‘‘ఏం చేస్తున్నావు మిత్రమా?’’‘‘అసహజంగా బ్రతుకుతూ ‘సహజ’ జీవితం గురించి ఆలోచిస్తున్నాను!’’‘‘అర్థం కాలేదు!’’‘‘అసలు మనిషినే వాడు ఎలా బతకాలా అని ఆలోచిస్తున్నాను!’’‘‘పిచ్చిప్రశ్న..! ఆల్‌ రెడీ నువ్వు బతుకుతున్నావు... ఇంకా ‘ఎలా’ అనే ప్రశ్న ఎందుకు?’’‘‘బతుకుతున్న యీ ‘బతుకు’ నాకు సంతృప్తిని గానీ ఆనందాన్ని గానీ ఇవ్వటం లేదు!’’‘‘పోనీ ఎలా బ్రతికితే బాగుంటుందనుకుంటున్నావూ?’’‘‘నాకు తెలీదు... నీకు తెలిస్తే చెప్పు!’’‘‘నలుగురికీ మంచి చేస్తూ, వీలున్నంత సుఖంగా బ్రతకడంలో ఆనందం వుంది!’’‘మంచి’ అంటే?‘‘ఒకరికి ఉపయోగపడటం, లేదా సహాయపడటం, లేదా సేవ చెయ్యడం!’’‘‘మొట్టమొదట నాకు నేను ‘ఉపయోగ’ పడగలిగితే కదా ఇంకొకరి సంగతి ఆలోచించగలిగేది?’’‘‘నీకు నువ్వు ఉపయోగపడటం అంటే?’’‘‘ఇదిగో యీ శరీరం ఉంది... మనసు ఉంది... ఆత్మఉంది... మూడింట్లో దేనికీ సంతృప్తి లేదు... ఆనందమనేది లేదు... నిరంతరం ఓ ఒంటరితనం ఓ వేదన..’‘‘దేనికి? చక్కని ఆరోగ్యం ఉంది. కార్లూ మిద్దెలు మనషులూ అందరూ ఉన్నారు.... నీకున్నంత స్వేచ్ఛ చాలా తక్కువమందికి దొరుకుతుంది... ఇంకా ఎందుకీ అసంతృప్తి!’’‘‘ఇవేవీ నాకు ఆనందాన్నో సంతృప్తినో ఇవ్వటం లేదు.

 ఆఖరికి కన్నీళ్ళు కూడా ఆనందాన్ని ఇవ్వటం లేదు’’‘‘కన్నీళ్ళు ఆనందాన్నివడమా?’’‘‘ఓరి మూర్ఖుడా! ఏడిస్తే వచ్చే సుఖం నీకేం తెలుసు? గుండెలోని వేదనంతా వెచ్చగా కన్నీటిరూపంలో ప్రవహిస్తుంటే వచ్చే ఆనందాన్ని నువ్వెరగవు...!’’‘‘పోనీ ఏడిస్తే పోతుందిగా!’’‘‘ఆ ఏడుపే రావటం లేదు. ‘వేదన’ గడ్డకట్టిపోయింది. దాన్ని ఎలా ధ్రువీకరించాలో తెలియటం లేదు!’’‘‘........... ...........’’‘‘ఇప్పుడు అర్థమైందా? అసహజంగా బ్రతకడం అంటే?’’‘‘ఉమా...!’’‘‘సరే... నాకు కార్లు మిద్దెలూ మనుషులూ స్వేచ్ఛా ఉన్నాయనీ, అవన్నీ నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయనీ నువ్వనుకుంటున్నావు. నీలాగే చాలా మందీ అనుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో మీ ఇష్టం. నాకు మాత్రం ఇవన్నీ ‘పాములు’ చుట్టుకున్నట్టుగా ఉంది. ఆఖరికీ యీ శరీరం కూడా బరువుగానే ఉంది. శరీరమే ఎందుకూ? మనసూ అలానే ఉంది. ఓ క్షణం ఒకటాలోచిస్తే, మరో క్షణం మరో ఆలోచనలోకి మనసు జారిపోతోంది. అసలెందుకూ యీ ఆలోచనలు?’’‘‘అందుకే పూర్వులు చెప్పారు. మనసు అదుపులోపెట్టుకోమని’’.‘‘ఎలా?’’‘‘ధ్యానం ద్వారా’’‘‘అంటే?’’‘‘ఏదో ఒక్కదాని మీద మనసుని లగ్నంచెయ్యి. దాంతో ఆలోచనల అలలు ఆగిపోతాయి!’’‘‘దేని మీద లగ్నం చెయ్యమంటావు?’’‘‘భగవంతుడి మీద!’’‘‘భగవంతుడంటే ఎవరు?’’‘‘మూర్ఖుడా... భగవంతుడంటే సర్వాంతర్యామి!’’‘‘సర్వంలో ఉండే వాడు నాలో ఉండడా?’’‘‘ఉన్నాడు గనకే ఆయన మీద లగ్నం చెయ్యమంటున్నా!’’‘‘నువ్వు పిచ్చివాడివో వెర్రివాడివో నాకైతే అర్థంగావటంలా! నాలో ఉండే వాడ్ని నేనెందుకు ధ్యానించాలి?’’‘‘నీలో ఉండేవాడి అసలు స్వరూపం నీకు తెలీదు గనక!’’‘‘పోనీ నీలో ఉండే వాడి స్వరూపం నీకు తెలుసా?’’‘‘ఎందుకు? నా విషయం నీకెందుకు?’’‘‘ఎందుకంటే, నీలో ఉండే వాడే నాలోనూ ఉంటాడో, ఉన్నాడో గనక, ఆ స్వరూపం నీకు తెలిస్తే నాకూ తెలిసినట్టేగా?’’