ప్రియురాలు కోసం యుగాలైనా ఎదురు చూడొచ్చు కానీ మనక్కావలసిన బస్సుకోసం అరగంట వెయిట్‌ చేయాలంటే మహాకష్టంగా ఉంటుంది.అయినా బస్సూ, ప్రియురాలు ఒకటా? నా పిచ్చికాకపోతే!‘‘ఈ రాత్రి నువ్వు వరంగల్‌ వెళ్లి వెలగబెట్టాల్సిన రాచకార్యలేమున్నాయిరా? ఈ రాత్రికి ఇక్కడే ఉండి, రేప్పొద్దున వెళ్లి పోదువుగానీ’’ చిలక్కిచెప్పినట్టు చెప్పాడు బాబాయ్‌ - పైగా అనుమానంగా కూడా చూశాడు.‘‘ఊహూహూ.... నేను వెళ్లాలి.... నాకు పనుంది... ఏమనుకోకండి, బాబాయ్‌...’’ అంటూ బ్యాగ్‌ భుజాన వేసుకుని వచ్చేశాను. వెనక్కు పిలుస్తాడేమోనని గబగబ బయటికొచ్చి గేటు మూసి -‘‘తాళం వేసుకో బాబాయ్‌’’ అని లోపలికి కేకేసి రోడ్డు మీదకు పరుగెత్తాను.పదకొండు గంటల నుంచీ రెండు బస్సులు పోయాయి. రెండింటిలోనూ కాలు పెట్టడానికి చోటులేదు. కరీంనగర్‌ నుండి వరంగల్‌ చేరడానికి రెండు గంటలు పడుతుంది. అంతసేపూ బస్సులో కమ్మీకి వేలాడుతూ వెళ్లడమంటే నరకయాతనే అనిపించి ఊరుకున్నానుఇప్పుడు పన్నెండు కావస్తోంది. ఇంక ఒకే ఒక్క బస్సు మిగిలి వుంది రావడానికి.

 ఇది వదులుకుంటే అంతే సంగతులు. తిరిగి బాబాయ్‌ ఇంటికి వెళ్లాలంటే యాభై రూపాయలు అర్పించుకోవాలి ఆటోకి. ఎందుకులే తలనొప్పి! ఎంతకష్టంగా వున్నా, ఈ లాస్ట్‌ బస్‌లోనే వెళ్లి పోవాలి అనుకుంటూ వుండగా... నా తపస్సు ఫలించి ప్రత్యక్ష మైంది నా లాస్ట్‌ బస్సు...ఈకొస నుండీ, ఆకొస దాకా సందులేకుండా జనంతో, నిండు గర్భిణిలా భారంగా కదులుతూ, పాయింట్‌ వద్దకు వచ్చి ఆగిన బస్సును చూసి నేను భారంగా నిట్టూర్చి, మరింత నీరసంగా కదిలాను ఫుట్‌బోర్డు వైపు.దిగే వాళ్లు నలుగురూ, ఎక్కేవాళ్లు పన్నెండు మందీనూ!కాళ్లను ఫ్లోర్‌కి పాతేసుకుని, కమ్మీలకూ, కిటికీలకూ, సీట్లకూ చేతుల్ని బలంగా బిగించి, ఈ స్థలం నాది. హరిహరాదులు దిగివచ్చినా అణువంతైనా నన్ను కదిలించిలేరన్నట్టుగా రాతి విగ్రహాల్లా నిలబడ్డారు ఎవరికి వారు.చలనం లేని వాళ్లతో మాట్లాడటం వృథా అని తెలుసుకాబట్టి - ధాన్యం బస్తాల మధ్య నుండి నడిచినట్టుగా వారిని ఢీకొంటూ, జరుపుతూ, సందుల్లో నుండి ఒక్కొక్క పార్టుని ఇరికించి ముందుకు కదులుతూ సణుగుళ్లూ, గొణుగుళ్లూ మధ్య కొంతదూరం వరకూ ప్రయాణం చేయగలిగాను. అయిదు నిముషాల వ్యవధిలో.దాదాపు బస్సు మధ్యభాగం కన్నా మరి కాస్త లోపలి దాకా రాగలిగినందుకు గర్వంగా వుంది. సాహసం వీడిపోని వీరుడిలాగా వున్న నన్ను నేను అభినందించుకున్నాను.కానీ ఇప్పుడు కళ్లెదురుగా జనమే కానీ కిటికీ అనేదే కనిపించడం లేదు. చలికాలం బిగినైంది కాబట్టి సరిపోయిందిగానీ - లేకపోతే లోన ఉక్కకి ఉక్కిరి బిక్కిరై ఊపిరాడక చచ్చుండే వాడిని.కొద్ది నిముషాల తర్వాత కమ్మీకి బలంగా తగిలి ఉన్న రెండు విడివిడి వ్యక్తుల చేతుల మధ్య కొద్దిగా ఖాళీని క్రియేట్‌ చేసుకోగలిగాను కొద్ది కష్టం మీద. ఇప్పుడు ఇందాకటి కన్నా చక్కగా గాలి ఆడుతోంది.