పార్వతీపురం... తెల్లవారితే ఉగాది...ప్రతీ ఇంట్లో గుమ్మానికి మామిడితోరణాలు కట్టారు. ఊరు కళకళలాడుతోంది. రామాలయం దగ్గర బ్రాహ్మణుడు కూర్చుని పంచాంగ శ్రవణం చేయడం, రైతులు నాగలి పట్టి పొలాలకి వెళ్ళడం, ఏటా అక్కడ జరిగేదే. ఈసారి కూడా అదేవిధంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి స్వీకరించారంతా. ఒకరికొకరు ఆనందాన్ని పంచుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.ఫఫఫమహాలక్ష్మి చంటోణ్ణి చంకన పెట్టుకుని, భర్త వైకుంఠం దగ్గరకు వెళ్ళి, ‘‘లేవయ్యా, తెల్లవారింది. అమావాస్య పోయి నాలుగు రోజులవుతుంది. గరుగుబెల్లి వెళ్ళి మీ చెల్లెల్ని తీసుకురా. తొమ్మిది మాసాలు నిండాయి. మాటకాయాల్సి వస్తుంది. కన్నవారు చేసే పని అత్తవారు చేస్తే బాగుంటుందా? అదొచ్చి తల్లిదండ్రుల్లేరు ఆ అన్నయ్య, వదిన ఇటువంటి వాళ్ళా అని ఆడిపోసుకుంటారు. ఆ పోరు మన పిల్లల పిల్లకి చూపెడ్తాది. నేనెళ్ళి తీసుకొద్దామంటే ఈ చంటోడికి వాంతులు, విరోచనాలు అవుతున్నాయి.

 పంతులుగార్ని అడిగి తీసుకురా.’’ఒరేయ్‌ నాయనా...ఽధర్మ, భీమ, అర్జున, నకుల లేవండీ. మహాలక్ష్మి చంటోణ్ణి చంకన పెట్టుకుని నలుగురు కొడుకుల్నీ లేపింది. నలుగురూ లేచి, రెడీ అయ్యి ‘‘అమ్మా...మేం బడికి పోతాం’’ పుస్తకాలు పట్టుకొని మహలక్ష్మికి చెప్పేసి వెళ్ళారు.రెండు రోజులు గడిచాయి. భర్తకోసం నిరీక్షించింది ఆమె. ఈయన చెల్లెలు దగ్గరకెళ్ళి రెండు రోజులయింది. ఇంకా రాలేదేమిటి? ఏటి కారణం? ఏం జరిగిందో? పిల్లో పిల్లోడో పుట్టేశారా? వచ్చేవరకు నాకు నిద్ర పట్టదు. నోట్లోకి ముద్ద వెళ్ళదు. ఇంటిముందు గుమ్మం దగ్గర కూర్చొని చంటోణ్ణి చంకన పెట్టుకుని, నిలబడి ఆలోచిస్తూ ఎదురు చూస్తోంది మహాలక్ష్మి.

ఈలోగా మేనల్లుణ్ణి ఎత్తుకొని, చెల్లెలితో పాటు వస్తున్నాడు వైకుంఠం.మహాలక్ష్మికి మనసు కుదుటపడింది. ‘హమ్మయ్య’ అంటూ ఇంట్లోకెళ్ళి చెంబుతో నీళ్ళు, పిడికెడు అన్నం పట్టుకొచ్చి ఆడపడుచుకు దిష్ఠి తీసింది.‘‘పార్వతీ...తమ్ముడు రాలేదు. ఏమ్మా..? మా మీద కోపమా?’’ ఆడపడుచును అడిగింది మహాలక్ష్మి.‘‘అదేం లేదొదినా, మీ తమ్ముడు వచ్చేస్తే ఎలాగొదినా? అరడజను పశువులు... పొలంలో పంట... బాధ్యత గల మనుషులు ఎటూ వెళ్ళే వీలు ఉండదుగా.