ఫోన్‌ చెయ్యడం కోసం టెలిఫోన్‌ బూత్‌కొచ్చింది సుధ. పడమట ఆకాశం ఎర్రగా మెరుస్తోంది. గడ్డి కోసం పొలాలకెళ్ళిన బర్రెలు ఇళ్ళకి తిరిగి వస్తున్నాయి. అవి రేపిన దుమ్ముతో వీధి తెల్లబారింది.చామనఛాయ, చేప పిల్లల్లాంటి కళ్ళు, సన్నటి చిన్న ముక్కు, సున్నాలా ముద్దొచ్చే పెదాలు, పట్టుకుని సాగదీయా లన్పించే బుగ్గలు, ముడేసిన జుట్టు - చూడ్డానికి అమాయ కంగా కన్పించినా తెలివైన పిల్లే. గుండ్రటి భుజాలు, ఆకృతికి తగ్గట్టు నిండుగా వుండే వక్షం - చుడీదార్లో వాటి ఆకృతి తెలుస్తుంటుంది.టెలిఫోన్‌ బూత్‌లో కూర్చుని వుండే హరి అంటే సుధకిష్టం. అతడి నవ్వంటే మరీ ఇష్టం. ఆ టైములో హరి హుషారుగా వున్నాడు. సుధ వొస్తుందని ముందే తెలుసునన్నట్టు. హరి మాటలు బాగా చెబుతాడు. జోకులు వేసి నవ్విస్తాడు. ఆ నవ్వేపడు విశాలమయ్యే ఛాతీవంక చూడకుండా వుండలేదు.అలా అనుకోకూడదు. అతడికి పెళ్ళయ్యింది. పిల్లలున్నారు. కానీ వాళ్ళెవరూ ఇపడతని వద్ద లేరు. భార్య అతన్ని వొదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళి పోయింది. ఇప్పటికి ఐదారేళ్ళు ఐపోయి వుంటా యి. వెళ్తా వెళ్తా కొడుకులిద్దర్నీ తనతో తీసుకు పోయింది. అప్పట్నించి పాపం హరి వొంటిగా బతుకుతున్నాడు.

 రక్త మాంసాలు గల వొళ్ళు.. యెట్లా తట్టుకుంటున్నాడో యేమో. ఎపడూ ఈ టెలిఫోన్‌ బూత్‌లోనే కాలం వెళ్లదీసేస్తుంటాడు.సుధ పలకరించింది. ‘‘ఏమండీ ఇవాళ సంతో షంగా కన్పిస్తున్నారే. ఏమిటి విశేషం?’’‘‘ప్రత్యేకం ఏం లేదే. ఎప్పట్లానే వున్నా. మీకెం దుకు అట్లా అన్పిస్తుందో?’’మనసులో బాధ తెలీకుండా నవ్వుతూ కనపడు తుంటాడు. తనకి తెలీదా? అమ్మ తనకి చెప్పలేదా. ‘‘ఒకసారెళ్ళి అమ్మాయితో మాట్లాడరాదా. వొస్తుం దేమో’’ అని అమ్మంటే ‘‘ఒకసారేమిటి? ఎన్నిసా ర్లైనా వెళ్తాను. తను రావాలే కాని. కానీ తను రాదు. నేను తనకి తగనని ఆమె నిశ్చితాభిప్రాయం’’ అన్నాడంట.అతనేం చేస్తాడు.. అతని ఆదాయం తక్కువ. తిండికి మాత్రం లోటుండదు. కానీ ఆమెకి కోరికలు జాస్తి. ఆమె అడిగే వస్తువుని అప్పటికపడు తేలేని ఆర్థిక స్థితి అతనిది. టెలిఫోన్‌ బూత్‌ మీదయితే ఆమె కోర్కెల్ని తీర్చలేనని చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. కానీ వాటిలో కిటుకులు తెలీల. ఏదీ ఎక్కి రాలేదు. టెలిఫోన్‌ బూతొక్కటే నిలబడింది. కాపురం చెయ్యలేనని నిర్దయగా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. అతడూ పట్టుబట్టలేదు పిల్లల్ని వుంచేయమని. తల్లిలేని పిల్లల్ని తానెట్లా పెంచ గలననే భావంతో వూరుకున్నాడు.సుధ ఫోన్‌ తీసి నంబరు నొక్కింది. చెవి దగ్గర పెట్టుకుంది. లైను కలవడం లేదు. డిస్‌ప్లేలో నంబ రు చూసి ‘‘మీ అక్కయ్య గారికా?’’ అడిగాడు.