ఆదర్శానికి ఆచరణకి ఉన్న అంతరం మొట్ట మొదటిసారి నాకు అవగతమయ్యింది. నా అంతరాత్మకి ఈ రోజుకీ నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. దానధర్మాల గురించి ఉదాత్తంగా, సహాయ సహకారాలు గురించి ఉన్నతంగా పలికే నేను ఓ నిండు ప్రాణాన్ని అవకాశముండీ ఆదుకోలేకపోయాను. విశ్వనాథం విషయంలో నేను సగటు మనిషిలాగే ప్రవర్తించాను. విశ్వనాధాన్ని ‘విశ్వం’ అని పిలుస్తాం. అతను నాకు దూరపు బంధువు. చిన్నప్పట్నుంచి తెలుసున్న వాడయినా, ఈ ఊరు నాకు ట్రాన్సఫర్‌ అయి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలోను మా మధ్య స్నేహం బాగా పెరిగింది. నిజానికి విశ్వం నేనూ కలవని రోజంటూ లేదు. రోజూ నేను ఆఫీస్‌ నుంచి రాగానే విశ్వానికి ఓ ఫోన్‌ కొట్టేవాణ్ణి. సాధారణంగా విశ్వం తన కూతురు అనూహ్యను తీసుకొని మా యింటికొచ్చేవాడు. విశ్వానికి అనూహ్య అంటే ప్రాణం. ఎనిమిదేళ్ళ అనూహ్య పన్నెండేళ్ల మా బాబు వినీత్‌తో ఆడుకుంటూండేది. మేమిద్దరం దగ్గర్లోని గాంధీ పార్క్‌కో, రోజా టాంక్‌కో వెళ్ళేవాళ్ళం. తరచూ దక్షిణం వైపునున్న మా బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం.విశ్వం ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసిరాక పోవడంతో కారు డ్రైవింగ్‌ స్కూలు పెట్టాడు. ఎవ రికి ఏ సహాయం చేయాలన్నా వెనుకాడేవాడు కాదు.

అతను నాకు చేసిన సహాయం మర్చిపోలే నిది. మా వినీత్‌కు తరచు కడుపునొప్పి వస్తూండేది. లోకల్‌గా గాస్ర్టో ఎంటరాలజిస్ట్‌కు చూపించి, టెస్ట్‌లు అన్నీ చేయించి మందులు వాడుతున్నాం. ఓ రోజు ఉదయం అకస్మాత్‌గా నొప్పి ఎక్కు వయ్యింది.‘‘నాన్నా! ఏదన్నా చెయ్యి. బాధ భరించలేక పోతున్నా’’ అని వినీత్‌ గోలచేస్తున్నాడు. నా భార్య రాధ గుడ్ల నీరు గ్రక్కుతోంది. నాకు ఏం చేయ్యాలో చెయ్యి కాలు ఆడటంలేదు. డాక్టర్‌కు ఫోన్‌ చేస్తే ‘ఏం ఫర్వాలేదు ఆ మందులే వాడండి. తగ్గి పోతుంది’ అన్నారు.సరిగ్గా అదే సమయానికి విశ్వం వచ్చాడు.‘‘ఏమిటి కృష్ణగారూ! వినీత్‌కు తగ్గలేదా?’’ అన్నాడు.‘‘రాత్రి కొద్దిగా వచ్చింది. ఉదయం నుంచి మరీ ఎక్కువయ్యింది. హైదరాబాద్‌ వెళ్దామంటే పన్నెండు గంటలు ప్రయాణం. రైల్వే రిజర్వేషన్‌ దొరకలేదు’’ అన్నాను.‘‘హైదరాబాద్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి గారి దగ్గరకే కదా!’’ అన్నాడు.‘‘అవును ఆయనైతే కరెక్టగా డయాగ్నైజ్‌ చేస్తారు. ధైర్యంగా ఉండొచ్చు’’ అన్నాను. వినీత్‌ మాకు లేకలేక పెళ్లైన పదేళ్ళకు పుట్టాడు.అప్పటికే స్థానికంగా ముగ్గురు డాక్టర్స్‌కు చూపించడం సాయినాధునికి మొక్కుకోవడం అయిపోయాయి.‘‘మీరేం వర్రీకాకండి. మీరు ప్రయాణానికి రెడీ అవండి మీ కారు కీస్‌ ఓ సారిలా ఇవ్వండి’’ అన్నాడు.కారు కీస్‌ ఇచ్చాను.‘‘నేను ఇప్పుడే ఓసారి మెకానిక్‌ చేత చెక్‌ చేయించి తీసుకొస్తా. ఓ గంటలో బయల్దేరుదాం. మీరు రెడీగా ఉండండి’’ అన్నాడు. నాకు విశ్వంలో సాయిబాబా విశ్వరూప సందర్శనం అయిన ట్లయింది. ఆ బాబాయే ఈతన్ని చూపించాడా లేక ఆ బాబాయే వచ్చాడా అన్పించింది.