‘‘స్వాతీ! ఉప్పు సరిపోయిందేమో చూడు’’ అంటూ వంటింట్లో నుండి ప్రదీప్‌ బయటికి వచ్చాడు. అతని చేతిలో సాంబారు గరిటె ఉంది. అందులో కొద్దిగా సాంబారు!అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన స్వాతి అతని వంక దిగులుగా చూసింది.‘‘ఓహో! ఇంకా కాళ్లు కడుక్కోలేదా. వెంటనే కడుక్కో, కాఫీ రెఢీ’’ అంటూ తెచ్చిన సాంబారు గరిటెను అలాగే వెనక్కు తీసుకుని వెళ్లిపోయాడు ప్రదీప్‌.అతని వెనకనే ఆమె కూడా వంటింట్లోకి వచ్చింది.‘‘అరె... బయట తిరిగి వచ్చి, కాళ్లు కడుక్కోకుండా వంటింట్లోకి రావడం తప్పు కదూ. జెర్మ్స్‌ అన్నీ వంటింట్లోకి వచ్చేస్తాయి’’ అన్నాడు.తదేకంగా అతని వంక చూసి ‘‘ఏంటి మీరు చేసేపని?’’ అన్నది స్వాతి.‘‘ఏముందీ, రాత్రికి వంట. ఏం నా చేతి వంట రుచిగా ఉండదా?’’‘‘వంట అనేది తెలుస్తూనే ఉంది. విషయం అది కాదు. మీరెందుకు చేస్తున్నారనే అడుగుతున్నాను. నేను రావడం కాస్త ఆలస్యం అయింది. అంత మాత్రానికే ఇక ఇంటికే రానేమో నన్నంతగా చేస్తున్నారే. అసలు మిమ్మల్ని వంటింట్లోకి ఎవరు రమ్మన్నారు?’’‘‘ఇది మరీ బాగుంది. ఇది మన ఇల్లు. మనం ఎక్కడికన్నా వెళ్లొచ్చు. ఏమైనా చెయ్యొచ్చు. నాకూ టైం పాస్‌ కావాలిగా. పైగా నువ్వు అలసిపోయి ఇంటికి వస్తావు. తరువాత కూడా మళ్లీ ఈ వంట పనంటే విసుగనిపించదూ. ప్రస్తుతానికి నేను ఖాళీయే కదా అందుకే చేస్తున్నాను. ఇందులో తప్పేముంది?’’

‘‘తప్పే. శుద్ధ తప్పు. మీరు వంటింట్లోకి రాకూడదు అంతే . ఇది నా సామ్రాజ్యం’’‘‘అంటే నువ్వు పోపు డబ్బాల్లో ఏమేం పెట్టావో తెలిసిపోతుందని భయమా?’’‘‘యూ’’ అంటూ అతన్ని ప్రేమగా తన్నడానికి చెయ్యెత్తి ముందుకు వచ్చింది.ఆ చేతిని అలాగే ఒడిసి పట్టి, వెనక్కు తిప్పి ఆమెను వెనక నుంచి అలాగే బాహువుల్లో బంధించి, ‘‘కాళ్లు కడుక్కుని రమ్మని చెప్పానా, ముందాపని చెయ్యి, తరువాత మన వాద ప్రతివాదనలు’’ అంటూ బుగ్గ గిల్లాడు.అంతే! అప్పటిదాకా అతని మీద ఉన్న కోపం పటాపంచలైంది. ఒక్క క్షణం తన్మయత్వంతో కళ్లు మూసుకుని, మెల్లగా అతని బంధాల నుండి విడిపించుకుని బాత్రూంలోనికి వెళ్లింది కాళ్లు కడుక్కోవడానికి.వెళ్లే ముందు తర్జని చూపిస్తూ ‘‘కాఫీ మాత్రం నేను వచ్చే కలుపుతాను’’ అన్నది.ఆమె వచ్చే సమయానికి సెగలు కక్కే వేడివేడి కాఫీతో సిద్ధంగా ఉన్నాడు ప్రదీప్‌.బుంగమూతితో అతని వంక చూసింది స్వాతి ‘‘వద్దని చెప్పినా మాట వినరు కదా’’ అన్నది నిష్టూరంగా. కాఫీ ఆమె చేతికందివ ్వకుండా ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో ఆమెను చుట్టి నడిపించుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తరువాత కాఫీ అందించాడు ప్రదీప్‌.