నేను కోల్పోయిన ఏదో జీవలక్షణం ఇప్పుడిప్పుడే నాలో ప్రవేశించటం మొదలు పెట్టింది. ఏదైనా అనుభవమే కదా మనిషిని ఒక నవీన మార్గంవైపుకు పెట్టేది. అందుకే అనుభవమే చాలా గొప్పది. రాత్రయితేగానీ చూడలేం ఆకాశం అందాన్ని. నిజం. ఆకాశం ఏమీ లేని గొప్ప అందమయిన చిత్రం. నీ అందంతో మాకేం పని అనుకోలేం మనం.నేను చాలా నిర్దయుణ్ణి. ప్రేమలూ, బంధాలు వీటన్నింటిలో ఏమీలేదని అంతా కంప్యూటర్‌లోనే ఉందనుకొనే వెర్రివాణ్ణి. తప్పు చేశాను. ఆత్మీయతలూ, అనురాగాలు ఇవి కూడా అజ్ఞాతంగా మనం అనుభవిస్తున్న బ్రతుకుని నిర్దేశిస్తూనే ఉన్నాయి.అసలు ప్రేమలేని తనంతో మనిషి మనుగడ సాగించటం చాలా కష్టం. బయట మంచుకురుస్తూ ఉంది రహస్యంగా. మనిషితో సంబంధం లేనట్లు ముఖ్యంగా నాతో. ఇన్ని సంవత్సరాలు ఎంత ఆనందాన్ని అనుభవించకుండా కోల్పోయానో తల్చుకుంటుంటే,... అదో బాధ. ‘నవీన్‌’ బలవంతపెడ్తే వచ్చాను. నిజానికి ఇష్టంలేదు. అమ్మా, నాన్నకు తప్పదన్నట్లు వాళ్ళ మాటల్లోనే అర్థమయింది. ఆ రాత్రి వాళ్ళ మాటల్ని తల్చుకుంటుంటే... ఏదో ఆవేదన. నశించిపోతున్న మానవ సంబంధాల పర్వం. దాన్ని ఎలాగయినా కాపాడుకోవాలనే తపన ఇప్పుడు నాలో.‘‘నాల్గు రోజులు ముందుగా వెళ్లి ఏం చేస్తాం అక్కడ...’’ అమ్మ కాఫీ కప్పు అందిస్తూ అంది.‘‘ఇప్పుడెందుకు...’’ నాన్న అయిష్టంగానే అందుకున్నాడు.‘‘సాయంత్రం నించీ తాగలేదుగా అందుకే కలిపాను.... ఇష్టం లేకుంటే సగం తాగి నాకిచ్చేయండి...’’ నాన్నకి ఎదురుగా విలాసంగా కూర్చుంది.అమ్మ ఆలోచన్లన్నీ ఆ కాఫీ కప్పులో నింపి ఇచ్చినట్లుంది.

 ఒక్కో గుక్క గొంతులోకి వెళ్తోంటే... ఒక్కో ఆలోచన మొదలౌతూ ఉంది ఆయన్లో.‘‘కరెక్టుగా ముహూర్తం రోజు వెళ్తే ఏమయినా అనుకుంటారు...’’‘‘రాజీకి క్లాసులు పోతాయి...’’ అమ్మ ఏదో చెప్పే ప్రయత్నం చేసింది.‘‘నన్ను కాస్త ఆలోచించుకోనీ విజయ... ఇంకా టైముందిగా...’’‘‘టైముందీ.. టైముందీ అని ఒన్‌ వీక్‌నుంచి చెప్తూనే ఉన్నారు.’’ అమ్మ ఏదో కొనసాగింపు మొదలు పెట్టింది. ఏదో చెప్తూనే ఉంది.నాన్న చేతివేళ్లు రిమోట్‌ని నొక్కుకుంటూ ఉంటే కళ్ళు ప్లాస్మాటీవీని అతుక్కుపోయి అటూ ఇటూ నాట్యమాడుతున్నాయి.నాకు తెల్సు నాన్న అప్పుడప్పుడూ అమ్మ ముందు మౌనంగా ఉండిపోవటం అలవాటు చేస్కున్నాడని. తనే ఆ విషయం చాలాసార్లు నాతో చెప్పాడు కూడా.ఢిల్లీ అభాగ్యనగరం. ఇక్కడ మంచు ఎక్కువ. మమతలు తక్కువ.‘‘నవీన్‌ కూడా ఫోన్‌ చేశాడు డాడీ... ఎప్పుడు బయల్దేరుతున్నారు.. అని...’’ నాన్నవైపు చూడ కుండానే అన్నాను. అందరి ప్లేట్లలోని బ్రెడ్‌ని ఎంతో సునాయాసంగా ముక్కలు చేస్తున్నాయి వేళ్ళ మధ్య చాకచక్యంగా కదుల్తున్న బ్రెడ్‌నైఫ్స్‌.‘‘రేపు ఈవినింగ్‌ ఫ్లైట్‌కి టికెట్లు బుక్‌ చేశాను. అందరూ లగేజ్‌ సర్దుకోండి... ఓ టెన్‌ డేస్‌కి సరి పడా...’’