మెత్తని పట్టుపరుపైన వత్తుగా పరచిన పూలపై పడుకుని ఎలువైపు దొర్లినా ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు రమేష్‌కు... ఉద్వేగంగా ఉబికే శృంగార భావాల అలజడికీ, అగరొత్తుల పరిమళానికీ, కవ్వించే చిత్రభంగిమలకీ కాదు అతనికి నిద్రపట్టకపోవడం-ఫస్ట్‌నైటే నవవధువు ధోరణికీ... ‘సారీ!... గుడ్‌నైట్‌’ అంటూ దూరంగా వెళ్లి పడుకున్న సునీత తీరుకూ అవాక్కయాడతను.ఏవిటిలా జరిగింది? ఎంత విద్యావంతురాలైనా.. ఎంత ఉన్నతోద్యోగిని అయినా శోభనపు పెళ్లికూతురు యిలా నిర్భయంగా, నిస్సిగ్గుగా తన భావాల్ని వెల్లడిస్తూందని రమేష్‌ అనుకోలేదు... ఆలోచనలు చెదపురుగుల్లా మెదడును తొలుస్తున్నాయి. ఎన్ని తీయని భావనలు మోసుకొచ్చిడు తాను. ఆలోచించు కొద్దీ కోపం వస్తూంది. అహం కదిలింది - కించిత్తు అవమానంగా కూడా ఫీలయ్యాడు. ఎలాగయినా తన మాట నెగ్గించుకోవాలి - ఏం చేయాలి?.... ఆలోచనలతోనే తెల్లారింది.సంకోచిస్తూనే - మరో మార్గం లేక విషయాన్ని తండ్రి చెవినవేశాడు. విన్న సుందర్రామయ్య ‘చవటాయ! నాకడుపున చెడబుట్టావు గదరా!’ అనబోతున్నట్లు ఫీలయ్యాడు రమేష్‌. కానీ కొడుకునలా చులకన చేయలేదు సుందర్రామయ్య - కానీ - ‘పోనీ’ ఆ పిల్ల మాట ప్రకారం నడుచుకోకపోయావా ?’ అందామనుకన్నాడు. ఇంతలోభార్య కనకదుర్గ వస్తుండడం గమనించి మౌనం వహించాడు. అమ్మ వస్తుండడంతో జరగబోయేది ఊహించుకుని అక్కడినుండి తప్పుకున్నాడు రమేష్‌.విషయం విన్న కనకదుర్గ కస్సుమంది. ‘ఆ పిల్ల తీరు తలబిరుసు వ్యవహారంలా వుంది, మాట వినేరకంగా లేదని నే నానాడే అనలా, నా మాట విన్నారా!’ అంది... అనుభవించండి అన్నట్లు చూస్తూ ఆమె మాటతీరు తెలిసిన సుందర్రామయ్య మౌనపాఠం అప్పగించాడు.

అలస్యం చేయకుండా కనకదుర్గ రంగంలోకి దిగింది. నేరుగా సునీత తల్లి పార్వతిని కలిసింది... వెళ్తూనే ‘‘ఏవమ్మా పార్వతమ్మా! యిదేవన్నా బావుందా చెప్పు? చెప్పుకుంటే సిగ్గుచేటు దాచుకుంటే తలవంపులు అనీ ఎంతకాలం మారినాచ మాయ చదువులు వచ్చినా - ఆడపిల్లలు తల్లులు కావడానికి ఇష్టపడరా? పిల్లల్ని కననంటే ఎలాగా? మరీయింత సిగ్గుమాలిన తనమా? ... యిదేం విడ్దూరం? అసలు మనం పిల్లల పెళ్లిళ్లెందుకు చేస్తాం! - ఏదో, సంవత్సరం తిరిగేసరికి మనవడో మనవరాలో కలిగితే వాళ్ళతో ఆనందంగా కాలక్షేపం చేయాలనేగా - మీ అన్నయ్య ఎన్నాళ్ళబట్టో భుజాలు ఖాళీగావుంటే బావుండడం లేదురా, తొందరగా పెళ్లి చేసుకుని నా ముచ్చట తీర్చు అంటూ కొడుకుని రోజు సాధిస్తూండేవాడు.. తీరా ఆ ముచ్చట్ల ముహుర్తానికి ...అవ్వ! - ఆడపిల్ల అడ్డంకులు పెట్టడమేమిటి?.. ఎక్కడన్నా వుందా?’’ అంటూ ఏకబిగానా లెక్చరిచ్చింది.... దులిపేస్తున్నదోరణిలో!ఆమెకి ఏం సమాధానం చెప్పాలో పార్వతికి అర్థం కాలేదు. సునీత తత్వం, ఆలోచనలు ఆమెతో చెప్పలేకపోయింది. అనవసరపు రభస చేస్తుందని భయపడి చివరికి ‘‘వదినెగారు! అది చిన్నపిల్ల - తెలియదు, నే చెప్తాలెండి’’ అని సముదాయించి పంపింది.