చిన్నపిలగాడి మాదిరి కొమ్మల్ని ఆడిస్తా వానలో తడస్తా వుండాది యాపచెట్టు.చీకటి గుడ్లురుమతా తళతళమని మెరుపు కత్తుల్ని విసరతా వుండాది.మూలస్తానమ్మ గుడిలో కొలువుదీరిన దీపాలు గాలికి రెపరెపలాడతా తలలూపుతున్నాయి.రాతి కూసం మింద కుర్చున్న కప్పూరదీపం అనిందిగదా!‘‘ఈ వాన వెలిస్తేగాని గోపినింటిది రాదు. గోపినింటిది వస్తేగాని మనము దేవలోకానికి పోలేము. ఈ రాత్తిరి మనకు శివరాత్తిరి జాగారమే’’ అనింది గమగమా పలవరిస్తా.‘‘అబ్బా... ఏమి పరిమళమే నీది. మనసుని భక్తిభావంతో నింపేస్తావు. అందుకే నువ్వంటే దేవుడికి అంత ఇష్టం’’ అనింది పరవశిస్తా రాశింటి దీపం.‘‘నిన్ను చూస్తే మాకు భలే కుళ్ళుగా వుంటుంది తెలుసా? దేవునికోసమే పుట్టావు. దేవుని హృదయాన్ని వెలిగిస్తావు. ఎంత అదృష్టమే నీది’’ అనింది పెద్దింటి దీపం.‘‘నేను దేవునికోసం పుట్టిన మాట నిజమే కాని, నేను ఎంతసేపు వెలుగుతానని, నాదేమదృష్టం? అదృష్టమంటే చిన్నపిలకాయలది గదా! దేవుడు పిల్లోల్లకోసమే పుట్టినాడు. ఎపడూ వాళ్ళ హృదయాలలోనే కొలువై వుంటాడు’’ అని చెప్పింది కప్పూరదీపం.‘‘పిల్లోల్లంటే దేవుడికి అంత ఇష్టమా?’’ అని అడిగింది మిద్దింటి దీపం.‘‘చిన్నగా చెప్తావా తల్లీ! పిలకాయలంటే పాణం. ఎంతపాణం అనేది నెమలిదేవుడు కత చెప్తేనే గాని మీకు అర్తంగాదు’’ అనింది కప్పూరదీపం.‘‘అయితే ఆ కతేంటో చెప్పరాదా?’’ అని అడిగింది రాశింటి దీపం.కప్పూరదీపం గమగమా పలవరిస్తా కతనెత్తుకునింది. 

ఆపొద్దు బడికి పోలేదు పెదబ్బ.అంతకుముందు రోజు నాలుగోపాఠం వరకు నోట్సు రాసుకోని రమ్మని చెప్పినాడు సుబ్బారెడ్డి అయివోరు. ఇంటికొచ్చినాక గూడా చదువుకోవడం, రాయడమంటే భలేబాధ పెదబ్బకి.నోట్సు రాయనందుకు కానగబరగ ఇరిగిపొయింది. వొంటిమింద వాతలు తేలిపొయినాయి.అయినా బుద్ధుంటే గదా! దెబ్బల్ని బడిలోనే మరిచిపొయినాడు. రాత్తిరి చిన్నవ్వ బాలనాగమ్మ కత చెప్తా వుంటే వింటా మల్లా నోట్సు రాయడం మరిచిపొయినాడు.తెల్లారినాక,కడుపునిండా సద్ది తాగి పుస్తకాలు బేగులో సర్దుకుంటా వుంటే గుర్తుకొచ్చింది.‘‘ఓరి నీయక్కా! నోట్స్‌ రాయడం మరిచిపొయినామే’’ అని నాలిక కొరుక్కున్నేడు పెదబ్బ.‘‘ఈ పొద్దు బడికిపోతే చావేగతి. ఇంట్లోనే వుంటే బడికి ఎందుకు పోలేదని కల్లేణమ్మ సావగొట్టేస్తింది. ఏం చేసేదిరా దేవుడా!’’ అని మనసులో అనుకుంటా పుస్తకాల బేగు సంకకు తగిలించుకుని మంగళగుట్టలో నడస్తా వుండాడు. దెబ్బలు తప్పించుకునే ఉపాయం తట్టింది.