సురేంద్ర నన్ను హత్య చేస్తాడని నేను ఊహించలేదు.అతనికి నన్ను చంపాలన్నంత కసి, చంపే అవసరమూ వున్నాయని తెలుసు కానీ, చంపేంత ధైర్యం చేస్తాడని ఊహించకపోవడమే నేను చేసిన తప. ఆ మాటకొస్తే నాలో ఏమాత్రం క్రిమినల్‌ మెంటాలిటీ వున్నా... సురేంద్ర నన్ను చంపడంకన్నా ముందే నేనే అతన్ని హత్య చేసి వుండేదాన్ని. నాలో క్రిమినల్‌ ఇన్‌స్టింక్ట్‌ ఏమాత్రం లేకపోవడం సురేంద్ర అదృష్టం. అయితేఈ అదృష్టం అతన్ని నా చేతిలో చావకుండా కాపాడగలిగింది కానీ, అతని చావుని మాత్రం తప్పించలేకపోయింది.సురేంద్ర ఎవరో కాదు... నా భర్త!్‌్‌్‌సురేంద్ర, నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం.... పెళ్ళి చేసుకుని శత్రువులమయ్యాం! అందం, బోలెడంత ఆస్తి, తెలివితేటలు... అన్నీ మెండుగా వున్న నా చుట్టూ ప్రేమిస్తున్నానంటూ తిరిగే అబ్బాయిలకి కొదవేముంటుంది?కాలేజీ రోజుల్లో నా చుట్టూ ఎంతోమంది అబ్బాయిలు తిరిగేవారు. నేను కన్నెత్తి చూస్తే అదే మహాభాగ్యమని మురిసిపోయేవారు. నేను నోరువిప్పి పలకరిస్తే చాలు... ఆ పలకరింపుకే మా ప్రాణాలిస్తాం అనేవాళ్ళు.... ఇలా ఎందరినో నేను రోజూ చూస్తూనే వుండేదాన్ని.నా అందాన్ని పొగడని, నా ఐశ్వర్యానికి అబ్బురపడని మగవారు నా ఫ్రెండ్స్‌ సర్కిల్లోనే లేరు... కానీ, వాళ్ళందరికీ భిన్నమయినవాడు సురేంద్ర.సురేంద్ర పెద్ద అందగాడేమీ కాదు కానీ, చూడటానికి బావుంటాడు. ధనవంతుడు కాదు కానీ డబ్బుని లెక్కచేసే మనిషిలా కనిపించేవాడు కాదు.అతడేనాడూ నా అందాన్ని పొగిడేవాడు కాదు... నాతోపాటు కార్లలో షికార్లకీ, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌కి ఎగబడేవాడు కాదు. 

అసలతనెపుడూ నా స్నేహంకోసం తపిస్తున్నట్లు కనపడేవాడు కాదు. ఇదిగో... సరిగా ఈ లక్షణమే నన్ను అతనివైపు ఆకర్షితురాల్ని చేసింది.మిగిలిన మగవాళ్ళల్లా అతను నన్ను ఇంప్రెస్‌ చెయ్యడానికి, నాతో స్నేహం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనపడేవాడు కాదు. నన్ను కూడా అందరిలా కామన్‌ వ్యక్తిలాగే గుర్తించేవాడు.మాట్లాడే ప్రతీ మాటా ముక్కుసూటిగా, ఎంతో నిజాయితీగా మాట్లాడేవాడు. అతని వాస్తవిక దృక్పథం చూస్తే నాకు ముచ్చటేసింది.చాలా కొద్దికాలంలోనే మేమిద్దరం క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయిపోయాము. ఒకసారి మా మధ్యనుండే స్నేహాన్ని ‘ప్రేమ’గా నేను ఎక్స్‌ప్రెస్‌ చేయబోతే అతను సున్నితంగా తిరస్కరించాడు. ప్రేమకీ ఇన్‌ఫాక్చ్‌యేషన్‌కీ మధ్యనుండే భేదాన్ని ఎత్తిచూపించాడు.బలహీన మనస్కులు, ఆధారపడే మనస్తత్వం వున్నవాళ్ళు ప్రేమలో తొందరగా పడతారని, అది నిజమైన ప్రేమ కాదని, తొందరపాటు ప్రేమ వ్యవహారాలు జీవితాన్ని నాశనం చేస్తాయని లెక్చరిచ్చేవాడు.అతనలా మాట్లాడుతున్నకొద్దీ నాకు అతని మీద ప్రేమ మరింత ఎక్కువయ్యేది. అతని నిజాయితీకి నా మనసు కరిగిపోయేది.నా పేరు మీద కోట్లకొలది ఆస్తి వుంది.నాకు ముందూ వెనకా గార్డియన్లు తప్ప నా అనేవారెవరూ లేరు. నన్ను పెళ్ళి చేసుకుంటే, నా భర్తగా నా ఆస్తినంతా అనుభవించే అవకాశం వున్నా... దానికి ఏమాత్రం ప్రలోభపడకుండా నాకు ఒక స్నేహితుడిగా మంచీచెడూ వివరించి చెబుతున్న అతనికన్నా మంచి జీవిత భాగస్వామి నాకెవరు దొరుకుతారు?