‘‘కాఫీ తీసుకురానా?’’‘‘అబ్బ! ఎందుకంత పెద్దగా అరుస్తావు?’’ అంటూ తెగిన గాటుమీద చెయ్యి అదిమిపెట్టి కోపంగా వెనక్కి తిరిగాడు మురళి.చీర కుచ్చెళ్ళు బొడ్లో దోపుకుని, చెదిరిన జుట్టుతో, నుదుటి మీది చెమటని పైటకొంగుతో తుడుచుకుంటూ నిలబడింది గిరిజ. పున్నమి చంద్రుణ్ణి చూసిన కళ్ళతో మిణుకుమిణుకుమనే తారను చూసిన భావన కలిగింది అతనికి. ‘‘నేను నెమ్మదిగానే అడిగాను. మీరే అనవసరంగా ఉలికి పడ్డారు’’ గిరిజ అతని భుజం మీదుగా తొంగిచూస్తూ అంది.పక్కన కావేరి బ్లాక్‌లోని 303 బాల్కనీలో విరిసిన తాజా గులాబిలాంటి ఆమె లేత గులాబి రంగు పంజాబి డ్రెస్స్‌లో ఆమె శరీరకాంతి ఇనుమ డించింది. నెమలి ఫించం లాంటి ఒత్తైన జుట్టుని పైకితీసి క్లిప్‌ పెట్టి వదిలేసింది. తగినంత ఒడ్డు పొడుగు, పొందికైన శరీరంతో చూసేవాళ్ళకి మతిపోగొట్టే అందం.‘‘పరధ్యాసగా ఉన్నప్పుడు హఠాత్తుగా ఎవరి మాటైనా వినబడితే ఉలిక్కి పడ్డం సహజం’’ గాయం మీద పౌడరు అద్దుతూ అన్నాడు మురళి.‘‘పరధ్యాసా, పక్కింటి ధ్యాసా?’’ గిరిజ చిన్నగా నవ్వింది.‘‘పిచ్చిగా మాట్లాడకు. బాత్రూం దగ్గర లైటింగ్‌ సరిగా లేదని ఇక్కడి కొచ్చాను అంతే!’’ ఉలికిపాటు కప్పి పుచ్చుకుంటూ ఆమెకేసి చూడకుండా తన పని సాగించాడు.‘‘ఎందుకు ఈ బాల్కనీలోకి వచ్చారని నేను అడగ లేదుగా! మీ పని పూర్తయితే కాఫీ ఇక్కడికే తీసుకురానా?’’ అదే చిరునవ్వుతో ‘ఇక్కడికే’ అని నొక్కి పలికింది గిరిజ.మురళికి ఆమె ధోరణి కోపం తెప్పించింది.‘‘అఖ్ఖర్లేదు. నేనే వస్తాను. ఒక్కసారి నీ అవతారం అద్దంలో చూసుకో. మీ ఆడవాళ్ళు చాలామంది అలంకరణ.

 మంచిబట్టలు బయటికి వెళ్ళే టప్పుడు లోకుల కోసమే అనుకుంటారు. ఇంట్లో మొగుడు సన్నాసి కంటికి వెలిసిపోయిన చీరలు, జిడ్డు మొహాలు చాలనుకుంటారు. ఛ! కొంచెం కూడా కామన్‌సెన్స్‌ ఉండదు. మనకి తెలీకపోతే ఎదుట వారిని చూసైనా నేర్చుకోవచ్చుగా!’’ ఆ మాటలన్న తర్వాత మురళికి అక్కసు తీరినట్టైంది.‘‘పొరుగింటి పుల్లకూర’’ గొణిగింది గిరిజ.‘‘ఏమిటి గొణుగుతున్నావు?’’అతని కేసి ఎర్రగా చూసి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.మురళి చూపులు మళ్ళీ పక్క బ్లాక్‌లోని బాల్కనీలో నెమ్మదిగా పచార్లు చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న ఆమె మీదకు మళ్ళాయి. మాట్లాడ్డం అయిపోయినట్టుంది. అప్పుడే బాల్కనీలోకి వచ్చిన భర్తకి ఏదో చెప్పి నవ్వుతోంది.‘‘లక్కీఫెలో, జాక్‌పాట్‌ లాంటి పెళ్ళాని కొట్టేశాడు’’.మురళి నీరసంగా నిట్టూర్చి సరంజమా సర్దుకుని లోపలికి నడిచాడు. సాయంత్రం ఆరు గంటలకు బాల్కనీలో ఆరేసిన బట్టలు తీయడానికి వచ్చిన గిరిజ చూపులు అసంకల్పితంగా పక్కింటి బాల్కనీకేసి తిరిగాయి. వాళ్ళు రోజు కంటే ముందే ఆఫీసు నుండి వచ్చేసినట్టున్నారు. ఆమె ఎదురుగా చిన్నస్టూల్‌ మీద లాప్‌టాప్‌ పెట్టుకుని, కుర్చీలో కూర్చుని పని చేసుకుంటోంది.