రైల్వే వాళ్ల నామకరణాలు చిత్రంగా వుంటాయి. రైల్లో ప్రక్కగా వున్న బెర్త్‌ను సైడ్‌ లోయర్‌, సైడ్‌ అప్పర్‌ అంటూ వ్యవహరిస్తుంటారు. వివాహాలు చేసుకొని జీవితంలో సైడ్‌లైన్‌ అయిపోయిన వారెందరో అలా కిటికీలోంచి కనిపిస్తున్న దాన్ని రైల్లోంచి చూస్తున్నట్లు చూస్తూ అలా ప్రయాణం సాగిస్తూ వుంటారు. కొంత మంది ఏమీ అనలేక, లేక అనుకోలేక తలలు వంచుకొని వుంటారు (సైడ్‌‘లోనర్‌’లో వీళ్లు వుంటారు).ఈ రైలు ఎందుకో ఇలాంటి వారినెక్కువగా ఎక్కించుకొని అలా పోతోందనిపించింది. సినిమా కంటే ఎక్కువ సినిమా చూసే వాళ్లని చూడడం నాకున్న చెడ్డ అలవాట్లలో ఒకటి. ఇంట్లో నేను టీవి ముందు కూర్చున్నా దానిని ఎక్కువగా చూడను. దానిని చూసే వాళ్ల ముఖ కవళికలను పరిశీలించడంలో నాకు ఎక్కువ వినోదం కనపడుతుంది. పైగా నా కుడి పక్క కూర్చున్న యువ జంట మరింత ఆసక్తికరంగా తోచింది.

ఏదైనా స్టేషన్లో రైలు ఆగగానే అతను ‘అరె... సపోటాలు’ అంటాడు. ఆమె అంత కన్నా గట్టిగా ‘అయ్యో, సపోటాలండీ’ అంటుంది. అతను కిటికీ చువ్వలను విరిచినంత పని చేసి ‘సపోటా’ అని అరుస్తాడు. ఆ సపోటా అబ్బాయి వాటన్నింటినీ కింద పడెయ్యబోయి కిటికీ దగ్గరకి వచ్చి నిలబడతాడు. ఇద్దరూ ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకుంటారు. లోపల ఏదో మంత్రం లాంటిది చదివేస్తారనుకుంటాను. ఇంతలో అతను లెక్క చెపుతాడు. ‘నీకు రెండు నాకు మూడు’ అని సపోటాలు కొంటాడు. సీటు మధ్యలో పాచికలు ఆడుతున్నట్లు పండ్లన్నీ పెట్టి బండి కదిలే వరకూ ఆగి కదలగానే వాటిని సేవిస్తారు.్‌్‌్‌రైలు ప్రయాణం కొత్తగా పెళ్లయిన వారి జీవనయానం బాగానే వుంటుంది. స్టేషన్లో ఆర్భాటంగా అనౌన్స్‌మెంట్‌ జరుగుతుంది. శుభలేఖలతో మొదలయి దర్జాగా పెళ్లయిపోతుంది. బండి సాఫీగా చపడు లేకుండా కదిలిపోతుంది. అందరూ టాటాలు చెబుతారు. ఊరు దాటగానే ఎందుకో రైలు ఆగిపోయి ‘అయ్యో’ అన్నట్లు చిన్నగా కూస్తుంది. కొత్త జంటలకీ ఇదే సమస్య. ఈ బండీ ఎందుకెక్కామా అని ఆలోచిస్తారు. కానీ రైలు వాళ్లని మళ్లీ మళ్లీ ఆలోచించుకోండి అన్నట్లు రెండు మూడు సార్లు కూసి చిన్నగా తప్పదన్నట్లు కదులుతుంది. నువ్వు ఇలాంటివాడివి అనుకోలేదని అమ్మాయి అనుకుంటుంది. ఇపడిలా వున్నావు. మరి ఇంకెపడు ఎలాగో అని అబ్బాయి చప్పరించుకుంటాడు. తప్పేదేముంది అని ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకొని నిట్టూరుస్తారు. బండీ అలా సాగుతూ వుంటుంది.