దేవుడు వరమిచ్చినా పూజారివరమియ్యని చందంగా తయారయిందిమా కొళాయిల బాగోతం....!!ఇంతకీ పూజారి పాత్రను సమర్థవంతంగావహిస్తున్నదెవరనుకున్నారు? తిప్పడు.వాడిని వాటర్‌ ట్యాంకు నింపి,కొళాయిలు వదలడానికి మాసర్పంచే పెట్టాడు.వాడికి ఎప్పుడు తిక్క రేగుతుందో తెలీదు గాని జనాలతో చెడుగుడు ఆడుకుంటాడు. ఇంట్లో గుక్కెడు నీళ్లు లేని వాళ్లంతా గుడ్లనీళ్లు కక్కుకుంటుంటే వాడికింతా అంతా ఆనందం కాదు. అసలు వాడి ఉనికి వాడికే తెలీదు.ఓసారి ‘కుమ్మరి ఖానా’ దగ్గర పకోడీ కొట్టు దగ్గర దేభ్యం మొహం పెట్టుకొని పకోడీలకు చేయి చాస్తూంటాడు. మరోసారి రామ కోవెల దగ్గర యాత్రికులను కొబ్బరి చిప్పలిమ్మంటూ వేధిస్తాడు. దేవుడికి దశావతారాలున్నాయన్నది పురాణముఖంగా నమ్మాలి తప్ప ఈ తిప్పడి అవతారాలు మాత్రం చెప్పలేనన్ని అని ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు.ఒకప్పుడు తిప్పడు గోచీ పెట్టుకుని రామకోనేట్లో బుడుంగున మునిగి బుడుంగున తేలి జల్లెడ పట్టి భక్తులు విసిరిన రూపాయి, అర్థ వెతుక్కునేవాడు.తరువాత కొంత కాలం ఎర్రప్ప ఇడ్లీ కొట్లో పప్పు రుబ్బుతూ బ్రతికాడు. మునసబుగారింట్లో మైకు, లైటింగుల మెకానిక్కూ వీడే. బోడి కొండనుదర్శించుకునే యాత్రికలుకు వీడే గైడు. కోనప్పగారి తోటలకి కాపలా నుంచి సుదర్శనం వారి గొడ్ల చాకిరీలకి సాగింది వీడి ప్రస్థానం. ఆనక చీనప్ప గారింట్లో తెలుగు మందులు కల్వాల్లో నూరుతూ కూడా గడిపాడు.అలాంటి తిప్పడికి మా ఊర్లో మూతిగాడని పేరు. అయితే దాని వెనుక పెద్ద కథ వుంది. 

అలనాటి ఆంజనేయుల వారు ఎర్రని పండనుకొని ఎంచక్కా ఆదిత్యుని అందుకోబోతే మూతికాలి పొంగింది...అదే మాదిరిగా తిప్పడు ఓసారి పందానికి దిగి నోట్లో బాంబుపెట్టుకుని మరీ వెల్గించుకుని సాహసించిన పాపానికి ఢామ్మంటూ పేలి మూతి పూరీలా పొంగింది. పందెంలో గెల్చుకున్న డబ్బంతా డాక్టర్‌కి ధారపోసినా మూతి వాపు ఏమాత్రం తగ ్గలేదు.అయితే ఆ వంకర మూతి తిప్పడికి కొంత కాలం తిండిపెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. అదీ మా ఊర్లో శివరాత్రికి వచ్చిన సర్కస్‌ కంపెనీ యజమాని వీడినీ, వీడి మూతినీ చూసి ముచ్చట పడిపోయి తన కంపెనీలో చేరమన్నాట్ట.ఇంతకీ దేనికని అడిగారు కాదు.ఆ సర్కస్‌లో మొత్తం ముగ్గురు బఫూన్లలో ఒకడు ఈ మధ్యనే టపా కట్టేసాట్ట. అందుకని హాస్యం కరవైన ప్రేక్షకులకి పొట్ట పగిలేలా నవ్వించడానికి వీడి అవతారం ఎంతగానో ఉపకరిస్తుందని నియమించుకున్నాట్ట.కానీ, ఆ బఫూన్‌ బాగోతం మూన్నాళ్ల ముచ్చటే అయింది. కారణం. శ్రీకూర్మం డోలా యాత్రలో సర్కస్‌ వేస్తుండగా వీడు పూటుగా తాగొచ్చి సర్కస్‌ అమ్మాయితో తనని లవ్వాడమంటూ వేదించుకు తిన్నాట్ట. దాంతో కంపెనీ యజమాని పోలీసుల చేత వీడిని సాగ్గొట్టించి ఇంటికి సాగనంపాడట!