జాలువారే కొండ నీరు కోనేరు చేరడం మా ఊరి ప్రత్యేకత. మాకవే తాగునీరు. కదిలే అలలు, కదలాడే తామరాకులు, తలలూపే కమలాలు, వాటిపై తుమ్మెదలు, ఎగిరే పక్షులు, ఒడ్డునాడే పిల్లల కేరింతలు...ఓఁ! అదో ఆనంద హేల! ఆ పక్కనే ఆలయం. ఆవరణ మల్లే, సన్నజాజి, సంపంగి, నందివర్దనం, నాగమల్లెలతో గుభాళిస్తోండేది. నిత్య పూజలు, నిండు నైవేద్యాలు జరిగేవి.నైరుతి పెంకుటిల్లు పూజారి రంగాచారి నివాసం. నలభైలో తెల్లగా, విభూతి రేఖలో మెరుస్తోండే వాడు. గుడే అతని లోకం. ఆయన భార్య శారదాంబకు భర్తే దైవం. వారేకైక సంతానం లత. అందాల భరణి. ఆనందాల హరిణి. ఆమె నా క్లాస్‌మేట్‌. కోనేటి చుట్టూ ఊరుంది. దేవాలయం పేరుతో అది నరసింహగిరైంది.మా డాబా తూర్పు వీధిలో ఉంది. అమ్మ నాన్నలకు నేనొక్కడ్నే. మాది పదెకరాల కమతం. నే బడిలో చేరిన రోజే గోపి, లతలు చేరారు. గోపి పొరుగింటబ్బాయి. ఆడబిడ్డల తరువాత మగబిడ్డ. గారాల అడ్డ. నాకు మిత్రుడు. లతా మా జట్టే! చదువులు వారి వారిళ్లల్లో సాగినా, ఆటలు ఏదో ఒకరింట్లోనే ఉండేవి. శలవైతే గుళ్లోనే మకాం. దాగుడు మూతలు, వామన గుంతలు, ఛుక్‌ ఛుక్‌ పుల్ల, నాలుగు స్తంభాలాటలు సాగేవి. ఉదయం, సాయంత్రాలే వాటి పరిధి. ఎంత సేపైనా అలుపు లేదు. ఆకలి కాదు. అదో వింత లోకం. మంచి కాలం. ఉన్నదంతా ఉత్సాహం. ఆనందం...అనురాగం...ఆప్యాయం! నిజంగా ఆ రోజులెంత హాయి!చదువులు ప్రైమరి దాటాయి. వయస్సులు పెరిగాయి.

 లత కొత్త సోయగాలు సంతరించుకొంది. స్నేహం పెరిగింది. మేమిద్దరం రోజూ మాట్లాడుకోకుండా ఉండలేకున్నాం. ఆటల్లో ఎవరికి దెబ్బ తగిలినా రెండో వాళ్లకేదో బాధ. లత తాయిలాలు గోపికి తెలియకుండా నాకిచ్చేది. నేనూ అంతే. వాడూ మంచి స్నేహితుడే. కానీ మేము పరిధి దాటాం. అప్పుడప్పుడు లత స్కూల్‌కి డుమ్మా కొట్టేది. కారణం చుట్టాలొచ్చారనేది. ఒకసారి మామయ్యని ఒకతన్ని చూపింది. పేరు అనంతాచారి. మాకంటే ఏడెనిమిదేళ్లు పెద్ద. ఆడ మగకు మధ్యగున్నాడు.‘‘కొజ్జాయేమో!’’ గోపి అన్నాడు.‘‘అరవకురా...వింటాడు!’’ వారించా.అతన్ని మేము ఆట పట్టించేవాళ్లం. అతను మిర్రి మిర్రి చూసేవాడు. లతా మాకే వంత పాడేది.అప్పటి సంఘటనొకటి......కోనేటి ఒడ్డున దాగుడు మూతలాడుతోన్నాం. లత దొంగ. తలో మూల దాక్కొన్నాం. అనంతాచారి అరుపులతో ఉసికొల్పి పరుగెత్తాడు. శబ్దం దిశగా వెళ్లిన లత నీళ్లల్లో పడింది. హడావుడికి కళ్లగంతూడింది. ప్రమాదం గుర్తించి గోపి కేకలేశాడు. నేను వేగంగా పక్కనే ఉన్న పొడవాటి కర్రను లతదగ్గరకేసి కొన పట్టుకొన్నా. అదృష్టం రెండో కొన ఆమెకు దొరికింది. బలంగా లాగాం. దాపుకొచ్చిన లతను నీళ్లల్లో దిగి ఒడ్డుకు చేర్చా. గండం గడిచింది. భయంతో కంపించే లత నన్నల్లుకొంది. నేను పొదవి పట్టుకొని ఓదార్చా. ఈ లోగా ఆచారి దంపతులు పరుగునొచ్చి కూతుర్ని అక్కున చేర్చుకున్నారు. నా సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. ఆరోజు నుంచి మా ఆకర్షణింకో మెట్టు పెరిగింది.