నాకీ మధ్య హఠాత్తుగా కథలు రాసే యావ తగ్గిపోయి రాయడం మానేశాను. కథ రాయడం మానేయడానికి కథ వుంది.నేనెప్పుడూ కంచికి వెళ్ళిన కథే మంచికథ అనుకుంటాను. కథలు ముమ్మరంగా రాసే రోజుల్లో నేనోసారి కంచికి వెళ్ళేను. నా కథ లెక్కడేనా కనిపిస్తాయేమోనని కాంచీపురమంతా కళ్ళు కంచుకాగడాల్లా చేసుకుని కాంచేను. కనిపించలేదు. నేను కంచికి చేరినా నా కథలు కంచికి చేరలేదు. అంచేత నేను మంచివి రాయలేదనుకున్నాను. నాకు చాలా బాధేసింది. భయమేసింది. దాంతో కథ వ్రాయడం మానేశాను - అలా వ్రాయకపోవడం వల్ల వూసుపోడం మానేసింది. తోచడం కోసం తోచినప్పుడల్లా సినిమాలు చూడ్డం ప్రారంభించాను. అలా చూడగాచూడగా చూడ్డం ముదిరిపోయి, నన్ను కూడా అలా తెరమీద అందరూ చూస్తే బావుణ్ణనిపించింది. తక్షణం రచయితగా రాయడం మానేసి, తెరమీద నటుడినై రాణించాలనుకున్నాను.ఉత్తరక్షణం లుంగీ కట్టుకుని మద్రాసు పోయే రైలెక్కేశాను.మద్రాసు నగరం మహత్తరంగా అనిపించింది. కొత్తజీవితం గురించి కొత్త కలలు కంటూ పాండీబజార్లో బృందావన్‌ లాడ్జిలో దిగాను. రైలు ప్రయాణం బడలికలో ఆ పగలంతా నిద్రలో టెక్నికలలు కూడా కన్నాను.సాయంత్రమైంది. రూముకి తాళం వేసి బజార్లో కొచ్చేను. 

అటూ యిటూ చెట్లతో అశోకుడు పాలించిన రాజ్యంలా పాండీబజారు కళకళ్ళాడుతోంది. చెట్లకింద చిన్నతరహా నటులు తెలుగు మాట్లాడుకుంటున్నారు. కాఫీ తాగుదామని వీ.కె. రెస్టారెంటులోకి వెళ్ళేను. టేబులు దగ్గర ఒక్కణ్ణి కూర్చుని కాఫీ తాగుతూంటే కప్పు కాళీ అయ్యే సమయానికి ఎదుటి సీట్లో కూర్చుంటూ ఎవరో ఒకతను నన్ను పలకరించేడు.‘‘వేషాలకొచ్చేరా?’’ స్వచ్ఛమైన తెలుగులో స్పాట్‌ డయగ్నోసిస్‌ చేసేశాడు.‘‘కాఫీ’’‘‘మీరెవరు?’’ అన్నా.‘‘నన్ను వేలుమణి అంటారు. ఈ ఫీల్డుకి పాతికేళ్ళు పాతవాడ్ని. యిక్కడికి రాక మునుపు వెంకటనరసయ్యని. కొత్తలో ఈ వూరు నీళ్ళుపడక పేరు మార్చుకున్నాను; ఇప్పుడు ఈ బజార్లో ఏ చెట్టు నడిగినా కొమ్మలూపుకుంటూ నా కథ చెప్తుంది’’ కాఫీ వచ్చింది. ‘‘మరో పట్టు పట్టండి’’ మళ్ళా మరికాస్త కాఫీ తాగేను.‘‘పదండి. అలా నడుస్తూ మాట్లాడదాం’’ బిల్లు నాచేతిలో పెట్టేడు.పాతుకుపోయిన నటుడిలా అనిపించేడు నాకు. కానీ అతని బొమ్మ నేను ఏ చిత్రం లోనూ చూసిన గుర్తు లేదు.‘‘బీచ్‌కి వెళ్దామా?’’ సిగరెట్టు వెలిగించేడు నాకొకటిస్తూ. నేను ముట్టిస్తూంటే పిలిచేడు - ‘‘టాక్సీ!-’’టాక్సీ దిగేం, మీటరు చూసి వేలుమణి లెక్కచెప్పేడు. పే చేసేను. రోడ్డు దిగి యిసుకలో నడుస్తూంటే వేలుమణి మాట్లాడటం ప్రారంభించాడు.‘‘నేను పాతిక సంవత్సరాల క్రితమే నా నట జీవితం ప్రారంభించాను. ఎన్నో రకాల పాత్రలు ధరించాను. మీకు నచ్చిన పాత్ర ఏది? అని చాలామంది ప్రెస్‌ మనుషులు చాలాసార్లు అడిగేరు. తల్లిని పిలిచి నువ్వు కన్న పిల్లలందర్లోకి ఎవర్ని ఎక్కువ అభిమానిస్తావని అడిగితే అందుకు ఆ తల్లేం బదులు చెప్పగలదు చెప్పండి? అదుగో ఆ తల్లి లాగే నేనూ తల్లడిల్లిపోయి సమాధానం చెప్పలేక పోయేవాడ్ని. బటానీలు కొనుక్కుందాం’’ అన్నాడు కొనుక్కున్నాం.