కేసు అనుకున్నారు. డోర్ దగ్గర సెంట్రీ ‘లేడీ టెర్రరిస్టు కాదులే’ అనుకుని లోపలికి అనుమతించాడు.
ఒకటి రెండేళ్ల క్రితం ఎస్సై అయి.. ఒకటి రెండేళ్లలో రిటైర్ కాబోతున్న ‘మహంకాళి’ ముందు ఆమె నిలబడింది.‘‘చెప్పమ్మా. ఏమిటి ప్రాబ్లం?’’ అన్నారు కూల్‌గా.‘‘నేను తిలక్‌రోడ్‌లో స్కూటర్ మీద వస్తుంటే దాదాపు ఇరవై ఏళ్ల యువకుడు ఆపి చీటి చూపించి ‘ఈ అడ్రస్ తెలుసా మేడం’ అని అడిగాడు’’.‘‘అడిగితే’’.‘‘ఆ చీటీ చూసి చెప్పేలోగా. .. నా మెళ్లో మంగళసూత్రాలు బంగారు తాడుతో సహా తెంపి తీసుకుని పారిపోయాడు’’ అంది ఇంచుమించు ఏడుస్తూ. ఆమె మెడచుట్టూ ఎర్రగా గీసుకుపోయి వుంది. అతను రొయ్యమీసాలు విచ్చుకునేలా నవ్వి ‘ఇదీ ఒక కంప్లయింటేనా, నిత్యం జరిగే సాదాసీదా నేరం’ అనుకుని జేబులోంచి కాటన్‌బడ్ తీసి తీరిగ్గా చెవిలో తిప్పుకోసాగాడు. ఎస్సై సరిగ్గా పట్టించుకోనందుకు ఆమెకు కోపం వచ్చింది.‘‘ఏమిటి సార్. ఉలకరు పలకరు. మీకు చీమకుట్టినట్టు లేదు’’ అంది కోపంగా.‘‘ఏవమ్మో... టీవీ సీరియల్లో ఎస్సై పాత్ర అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు డబాయిస్తున్నావు. బావుంది. నీ నగలు పోతే చీమ నన్నెందుకు కుడుతుంది. ఏం చెయ్యమంటావు. రోజుకి పది పన్నెండు చైన్‌స్నాచింగ్ కేసులొస్తాయి మా స్టేషన్‌కి. పోయినవాళ్లు కంగారు పడతారు. సహజం. బంగారంతో ఉడాయించినవాడు ఇంకా కంగారు పడతాడు. అదీ సహజం. మీలా మేమూ తొందర పడితే ఉరుకులు పరుగులు పెడితే దొంగ దొరుకుతాడా. బంగారం రికవరీ అవుతుందా?’’ అన్నాడు.