‘‘బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌’’ఇది వాస్తవమేనా అనే సందేహం వచ్చింది.కొన్ని పరిచయాలు విచిత్రంగా జరుగుతాయి.‘హరి’తో నాకు పరిచయం కావటానికి కారణం ‘ఇరి’. తను నా కూతురు. మేమిద్దరం ఆ వేసవికాలపు సాయంత్రం మా గేటెడ్‌ కమ్యూనిటీలో నడుస్తున్నపుడు సాఫ్ట్‌డ్రింక్‌ తాగుదామా అని అడిగాను.‘‘నో సాఫ్ట్‌డ్రింక్సు డాడీ, ఓన్లీ కోకోనట్‌ వాటర్‌’’ అంది. నేను నమ్మలేనట్లు చూసాను. మా ఫ్రిజ్‌లో తను పెట్టిన సాఫ్ట్‌ డ్రింక్‌ బాటిల్స్‌ ఎప్పుడూ వుంటాయి. ఇరి నాయనమ్మతో నూడిల్స్‌ చేయించుకుని వాటిని తాగుతుంటుంది.

నా భార్యకూ అమ్మకూ ఈ తాగటాలూ, తినటాలూ ఇష్టం వుండవు. రోజూ ఎందుకమ్మా అంటే ‘ఐ లైక్‌ దెమ్‌ డాడీ’’ అంటుంది. ఇరి మాకు ఒక్కగానొక్క కూతురు. తనకు ఇష్టమైన వాటిని నేను కాదనలేను.‘‘సాఫ్ట్‌ డ్రింక్సూ, జంక్‌ ఫుడ్డూ హెల్త్‌కి డేంజర్‌ అని మా వసంతా మేమ్‌ చెప్పారు. అందుకని అవన్నీ బంద్‌’’ అంది ఇరి.‘‘నేనూ చెప్పాను’’ గుర్తు చేసాను.‘‘కాని మీరూ తాగుతారు’’ అంది. మాట్లాడలేకపోయాను. ఓ పక్కన అమెరికా నుండి ఆంధ్రావరకు చదువుకుంటున్న పిల్లలు తమ టీచర్స్‌ని షూట్‌ చేయటమో, తలలు పగలకొట్టటమో చేస్తున్న రోజుల్లో ఇరి తన టీచర్‌ మాటకి అంత విలువనివ్వటం నాకు సంతోషాన్ని కలిగించింది.

 ఇది తాత్కాలికం కాకూడదనుకున్నాను.మాకు రెండు గేట్లు వున్నాయి. మెయిన్‌ గేట్‌ హైవేకి ఆనుకుని ఉంటుంది. రెండో గేట్‌ దగ్గర రోడ్డు మీద చిన్న చిన్న షాపులు లోపలే సూపర్‌ బజార్‌ ఉంది కాబట్టి అటు వెళ్లే అవకాశం తక్కువ.కాని ఆ రోజు అక్కడున్న ఓ షాపు దగ్గరకు వెళ్లి ‘‘బోండాం ఎంత?’’ అని అడిగాను.‘‘ఇరవై రూపాయలండి’’ అన్నాడు.‘‘అంతా!’’ అన్నాను.‘‘ఇందులో మాకు మిగిలేది అయిదు రూపాయలే. అయినా రంగునీళ్లకి ఎంతయినా ఇస్తారు. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిది. మీకు తెలియంది కాదు. మీరు రైతుబిడ్డలే కదా’’ అన్నాడు.‘‘సరే. రెండు బోండాలు ఇవ్వండి’’ అన్నాను అతన్ని పరిశీలనగా చూస్తూ. సన్నగా వున్నాడు. బట్టతల. తెల్లటి పెద్ద మీసాలు. అరవై సంవత్సరాలు దాటి వుండొచ్చనిపించింది.‘‘నీళ్ల బోండాం ఇవ్వమంటారా? మలాయా?’’ అన్నాడు.‘‘మలాయా?’’ అన్నాను.‘‘మనం మీగడ అంటాం కదా. లేత కొబ్బరుంటే నార్త్‌వాళ్లు ‘పత్‌లా మలాయ్‌’ అంటారు.

ఆ నీళ్లు తియ్యగా వుంటాయి గాని విటమిన్స్‌ తక్కువ వుంటాయి. కొబ్బరిలేని నీళ్లేమో వగరుగా ఉంటాయి’’ అన్నాడు.‘‘నీళ్లవే ఇవ్వండి’’ అన్నాను.అతను రెండు బోండాలు కొట్టియిచ్చాడు-స్ట్రాలు వేసి. డబ్బులు యిచ్చి మళ్లీ జాగింగ్‌ ట్రాక్‌ మీద కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాం. ‘రైతుబిడ్డ’ అంటే ఏంటని అడిగింది ఇరి. నిజానికి నేను రైతుబిడ్డని కాదు. మా నాన్న చిన్న ఉద్యోగి. ఏ జ్వరం వచ్చినపుడో తప్ప కొబ్బరిబోండాలు తాగింది తక్కువ. కొబ్బరిబోండాల్లోకి నీళ్లు రావటం, ఆవిరవటం సృష్టి విచిత్రంగా అనిపించేది.