జొరోమని వాన కురస్తా వుండాది.చీకట్లో గలగలమని మోరస్తా వాననీళ్ళు పల్లానికి పరిగెత్తతా వుండాయి.‘‘పరిగెత్తే నీళ్ళల్లో పాపరకాయలు అద్దొద్దు అంటారు గదా!ఎందుకక్కా?’’ అని అడిగింది ఎగవింటి దీపం.‘‘పాపరకాయలు విషం గదా! అద్దితే నీళ్లుగూడా విషమైపోతాయని’’ చెప్పింది రాశింటి దీపం.‘‘గంగకి అంటు వుంటాదా?’’ అని అడిగింది ఎగవింటి దీపం.‘‘గంగకి అంటులేదు కాని మనుషులు వాళ్ళు చేసిన పాపాలని వొదిలి గంగని అంటరానిదాన్ని చేస్తా వుండారు’’ అని చెప్పింది రాశింటి దీపం.‘‘ఎట్లెట్లా? గంగ అంటరానిదా?’’ అని అడిగింది ఎగవింటి దీపం.‘‘దానికి ఒక కత వుండాదిలే!’’ అనింది రాశింటి దీపం.‘‘ఆ కతేందో చెప్పరాదా?’’ అని అడిగింది ఎగవింటి దీపం.దీపాలకల్లా చూసి తలాడిస్తా కతనెత్తుకునింది రాశింటి దీపం.్‌ ్‌ ్‌వెలమ దొరలు రాజ్జమేలే కాలంనాటి మాట.కన్నడ రాజ్జెం నుంచి ఒగ మాదిగోడు బంగారుపాలేనికి వచ్చినాడు. రాచబాట పక్కన నాయనోరి సత్రం వుండాది. ఆ సత్రంలో తలదాచుకున్నేడు.వగిసిలోవాడు తిరగని రాజ్జమంటూ లేదు. తిరగతా తిరగతానే ఒగ ఊళ్ళో పెండ్లి చేసుకున్నేడు. ఆడబిడ్డను కని వాడి పెళ్ళాం బాలింతరాలి రోగంతో కండ్లు మూసింది. ఆ బిడ్డని ఈపుకు కట్టుకోని తిరగతా తిరగతానే పెంచి పెద్దదాన్ని చేసి పెండ్లి చేసినాడు.ఇపడు వొంట్లో సత్తువ లేదు. తిరగలేడు. ఆ సత్రంలోనే కట్టెకడతేర్చుకుందామని తీరుమానం చేసుకున్నేడు.

పొగులంతా చెపలు కుడతాడు. రాత్రయితే సత్రం పంచన పడుకుంటాడు. ఎవరైనా నాలుగు ముద్దలు పెడితే తింటాడు. లేదంటే చేదబాయి నీళ్ళతో కడుపు నింపుకుంటాడు. సాదువులతో చేరి బంగేకు తాగుతాడు. వాళ్ళతో గొంతు కలిపి బెమ్మంగారి తత్వాలు పాడతాడు.ఇట్లా గడస్తా వున్నింది.ఒగరోజు సత్రం పక్కనే కంపచెట్లల్లో మామిడిమొక్క ఒగటి నవనవలాడతా మోసులెయ్యడం చూసినాడు. కంపచెట్లను కొట్టేసి పాదుచేసినాడు. రోజూ మూడుపూటలా సత్తు కంచంతో నీళ్ళు పోసేటోడు.అది కొన్నాళ్ళకి రెమ్మలేసింది. చూస్తా చూస్తా వుండగానే కొమ్మల్ని దించింది. పూలు పూసింది. పిందెలేసింది.పూతాపిందెతో కళకళలాడే మామిడిమాకును చూసినపడల్లా మాదిగోడికి కూతురే గెప్తికి వస్తా వుండాది. కండ్లల్లో నీళ్ళు తిరగతా వుండాయి. బిడ్డను చూసి చాన్నాళ్ళయింది. కాళ్ళాడేటపడు కాశీకి పొయ్యి కూతుర్ని చూసొచ్చేటోడు. ఇపడు అంతదూరం పోవడమంటే కుదరని పని. కూతురు గుర్తుకొచ్చినపడు, చేసేపని పక్కన పెట్టి దుక్కపడతా కుర్చొనేవాడు.