నాకు చాలా బాధగా ఉంది. కోపంగానూ ఉంది. స్వంత అన్నకూడా ఇలా మాయమాటల్తో మభ్యపెట్టి నన్ను మోసం చేస్తాడని వూహించలేదు. ఈ ప్రేమలూ మమకారాలూ అనుబంధాలూ ఆప్యాయతలూ అన్నీ భ్రమేనా? చిన్నప్పుడు ఎంత ప్రేమగా చూసేవాడో..అన్నకంటే పదేళ్ళు చిన్నదాన్ని నేను. అన్న నన్ను ఎత్తుకుని ఆడించేవాడు. దగ్గర కూచోబెట్టుకుని చదువు చెప్పేవాడు. అలిగితే బతిమాలి అన్నం తినిపించేవాడు. వయసు మీరిపోతుందని బలవంతం చేసినా నా పెళ్ళయ్యేవరకు తను పెళ్ళి చేసుకోనని భీష్మించుకుని కూచున్నాడు. ఇపుడెందుకిలా మారిపోయాడో ఎందుకిలా కఠినంగా మాట్లాడుతున్నాడో అర్థం కాక, పైట చెంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ కూచున్నాను.‘‘యింకెందుకు ఇక్కడ? వెళ్దాం పద?’’ అన్నాడు రమేష్‌. నా భర్త.‘‘కొద్ది సేపుండండి. ఈ విషయం ఏదో తేలనివ్వండి’’ అంటూ అన్నవైపు చూశాను. మనసులో ఏమేం భావాలు సుళ్ళు తిరుగుతున్నాయో తెలీదు కానీ మొహం మాత్రం అభావంగా పెట్టి చూపు మరో వైపుకు మరల్చి కూచున్నాడు. అతని పక్కనే వదిన ఉంది. ఆమె కోపంతో రగిలిపోతున్నట్టు స్పష్టంగా మొహంలో కన్పిస్తోంది. ముక్కు పుటాల్లోంచి శ్వాస పాము బుసలా వస్తోంది. కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. ఆమె నా చూపుని తప్పించుకోవడానికి విసురుగా తల విదిలించినప్పుడు చెవుల్లోని వజ్రపు కమ్మల మీద ట్యూబ్‌ లైట్‌ కాంతి పడి అవి తళుక్కున మెరిశాయి.‘‘అన్నా..చివరిగా అడుగుతున్నా. అమ్మ వజ్రాల కమ్మలు నాకు చెందాలి. అమ్మ చివరి కోరిక కూడా అదే. 

చనిపోయేముందు కూడా మాట పడిపోయినా సైగల్తో ఆ కమ్మలు నాకే ఇస్తానని చెప్పినపుడు నువ్వూ వదినా పక్కనే ఉన్నారుగా. కమ్మలు ఇచ్చేయమని వదినతో చెప్పు’’ అన్నాను.అన్న ఏదో చెప్పబోయేలోపల వదిన కస్సున లేచింది. ‘‘అత్తయ్య సైగల్తో చెప్పిన విషయాన్ని నీకనుగుణంగా వక్రీకరిస్తే అవును కామోసు అని తల వూపడానికి ఇక్కడెవరూ వాజమ్మలు లేరు. ఆ సైగల అర్థం కమ్మలు తన కోడిలికే చెందుతాయని. అత్తయ్య తన చెవులను ముట్టుకుని తర్వాత నా వైపు చూపించడం నువ్వు చూళ్ళేదా?’’‘‘నీ దగ్గరున్న కమ్మల్ని నాకిమ్మని కదా సైగల్తో చెప్పింది’’‘‘కాదు ఆ కమ్మలు నా దగ్గరే ఉండాలని తన కోరిక అని నీకు చెప్పటం కోసం నీ వైపు చూసింది. ఏది ఏమైనా ఎవ్వరేమనుకున్నా ఈ కమ్మలు వేరేవాళ్ళకిచ్చే ప్రసక్తే లేదు’’ అంది వదిన.‘‘అన్నా...నువ్వేమీ మాట్లాడవేంటి? వేరేవాళ్ళంటుందేమిటి వదిన? నేను పరాయిదాన్నా? మా అమ్మ నగల మీద కూతురుగా నాకు హక్కు ఉండదా? నేనేమీ మిగతా బంగారం గురించి మాట్లాడటం లేదే. వజ్రాల కమ్మలు నా చిన్నప్పటి నుంచి అమ్మ నాకిస్తాననడం నీకూ గుర్తుండే ఉంటుంది’’ అన్నాను.