కృష్ణపక్షపు మలి సంధ్య...కనకాంబరపు టాకాశం నల్లబడుతోంది..తోటలోకి అంతమవుతున్న వరండాలో మేము...ఎర్రబడుతోన్న పడమటి ఆకాశానికభిముఖంగా పడక్కుర్చీలో దాసుగారు... అతనికభిముఖంగా ప్లాస్టిక్‌ కుర్చీలో నేను...చిన చిన్నగా రాల్తోన్న చీకటి చినుకులు...‘‘భోగాను భుక్తా వయమేవ భుక్తాస్తపోన తప్తం, వయమేవ తప్తాఃకాలోనయాతో వయమేవ యాతాస్తృష్ణానజీర్ణా వయమేవ జీర్ణామనం మన వీలైన మేరా భోగించినా, భోగాలు భోగాలుగానే మిగిలుంటాయి, తపస్సనేది తపస్సుగానే మిగిలుంటుంది. కాలం గడిచిపోతోందని భ్రమిస్తాం, కానీ మనమే కదిలెళ్ళిపోతున్నామని గ్రహించం, ఆశ?! అదీనూ ఆశా, కోరికా మనల్ని ప్రలోభపెడ్తున్నాయని ఎందుకు భ్రమిస్తాం మాస్టారూ?’’ వున్నట్టుండి అని దాసుగారు కాస్త ఆయాసంతో ఆగారు.ఆయనకు మృత్యుజ్ఞానం కలిగినట్టు తెలుస్తోంది... నిన్నటి రోజునే డయాలసిస్‌ చేసారు... తెల్లగా పాలిపోయిన ముఖం మసక వెల్తుర్లో కూడా తెలుస్తోంది... మధుమేహం వల్ల రెండు మూత్రపిండాలూ ధ్వంసం అయ్యాయి...పడక్కుర్చీలో మెత్తటి దిళ్ళనానుకుని, రెండు చేతులూ గుండెలమీద పెట్టుకుని నిశ్శబ్దంగా గాలిలా మాట్లాడ్తోన్నారు.

దాసుగారి పూర్వ చరిత్ర ఎవ్వరికీ తెలీదు, బాగా చిన్న వయస్సులోనే ఈ వూరొచ్చి ఓ హోల్సేలర్‌ దగ్గర పనిక్కుదిరారు, తర్వాత్తర్వాత గుమాస్తాగా.. ఓ చిన్న రీటేలర్లా.. మరో పెద్ద హోల్సేలర్‌లాగా ఆయన పరిణామక్రమం చాలామందికి తెలియదు...బ్రహ్మచారిగానే మిగిలారాయన, ఆయనకు ఏభైదాటింతర్వాత ఊరికి దూరంగా ఓ అయిదెకరాలుకాని, అందులో ఆశ్రమం కట్టారు... బోర్లు వేయించి ఓ స్కూలు బిల్డింగ్‌ కూడా కట్టారు.. ఆశ్రమం వృద్ధులకూ బడి అనాథ పిల్లలకూ అని, ఆ స్కూలు ఈ రోజుకీ చాలా విస్తరించింది.... ఊళ్ళోనే మంచి స్కూలు అని పేరు వచ్చింది. దాంతో ఆ స్కూల్లో పిల్లల్ని చదివించడానికి ఊళ్ళో జనాలంతా ఉత్సాహం చూపడం, స్టేటు ర్యాంకులు పిల్లలకి రావడం, దాసుగారు ఆశ్రమానికి ఆనుకుని ఉన్న ఇంకో పదెకరాల పొలం కొనేయడం, నన్ను రిటైర్మెంటు తర్వాత స్కూలు కరస్పాండెంటుగా రమ్మనటం నేను వచ్చేయడం, ఇదుగో యిప్పుడిలా సంధ్యవేళ దాసుగారితో కూచుని మాట్టాడ్డం.దాసుగారు ఆశ్రమంలోనే ఓ మూలగా మూడు గదులు వేయించుకున్నారు. అక్కడే ఆయన నివాసం. భోయనం పిల్లల్తోటే. వ్యాపార పనుల వల్ల ఆగిపోతే హాస్టల్‌ నుంచే క్యారేజీ. ఇంట్లో మాత్రం ఓ గది ఆయన అభ్యంతర మందిరం. అందులోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు. ఆయన లేనిపక్షంలో తాళం వేసుంటుంది. అది ఓ రహస్య మందిరం. స్కూలు బాధ్యత పూర్తిగా నాది. ఉదయం ఓ రెండు మూడు గంటలూ, సాయంవేళ వీలు దొరికిన టయమంతానూ...అకౌంట్స్‌ మాత్రం అతనే...స్కూలు గురించీ, ఆశ్రమం గురించీ నెట్లో పెట్టించాడు. స్కూలు గురించి ఓ రెండు మంచి బస్సులు కూడా ఉన్నాయి.