ఆ ఇంటి ఎదురుగా సి.సి. రోడ్డుంది.ఇంటి ఆవరణలో పూల చెట్లున్నాయి. అపడే బయటినుండి వచ్చితన మోపెడ్‌కు స్టాండు వేసి, లోపలికి వస్తున్న పూజితతో ‘‘అన్నయ్య నిన్ను ఇండియా పంపి పొరపాటు చేసిండేమో’’ అంది సావిత్రి.‘‘అదే విషయాన్ని మీ సోదరునితో చెప మరి. అందరు తమ పిల్లలను పై చదువులకోసం విదేశాలకు పంపుతుంటే ఈయనేమో స్వదేశానికి పంపె’’ అంటూ తన నిరసనను అదో మాదిరి అడుగులు వేయడం ద్వారా ప్రదర్శించింది పూజిత.‘‘తెలుగు మాతృభాషను, భరత నాట్యమును బతికించాలట’’ అంటు చెపలను స్టాండు వద్ద వదిలి టవలందుకుని బాత్‌రూమ్‌ వైపు నడిచింది. సావిత్రి తలనిండా ఆలోచనలు కదిలినాయి. అవును అన్నయ్యను ఏ డాక్టరో, ఇంజనీరో చదివించక ఎందుకు ఇట్లా చేసినట్టు? అమెరికాలో స్థిరపడడం వల్లా అక్కడి సంస్కృతితో విసుగు చెంది తనతో అన్న మాటలు గుర్తొచ్చినాయి. ఇక్కడి సంస్కృతి అంత ఆరోగ్యమైంది కాదు. ఇక్కడి పిల్లలు చెప చేతుల్లో వుండరు. విచ్చలవిడిగా తిరిగే ఇక్కడి యువతీయువకులతో మన పిల్లలు కలిసి తిరగడం వల్లా వాళ్ళలాగ వీళ్లూ తయారవుతారు. అందుకని ముందే జాగ్రత్తపడితే బాగుంటుంది. అన్నపుడే అనుకున్నది వున్న ఒక్క అమ్మాయిని అక్కడ చదివించడం ఇష్టం లేదని. ‘‘చెల్లెమ్మా ఎలాగో ఇంత పెద్ద ఇంట్లో నీవు ఇద్దరు పిల్లలేగా వుండేది. మిలటరీ డ్యూటీస్‌. పూజితను నీ దగ్గరే వుంచుకో ఇక్కడే మన చదువులే చదువుతుంది. అత్తయ్య కాఫీ’’ అంటూ టవల్‌తో ముఖాన్ని అద్దుకుంటు వచ్చి నిలుచుంది పూజిత.

 ఆ మాటతో సావిత్రి ఆలోచనలు తెగిపోగా వంటింటి వైపు నడిచింది.‘‘శ్రీధర్‌ కూడా స్కూల్‌ నుండి రానట్టుంది’’‘‘స్కూల్‌ అయిపోతే క్రికెట్‌ లేదూ. అటుపోవాలి’’ అంది సావిత్రి. ఆ మాటలో వెటకారం ధ్వనించింది. కొంత సేపటి తరువాత, పొగలు కక్కే కాఫీకపలతో వస్తున్న సావిత్రికి ఎదురెళ్ళి ఓ కపని అందుకుంది. ఇద్దరు కాఫీకప్‌లను ఖాళీ చేసిండ్రు.డోర్‌బెల్‌ మోగింది. సావిత్రి వెళ్ళి డోర్‌ తీసింది. ‘‘అమ్మా స్టార్‌ కనెక్షన్‌ డబ్బులు’’ అంటూ రశీదు బుక్‌ తీసాడు. డబ్బులు తెచ్చి ఇచ్చింది సావిత్రి. ‘‘అసలు ఈ స్టార్‌ కనెక్షన్‌ తీసేయాలి’’ అనుకుంటూ ‘‘మరీ ఈ విదేశీ విచిత్రాలను మన నట్టింట్లో చూస్తూ వాటినే అనుకరిస్తున్నం లేకపోతే ఈ లవ్‌లెక్కడివి’’ అంది సావిత్రి సీరియస్‌గా.‘‘ఉన్నాయి మీ తాత ముత్తాతల కాలం నుండి వున్నయి. ఇంకా అంతకంటె ముందునుండి కూడ వున్నయని మన ప్రాచీన సాహిత్యంలో రాయబారం, మేఘ సందేశం అవన్నీ ఏమిటీ తల్లీ’’‘‘అవన్నీ కట్టుకథలు, వట్టి కల్పితాలు’’ అంది సావిత్రి.