‘గోదావరి ఎక్స్‌ప్రెస్‌’ నిశ్శబ్ద నిశిరాత్రిలో లయబద్ధంగా నడుస్తోంది. కంపార్ట్‌మెంటులో రోహిణి మనసు మాత్రం నిశ్శబ్దంగా లేదు. ఎవరి బెర్తులో వారు పడుకున్నారు. ఆమె మనసు పట్టాలు తప్పి పరిగెడుతోంది. కట్టుకున్నదాన్ని నేనుండగా మళ్లీ పెళ్లా?’’ కోపంగా మనసులో గొణుక్కుంది.తన ఫ్రెండు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ స్రవంతి కొరియర్‌లో పంపించిన లెటరు బెడ్‌లైటు వెల్తుర్లో మరోసారి చదువుకోసాగింది. ‘నిన్న మీ వారు మా యింటికొచ్చి వెడ్డింగ్‌ కార్డు ఇచ్చారు. అతను చేయని తపని అనుమానంతో అవమానపరిచి దూరంగా వుంచడం సబబు కాదు. పుట్టింటికి వెళ్లిపోవడం నీ సమస్యకు పరిష్కారం కాదు. మూడేళ్ల వివాహ జీవితాన్ని చేతులారా పాడుచేసుకోకు. నీలో ఎటువంటి పశ్చాతాపం కలిగినా నీవు ఈ పెళ్లి నిలిపివేయగలవు. నౌ ది మౌజ్‌ ఈజ్‌ ఇన్‌ యువర్‌ హ్యాండ్‌.’‘వీల్లేదు ఈ పెళ్లి జరగడాన్కి వీల్లేదు’ ఈ పెళ్లి జరగడాన్కి వీల్లేదు’ బిగ్గరగా అరిచింది. అమె అరుపులు ట్రైను కూతలో కల్సిపోయాయి. తేరుకుని చుట్టూ చూసింది. సైడు ట్రాక్‌లో మరో ట్రైన్‌ పరిగెడుతున్న శబ్దం. ఆమె గుండె శబ్దాన్ని మరింత రెట్టించింది. ఓపిక తెచ్చుకొని లేచి హ్యాంగరుకున్న వాటర్‌బాటిల్‌ తీసుకొని నీళ్లు గడగడ తాగేసింది. అనాలోచితంగా రోహిణి కళ్లలో నీళ్లు నిండుకున్నాయి. శేఖర్‌ రోహిణిల వైవాహిక జీవితంలో మూడేళ్లు గడిచాయి.

 తొలిరాత్రి మొదలు గడిపిన ప్రతి రాత్రి ఆమెను వరూధుని వారసురాలుగా చమత్కరించేవాడు. ‘పూర్వజన్మలో నేను శివుని మల్లెపూలతో పూజించి వుంటాను. అందుకే నాకు ఇంత అందమైన భార్య లభించింది.’ అని పొంగిపోయేవాడు శేఖర్‌. అలాగే రోహిణి భర్తను అనుకరించేది. కాని నెల రోజుల క్రితం జరిగిన సంఘటన బుల్లితెర సీరియల్లా తన మనో పిక్చర్‌ ట్యూబుపై కదలాడింది.ఆషాఢమాసం మేఘాలు ఆ రాత్రి ఆకాశాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఎక్కడో దూరంగా వర్షం పడుతున్నట్లు మట్టివాసనతో గాలివీస్తోంది. శేఖర్‌ బెడ్‌పై పడుకొని టేబుల్‌ ల్యాంపు లైటింగ్‌లో వీక్లీ పేజీలు తిరగేస్తున్నాడు. పక్కనే వున్న శ్రీమతి రోహిణి ఏదో అడగాలని ప్రయత్నిస్తోంది. దూరంగా పిడుగుపడ్డ ధ్వని ప్రశాంత వాతావరణాన్ని దూరం చేసి ఆమెను ఆయన గుండెకు దగ్గరగా చేర్చింది.‘ఏమండీ! నేను గత ఏడాది బెంగుళూరులో ట్రైనింగ్‌లో వున్నపడు మీకు నాతో చెప్పకూడని అనుభవాలు ఏమైనా చోటుచేసుకున్నాయా’ అతని విశాలమైన ఛాతిపై తలాన్చి అడిగింది రోహిణి. అనుకోని ఆమె ప్రశ్నకు గతుక్కుమని, అంతలోనే సర్దుకొని ‘లేదు.... ఏం ... ఎందుకని? ఇంత అందమైన భార్యతో చెప్పలేని అనుభూతిని పొందుతున్న నాకు ఇంకా ఎక్స్‌ట్రాకర్కులర్‌ ఏక్టివిటీస్‌ ఎందుకోయ్‌? ఇదే నేను చెప్పలేని అనుభూతి’ సిగరెట్‌ పఫ్‌ లాగిస్తూ అన్నాడు.