కొబ్బరి బోండాల గెల, చీపురు కట్టల కట్ట, విసనకర్రలు వేలాడదీసిన గొడుగు, వడియాలు పెట్టడానికి గుమ్మడికాయలు, మూడు గిర్రల సైకిలు, క్యారం బోర్డు, వేరుశనక్కాయల మూట, కూరగాయల సంచీ ఇంకా ఒకటీ అరా చిన్నాచితకా... అంత బరువునీ ఆపసోపాలు పడుతూ లేస్తూ తెస్తూ వస్తున్న విఠల్‌రావుకి మిత్రుడు శఠగోపం లూనా మీద వస్తూ ఆగి షేకాండిచ్చాడు. చేయి కదిలించే స్థితిలో లేని విఠల్‌రావు శఠగోపం చేతికి వేలు కొద్దిగా తగిలించాడు.‘‘రైల్వే పోర్టరుగా పనిచేసిన నీ మధురాతి మధుర మదరాసు అనుభవం నీ కొత్తకాపురంలో విడుదల చేయకురా అని నెత్తీనోరూ కొట్టుకొని మరీ చెప్పా’’ అన్నాడు శఠగోపం విఠలరావు మోస్తున్న బరువును కలియజూస్తూ.‘‘చెప్పలేదురా బాబో చెప్పలేదు. మొన్న మా చినమామగారొచ్చారు. వచ్చిన దగ్గర నించీ పెళ్లికి ముందే నిన్నెక్కడో చూశా... ఎక్కడో చూశా అంటూ కుంటుకుంటూ నా వెంట పడ్డాడు.’’‘‘నువ్వాయన్ని గుర్తుపట్టావా!’’‘‘ఆయన టీసీగా వచ్చి కదిలే రైలెక్కబోయి కిందపడితే - ఓ చేత్తో ఆయన్ను భుజం మీద వేసుకొని ఇంకో చేత్తో ఆయన కాలి ముక్కను పట్టుకొని ఆసుపత్రిలో చేర్చింది నేనేగా - గుర్తుండిపోయాడు’’‘‘సరే అయిందేదో అయింది. 

నువ్వు జిమ్‌ పెట్టుకోవడానికి పెట్టిన లోన్‌ శాంక్షనయింది. డబ్బు చేతికొచ్చి వ్యాయామశాల తెరిచేదాకా ఎవరికీ ఏం చెప్పకు. నీ భార్యక్కూడా’’ చెప్పాడు శఠగోపం.‘‘అయితే పద... ఈ సామాన్లు ఇంట్లోపడేసి అలా బయటకెళ్లి విందు చేసుకుందాం’’ అని వెనుక కూర్చోబోయాడు విఠలరావు.‘‘నిన్నూ నీ సామానునూ నా లూనా లాగునా ముందుకు సాగునా’’ అన్నాడు శఠగోపం నవ్వుతూ..‘‘అరేయ్‌- ఇది రెండు చక్రాల లారీరా...గుండెల మీద ఏనుగుల్ని మోసే బండిరా’’ అంటూ కూర్చుందామని కాలు లేపబోతుంటే బాంబు పేలిన చపడయింది. సామానుతో సహా విరుచుకు పడ్డాడు విఠల్‌రావు.క్షణంలో జనం గుమిగూడారు.‘‘ఓస్‌... ఇంతేనా! టైర్‌ బరస్టేనా... ఉగ్రవాదుల ఉరుమనుకున్నాం’’ అని శ్వాస పీల్చుకొని వెళ్లిపోయారు.‘‘అరేయ్‌ దగ్గర్లో పంక్చర్‌ షాపు లేదు ఎలా... ఏయ్‌ రిక్షా’’ పిలిచాడు శఠగోపం.‘‘ఈ మాత్రం దానికి రిక్షా ఎందుకురా ! ఈ సామాను నువ్వు పట్టుకురా...నేను నీ లూనా మోసుకొస్తా’’ అన్నాడు విఠల్‌రావు లేచి దులుపుకుంటూ సామాను అందుకుంటూ.‘‘అమ్మో! నా లూనాయే బరువు తక్కువ’’ అంటూ లూనాను భుజాన వేసుకున్నాడు శఠగోపం.్‌్‌్‌‘‘మగవాళ్లన్న తరువాత బయట ఎవరో కలుస్తుంటారు. ఏదో మాట్లాడాల్సి వస్తుంది. అయిదు నిమిషాల ఆలశ్యానికే చీపురు కట్టల్లేక ఇల్లంతా మట్టినిండిపోయినట్లు...విస్తరాకుల్లేక మీ బాబాయి నిరాహార దీక్ష చేసి నీరసించిన నాయకుడైనట్లు... విసనకర్రల్లేక శ్వాస ఆగిపోయినట్లు గగ్గోలు పెడుతున్నావు’’ ఆగకుండా పెద్దగొంతుతో అరిచి అలసిపోయి ఆయాసపడ్డాడు విఠల్‌రావు. తన ప్రతిభతోనూ... తనస్నేహంతోనూ డబ్బులొస్తున్నాయన్న ధైర్యంతో.