‘‘అమ్మ ఎవరి దగ్గరుండాలి?’’పెద్దవాడు రెండో వాడి వైపు చూసాడు.రెండోవాడు మూడోవాడి వైపు చూసాడు.‘‘ఎవరి దగ్గర ఉండాలంటారేమిట్రా? ఎవ్వరి దగ్గరైనా ఉండవచ్చు...’’నా ఒక్కగానొక్క కూతురు ముగ్గురు అన్న దమ్ముల్ని నిలదీసింది.‘‘అదికాదే... నేను ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్ల మీద తిరుగుతుంటాను. ఉండేవన్నీ చాలీచాలని అద్దె కొంపలు...’’ పెద్దవాడు భార్య వైపు చూశాడు.హాల్లో కూరగాయాలు తరుగుతున్న నేను, నిశ్శబ్ధంగా వాళ్ళ సంభాషణ వింటున్నాను.‘‘పోనీ రెండోవాడి దగ్గర ఉంటేనో..’’ నా కూతురు అంటే..‘‘ఉదయాన్నే ఆరింటికి తయారై ఇద్దరం ఉద్యో గాల కోసం వీధిన పడుతుంటే నాకెలా కుదురు తుందే...’’ రెండోవాడు నీళ్ళు నములుతుంటుంటే’’.. మళ్ళీ నా కూతురే అంది.‘‘మీకు సహాయంగా ఉంటుంది గదరా! పిల్లలు పుట్టిన తరువాత అయినా ఆసరాగా అమ్మ ఉంటుంది గదా...’’!‘‘అప్పుడు చూసుకుందాములే! అందాకా.... తమ్ముడి దగ్గర ఉంచుదాములే...’’ మూడోవాడి వైపు చూశాడు.‘‘మా పెళ్ళయి సంవత్సరమైనా కాలేదు... కొంచెం ఏకాంతంగానైనా మమ్మల్ని ఉండనివ్వ రాదటండీ?’ మూడో కోడలు కుండ బ్రద్దలు కొట్టి నట్లు చెప్పేసింది.‘‘పోనీ.. నీ దగ్గర ఉంచుకోరాదటే... అమ్మ పెన్షన్‌ నీకే ఇస్తుంది’’.ముగ్గురూ మా అమ్మాయికి ఆశపెట్టారు.‘‘ఎవరికి కావాలిరా..... అమ్మ పెన్షను? నేను ఉండేది...అమెరికాలో! అమ్మకు పాస్‌పోర్ట్‌, వీసా కావాలంటే... అంత తేలికగా వచ్చేవేనా?’ నా వైపు చూసింది.

‘‘ఇప్పుడంత అవసరమేమొచ్చిందర్రా...’’ ఉండ బట్టలేక అనేశాను.‘‘ఏమొచ్చిందా! ఇంకా ఎంతకాలముంటా వమ్మా!’’ ఇలా ఒంటరిగా...’’ కుమార్తె అంది.‘‘అమ్మకు... నాన్నన్నా.... నాన్న కట్టించి ఇచ్చిన యూ యిల్లన్నా ప్రాణంతో సమానమే! అంత తేలి కగా వదలి రాలేదు! వదిలి రాదు!’’’పెద్దవాడి మాటల్లో పొగడ్త కంటే.. నిష్ఠూరం ఎక్కువనిపించింది.క్షణకాలం ఆయన మళ్ళీ జ్ఞాపకాల్లోకి వచ్చే శారు.‘‘నేను వెళ్ళిపోతున్నానని దిగులు పడకు సుజాతా! ముచ్చటగా ముగ్గురు కొడుకుల్ని, ఒక్క కూతుర్ని పెంచి పెద్ద చేశాం. ఉద్యోగాలు వచ్చేంత వరకూ వాళ్ళ సదుపాయం చూశాం! పవిత్ర దేవా లయం వంటి ఇల్లు కట్టుకున్నాం! నేనున్నా... లేక పోయినా... వాళ్ళు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసు కుంటారు...’’నిజమే! విశాలమైన కాంపౌండ్‌లో.... ఆరు గదులతో... రెండు పోర్షన్‌లుగా నిర్మించుకున్న ఇల్లు మా కలల పంట! నా నగలన్నీ అమ్మేసి... బ్యాంక్‌ లోన్‌తో ఆరుగురికి సరిపోయేలా డిజైన్‌ చేసిన ఇల్లు... మాకు ఆలయమే!