సాయంత్రం నాలుగు గంటలు.ఆఫీసులో ఓ ముఖ్యమైన సమావేశంలో వున్నాను. మొబైల్‌ మోగింది. చూస్తే ఇంటినుంచి. వెంటనే కట్‌చేసి మీటింగ్‌లో మునిగిపోయాను.మీటింగ్‌ ముగిసేసరికి అయిదు గంటలు. నా సీట్లోకొచ్చి ఇంటికి ఫోన్‌ చేశాను.‘‘అక్కకు అబ్బాయి పుట్టాడు నాన్నా. మీరేమో ఫోన్‌ కట్‌చేశారు. మళ్ళీ మీరు ఫోన్‌ చేస్తారేమోనని చూసి, చూసి అమ్మ ఇపడే హాస్పిటల్‌కు వెళ్ళింది’’ మా అబ్బాయి చెప్పాడు.అంటే నేను, నేను తాతనయ్యాను!ఆ తలపే మనసును పులకింపజేసింది.‘‘సరే నేను నేరుగా హాస్పిటల్‌కు వెళతాను’’ ఫోన్‌ పెట్టాను.స్నేహ! నా నోటినుంచి ఊడిపడ్డ రత్నం (మా అమ్మాయిది నా పోలికే) నా కళ్ళముందే పెరిగి పెద్దయిన మొక్క! అపడే అమ్మయింది! నలభైఅయిదేళ్ళకే నన్ను తాతను చేసింది. నా మనసు మనసులో లేదు. ఎపడు నా మనవణ్ణి చూస్తానా అనే ఆతృత. వెంటనే ప్యాకప్‌ చేసి హాస్పిటల్‌కు బయలుదేరాను.హాస్పిటల్లో!స్నేహ పొత్తిళ్ళలో బాబు! నా మనవడు! అలా చూస్తూనే వున్నాను.‘‘బావా! ఇక్కడ మేము కూడా ఉన్నాము. ఓ కన్ను ఇక్కడ కూడా పారేయండి. ఎంతసేపలా చూస్తారు? మీ మనవడే. మీ పోలికే!’’మా మరదలి మాటలతో ఈ లోకంలోకి వచ్చాను.

‘‘వాడికి మనవడు కాని, నీకు మాత్రం కాడా ఏమిటి? నువ్వు గంటలతరబడి చూడగా లేనిది, మావాడు కొన్ని సెకండ్లు చూసినంతమాత్రాన దిష్టితగలదులే’’ మా అమ్మ చురక అంటించింది.అది స్పెషల్‌ రూం. మా వియ్యపురాలు, వాళ్ళ తాలూకు బంధువులు, మా తాలూకు బంధువులు, వీరందరితో స్పెషల్‌ రూం కోలాహలంగావుంది.పసివాడ్నికొందరు అమ్మాయి పోలికంటే, కొందరు మా అల్లుడి పోలికన్నారు. మా మరదలిలాంటి కొందరు, నా పోలికన్నారు. ఇలా ఎవరి తాలూకు వాళ్ళు వాళ్ళవాళ్ళ పోలికలను ఆ పసివానిలో చూసుకున్నారు. నాకైతే మా అమ్మాయి స్నేహ, అల్లుడు కిరీటిల పోలికలు కనిపించాయ. కళ్ళు స్నేహవయితే, ముక్కు కిరీటిది. నోరు మాత్రం నాలా వెడల్పుగా ఉంది.నా పిచ్చిగానీ, పుట్టగానే పోలికలు కనిపెట్టగలమా? బాబు పెరుగుతున్నకొద్దీ ముఖ కవళికల్లో మార్పులు వస్తాయి. తల షేపు కూడా మారుతుంది. మూణ్నెల్లకి గాని స్పష్ట ముఖకవళికలు ఏర్పడవని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం.