ఏటా జరిగే ఎగ్జిబిషన్‌అది. ఎందుకో ఓ మూల గొడవగా ఉంది. పోలీసులు ఈలలు వేసుకుంటూ జనాన్ని వెళ్లిపొమ్మంటున్నారు. కొద్దిసేపు ఆ స్టాల్‌ దగ్గర వినోదం చూసి జనం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ స్టాల్‌లో ఏదో సీనరీలు గోడకి అతికించి దాని ముందు ఫోటో కావాలనుకున్న వారికి ఫోటో తీస్తారు. స్టాల్‌ బయట ఓ జంట నిలబడి ఉంది.కొత్తగా పెళ్లయినట్లు ఉంది. పల్లెటూరు నుంచి వచ్చినట్లున్నారు. స్టాల్‌ వాడిచొక్కా పూర్తిగా చిరిగిపోయి ఉంది. సెక్యూరిటీ మనిషి అడిగాడు. ‘‘ ఏం జరిగింది?’’ అతను పూర్తిగా భయపడిపోయినట్లున్నాడు. ఆ పల్లెటూరి మనిషి కండలు తిరిగున్నాడు.‘‘ఫోటో తీయమన్నాడు సార్‌.

ఇద్దరూ ఆ సీనరీ ముందు ఒకర్నొకరు అంటుకుని నిలబడ్డారు సార్‌. కొద్దిగా జరగండీ, సీనరీలోని బిల్డింగ్స్‌ కరెక్ట్‌గా ఫోటోలో పడాలి అన్నాను’’సెక్యూరిటీ మనిషి బెంచ్‌ మీద కూర్చున్నాడు. ఎవరో అక్కడికొచ్చి నిలబడుతున్న వాళ్లని పొమ్మని సైగ చేశాడు. ఎందుకో నవ్వాడు.‘అంతమాత్రానికే నీ చొక్కా పట్టుకున్నాడా?’‘లేదు సార్‌ మరికాస్త దగ్గరకి జరిగి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. ఫుటో తియ్యి అని అరిచాడుసార్‌!’‘నువ్వు తీసేయ్యాల. చూడూ ఆళ్లు ఊరోళ్లు’‘నేను తీస్తానన్నాను సార్‌. 

ఇద్దరి నీడా ఆ బిల్డింగ్‌ మీద పడుతుంటే కొద్దిగా ఇద్దరినీ ఇటు జరగమన్నాను సార్‌’‘నీడ పడితే ఏమైంది? ఫోటో తియ్యాల’ అలా అంటూనే అతను ఎందుకో మరల ఈల వేశాడు.‘నేను తీస్తునే ఉన్నాను. నీడ పడితే బాగుండదయ్యా అన్నాను సార్‌. అంతే!’‘ఏం చేశాడు?’‘ఏముందీ సార్‌, చొక్కా పట్టుకొని గుంజాడు సార్‌. ఇదిగో ఇలా చిరిగిపోయింది.’సెక్యూరిటీ మనిషి ఆ పల్లెటూరు జంటను జాగ్రత్తగా చూశాడు.‘ఏవయ్యా నీడ పడుతోంది అన్నాడు అంతే గదా?’‘నీడ పడితే ఏంటి సార్‌? ఎందుకు పడ కూడదు?’‘ఫోటో ఖరాబు అవుతుంది. అంతే!’‘ఆ బిల్డింగ్‌ మీద ... మా నీడ పడితే, ఫోటో ఎందుకు ఖరాబు అవుతుంది?’‘అబ్బా ఏందయ్యా ఇంతకీ ఫోటో తీశావా?’‘ఇదిగోండి సార్‌ తీశాను’అతను ఫోటో చూశాడు. ‘ ఇదిగోనయ్యా ఫోటో పైసలిచ్చావా?’