జీ మెయిల్‌లో కథ టైప్‌ చేస్తుండగా ఫేస్‌బుక్‌లో ఎవరో పింగ్‌ చేసిన సౌండ్‌ వచ్చింది. ఎవరా అని చూస్తే నరేంద్ర.‘‘హలో అమ్మాయిగారూ! ఏం చేస్తున్నారు.’’నాకు తెలియకుండానే నా పెదవులపై చిరుదరహాసం నాట్యం చేసింది.‘‘హాయ్‌, నిన్న నువ్వు చెప్పిన పాయింట్‌ మీద స్టోరీ రాస్తున్నాను’’ ఎగ్జైటెడ్‌గా అన్నాను.‘‘గుడ్‌ గుడ్‌. బాగా రాయి. ఇప్పుడే ఆఫీస్‌కి వచ్చాను. ఫ్రీ అయ్యాక కాల్‌ చేస్తాను’’ అని బై చెప్పి ఆఫ్‌ లైన్‌ అయ్యాడు.నరేంద్ర వాళ్ళ ఫ్యామిలీ నేను చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురుగా ఉండేవారు. అప్పట్లో అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ మూడేళ్ళు అక్కడే ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా వివరాలే తెలుసు. ఇంతలో మా నాన్నగారికి వేరేచోటికి ట్రాన్స్‌ఫర్‌ అవడంతో మేము ఆ ఊరునుంచి వెళ్ళిపోయాము. తర్వాత అతన్ని ఎప్పుడూ కలవలేదు.మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఒక ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో అతని ప్రొఫైల్‌ చూసి గుర్తుపట్టి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాను. అతను యాక్సెప్ట్‌ చేశాడు కానీ నన్ను గుర్తుపట్టలేదు. ఫేస్‌బుక్‌లో నా ఫోటో పెట్టను నేను.‘‘నేను మీకు తెలుసా’’ అని మెసేజ్‌ పెట్టాడు.

ఆ టైంలో నేను అనుకోకుండా ఆన్‌లైన్‌లో ఉండడంతో వెంటనే రిప్లయ్‌ ఇచ్చాను. నా పేరును బట్టి నేనెవరో అతనికి గుర్తు రాలేదు. మా నాన్నగారి పేరు, ఉద్యోగం లాంటి వివరాలు చెప్పాక అర్థమయింది.‘‘అబ్బో, ఆ రోజుల్లో దించిన తల ఎత్తకుండా కాలేజీకి వెళ్ళేవారు. మాటలు వచ్చా రావా అని డౌట్‌ వచ్చేలాగా’’ అని మెసేజ్‌ చేశాడు ఓ స్మైలీ పెట్టి.నేను కూడా రిప్లయ్‌గా ఇంకో స్మైలీ మెసేజ్‌ చేశాను.కొంతసేపు చాట్‌ చేశాం ఇద్దరం. ఆ ఊరి విశేషాలన్నీ ఉత్సాహంగా అడిగి తెలుసుకున్నాను. ఆ ఊళ్ళోని నా పాత స్నేహితురాళ్ళు ఏం చేస్తున్నారో అడిగాను. తనకి తెలిసిన వివరాలు చెప్పాడు.తనకి ఇద్దరు పిల్లలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మెయిల్‌ చేశాడు. నేను కూడా మా ఫోటో పంపించాను.‘‘నేను ఎక్కువ ఆన్‌లైన్‌లోకి రాను. నాకు ఫీల్డ్‌ వర్కే ఎక్కువ. చెయ్యాలనుకుంటే కాల్‌ చెయ్యండి’’ అని మొబైల్‌ నెంబర్‌ ఇచ్చాడు.