అమెరికానుండి వచ్చిన వారం రోజులకు మా హోంటేకర్‌ ద్వారా తెలిసింది వసుంధర వృద్ధాశ్రమంలో ఉన్నట్లు. అంతుకు మించి వివరాలు చెప్పలేకపోయింది. దాంతో నా మనసంతా చాలా భారంగా మారిపోయింది.ఆ రాత్రి, నిద్రకు వెలియై, ఒంటరిగా నా గదిలోపల, చీకటిలో మనలేక పుస్తకాల షెల్ఫ్‌వైపు చేయిసాచాను. ఆ షెల్ఫ్‌నిండా నాకెంతో ఇష్టమయిన పుస్తకాలని పేర్చుకున్నాను. నిదుర రాని వేళల్లో నాతో ఊసులాడే నేస్తాలవి. చేతికందిన బుక్‌ తీసుకుని, టేబుల్‌ లాంప్‌ ఆన్‌ చేసి వేలు తిప్పిన పేజీ నుండి చివరికంటా చదవడం అలవాటు. ఈ రోజు చేతికందిన పుస్తకం ‘అమృతం కురిసిన రాత్రి’ పేజీ తిప్పి, అక్షరాలవంక చూపులు సారించాను.‘‘కనుగూడులు నల్లనయిపెనుమోడులు చల్లనయికీలుకీలుగా బాధగానాడు నాడులూ లాగగాచలిగాలి చూరులో కసిరినట్లుచలిచీమ మట్టిలో దొలిచినట్లువచ్చినది మూగినదిముసిరినదీ ముసలితనం-ఏ బాధనయితే మరవడానికి పుస్తకాన్ని ఆశ్రయించానో, అదే గాయం రేపింది. వసుంధర కన్నీళ్ళతో దీనంగా నాకోసం చూస్తున్నట్లనిపించింది. సాయంత్రం నుండి ఆదిత్య సెల్‌కి చేస్తోంటే రెస్పాన్స్‌ లేదు. వాడింటికి వెళ్ళాలంటే దాదాపు ముప్ఫై నలభై మైళ్లు ప్రయాణం చేయాలి. నాకున్న స్పాండిలైటిస్‌ వల్ల అంతదూరం వెళ్ళడం బాధని మరింత చేసుకోవడమే. పోనీ అందుకు సిద్ధపడి వెళ్ళినా కలుస్తారన్న నమ్మకం లేదు. 

జాబ్‌రీత్యా ట్రాన్స్‌ఫరయి వుంటే వెళ్ళీ లాభం లేదు. అందుకే ఏం చేయాలో తోచక మనసంతా గజిబిజిగా మారింది. వృద్ధాప్యం చాలా బాధాకరమయినది. ఆ వయసులో మనలనాదరించేవాళ్ళు లేకుంటే నరకమే. వసుంధర మరీ వృద్ధురాలేం కాదు. నాకన్నా ఒకట్రెండేళ్లు పెద్ద. అంటే ఇప్పుడు యాభై తొమ్మిదో - అరవయ్యో వుంటాయంతేగా. నాకన్నా మంచి ఆరోగ్యవంతురాలు. మరి ఆదిత్య ఎందుకు ఇలా చేసాడు? ఎదురుగా ఉంటే నాల్గు వాయించేవాణ్ణే - పెళ్ళాం చేతిలో కీలు బొమ్మయిపోయాడా? అంత వ్యక్తిత్వం లేకుండా తయారయ్యాడా? అయినా ఈ వసుంధరకి - ఏమైంది? ఇంత జరిగినా ఒక్క ఫోనయినా చేయకుండా ఎలా ఉంది? ఆదిత్య చేసిన పనికి మొత్తం మనుషులందరి మీదా నమ్మకం పోయి వుంటుందా? అవును. అదే జరిగి వుంటుంది. అసలే అభిమానధనురాలు. తన బాధలు నాకు చెప్పి మరింత బాధ కల్గించడమెందుకనుకుందో. అది మొదటినుండీ అంతే. ఎంత బాధనైనా దిగమింగుకొనేది. ‘‘ఏంటే ఏ బాధా విషాదాలు నీ మొహంలో కన్పించనీయవు’’ అంటే నవ్వేసేది. ఎంత బాధున్నా పూల జలపాతాన్ని మర్పించే నవ్వు నవ్వుతుంది.ఎవరి విషయంలోనో ఇలా జరిగితే నాకింత బాధుండేది కాదు గానీ, నా చిన్ననాటి నేస్తం, కాలేజీవరకూ కలిసి చదువుకొన్న స్నేహితురాలు ఇప్పటివరకూ నా మంచిని కోరే హితురాలూ అయిన వసుంధరకీ పరిస్థితి రావడానికి మూలకారణం నేనేమోనన్పించి, మనసు జరిగిన సంఘటనలను రివైండ్‌ చేయసాగింది.