సర్రున కారు దూసుకొచ్చి రాజమండ్రి స్టేషన్‌ ముందు ఆగింది. ఒక్కసారిగా ఆగే సరికి కొంచెం ముందుకు తూలింది ప్రతిమ.‘‘అబ్బా...ఏంటండీ డ్రైవింగ్‌? కాస్తుంటే దెబ్బ తగిలేది’’ మందలింపుగా అంది ప్రతిమ. డ్రైవింగ్‌ సీట్లో వున్న ప్రకాష్‌ నిర్లక్ష్యంగా నవ్వి ‘‘తగల్లేదు కదా? రైలు ఇంకో రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది దిగు..దిగు...’’ అన్నాడు.‘‘ఉండండి....నా బ్యాగ్‌’’ అని వెనక సీట్లో ఎయిర్‌ బ్యాగ్‌ తీసుకునిదిగబోయింది. ‘‘ఇదిగో టికెట్‌’’ అని టికెటిచ్చి, ‘‘నన్ను వదిలి వెళ్తున్న ఫీలింగ్‌ ఎక్కడా కనపడట్లేదు. చాలా ఆనందంగా వున్నట్లున్నావ్‌’’గిల్లుతున్నట్లుగా అడిగాడు.భర్త మాటలు అలవాటయినా, ఆమె మనసు దెబ్బ తినక మానలేదు.‘‘పంపించినట్లే పంపించి ఇలా వంకరగా మాట్లాడితేనే, ఎక్కడకు వెళ్లలన్నా భయం మీతో. ఊరూ లేదు ఏం లేదు ఇంటికి వెళ్లిపోదాం పదండి’’ అని కార్లో కూర్చుని డోర్‌ వెయ్యబోయింది.‘‘ఏయ్‌...నేనేదో సరదాగా అన్నాను. అమెరికా నుంచి చాలా ఏళ్ల తర్వాత మీ అక్క వస్తోంది కదా... ఆ సంతోషంలో....’’‘‘అయితే...మీరూ మీ ఫ్రెండ్స్‌తో ట్రిప్‌ వేసుకుంటారు. నేనెప్పుడైనా ఏమైనా అన్నానా?’’ దూకుడుగా అంది ప్రతిమ.‘‘అలా.....నేను వెళ్లిపోయినా నీకు ఆనందమేగా? కొన్నాళ్లయినా నా పీడ వదిలిందని’’ వ్యంగంగా నవ్వుతూ అన్నాడు.ఛర్రున కోపం వచ్చింది ప్రతిమకి. ‘‘చచ్చినా ఊరెళ్లను. నా బ్రతుకింతే...’’‘‘సారీ...సారీ..త్వరగా దిగు రైలొచ్చేసింది.’’

‘‘మీరీ జన్మలో మారరండి....’’ విసురుగా కారు దిగి, వడి వడిగా ప్లాట్‌ఫారం దగ్గరకు చేరింది.ఈ లోపు రైలు పూర్తిగా ఆగింది.ముందుగా రిజర్వు చేయించుకుంది కాబట్టి, ప్రతిమ త్వరగా తన ఎక్కాల్సిన కంపార్ట్‌మెంటు వెతుక్కుని ఎక్కింది.ప్రతిమ ఎక్కగానే రైలు కదిలింది.‘‘హమ్మయ్య’’ అని ఊపిరి పీల్చుకుని, కంపార్టుమెంటులో చూసేసరికి నీరసం వచ్చింది. కంపార్టుమెంటులో జనం మోస్తరుగా ఉన్నా ఖాళీగా వున్న చోటల్లా పడకేసారు చాలా మంది. తన సీటు ఎక్కడుందో చూసుకుంటూ వెళ్లి చూసేసరికి, ఇంకా నీరు కారిపోయింది. తనకి రిజర్వు చేయబడ్డ సీటే గాక మొత్తం బెర్తంతా ఆక్రమించుకుని పడుకుంది ఓ పెద్దావిడ.రైలు వేగం అందుకుంది. ఆమెనెలా లేపాలో అర్థం కాక సంకోచిస్తూ నిలబడింది ప్రతిమ.‘‘ఫర్వాలేదు....ఇక్కడ కూర్చోవచ్చు’’ అని వినపడిన వైపు చూసింది. ఆమెకు కాస్త వెనకాల కిటికీ పక్కన కూర్చుని వున్నాడు ఒకతను. అతని ఎదురుగా సీటు ఖాళీగా వుంది. ప్రతిమకి ఏం చెయ్యాలో తెలీక దిక్కులు చూస్తోంది.మళ్లీ అన్నాడతను, ‘‘అలా ఎంతసేపు నిలబడ్డం? ఫర్వాలేదు...’’ అని చెయ్యి చూపించాడు.ఆలోచిస్తే వచ్చే స్టేషన్లో అది కూడా దొరకదేమోనని, ప్రతిమ మెల్లిగా కదిలి అతని ఎదురుగా వున్న సీట్లో కూర్చుని, బ్యాగు బెర్తు కిందకు తోసింది.