అన్నయ్య, తిక్కన...ఎర్రా ప్రగడ...ముగ్గురిని...ముగ్గురిని కవిత్రయం అంటారు.... అన్నయ్య కాదు... నన్నయ్య...నన్నయ్య.! ఏదోన్నయ్యా... నీకెందుకు?..పబ్లిక్‌ స్టేట్‌మెంట్‌లా పైకి చదువుతున్నావ్‌... తప్పు చదువుతుంటే వింటూఊర్కోవాలా?...ఊర్కోదమ్మా పబ్లిక్‌...అరేయ్‌ అన్నాయ్యా...నువ్వు పబ్లిక్‌వా!..ట్రింగ్‌...ట్రింగ్‌... ఆ ఫోన్‌ చూడు... నువ్వు చూడరాదా... అబ్బ! చూడు బుజ్జీ.... నేను జాగింగ్‌కు వెళ్తున్నా... బుజ్జీ ఏంట్రా... బుజ్జి!... నేనింకా చిన్నాదాన్నేనా... డిగ్రీ చదువుతున్నా... తెలుసా... తెలుసు.. తెలుసు...నువ్వు డిగ్రీ బాగా చదువుతున్నావ్‌!... ట్రింగ్‌...ట్రింగ్‌... ఆ ఫోన్‌ చూడు... వస్తా... ట్రింగ్‌...ట్రింగ్‌... అబ్బా! పొద్దున్నే ఈ ఫోన్‌ ఒకటి... మొబైల్‌కు చేయక లాండ్‌ లైన్‌కు చేస్తున్నారంటే... నా ఫ్రెండ్స్‌ కాదు. అన్నయ్య ఫ్రెండ్స్‌ కాదు. అమ్మకే అయుంటుంది... అమ్మకు మొబైల్‌ లేదేంటీ... ఉంది. స్విచ్‌ ఆఫ్‌... ట్రింగ్‌.. ట్రింగ్‌... వస్తున్నా... వస్తున్నా...నాన్న చేశాడేమో!... నాన్నెందుకు అటువంటి తప్పు పని చేస్తారు?.. చేయరుకానీ చేయరు!... ఇంటికి ఫోన్‌ చేస్తే తప్పా... తప్పు కదూ.. ఆయన ఎక్కడో ప్రశాంతంగా ఉంటున్నారు. ఫోన్‌ చేసి ఈ లంకలో ఎందుకు కాలు పెడ్తారు?... లంకంటే లంకంత ఇల్లనా?... ఆఁ.. అమ్మ కట్టించుకున్నాది... మంత్రిగా కొన్నాళ్లు చేసింది కదా... అప్పుడే నాన్నకు, తనకు చెడింది....!ట్రింగ్‌... ట్రింగ్‌.. అబ్బా వస్తున్నా... వస్తున్నా... ఇందాక ఏదో చదివాను... అన్నయ్య... కాదు కాదు... నన్నయ్య, తిక్కన... ఎర్రాప్రగడ... ముగ్గురిని కవిత్రయం అందురు. మరి నలుగురైతే ఏమందురు?.. కవి నలుగురు... ది ఫోర్‌ పోయెట్స్‌... ఇంగ్లీషు లెక్చరర్‌ బాగుంటాడా... తెలుగు లెక్చరరా?.. అందుకు నిన్ను ఉమెన్స్‌ కాలేజీలో చేర్పించాల్సింది... లెవ్వె.. ఉమెన్స్‌ కాలేజీలో మన లెక్చెరర్లు ఉండరా... ఉంటారు...

 బోల్డంత రోమాన్స్‌... ట్రింగ్‌... ట్రింగ్‌.. అబ్బ వస్తున్నా... పని మనిషి ఏమైంది.. పని మనిషి ఏమయ్యాడు?... పట్టు వస్త్రాలు ఏ షాప్‌లో తీసుకోవాలి... మల్లిక అడిగింది- పట్టు వస్త్రాల కోసం హైదరాబాద్‌ వస్తుందట... అది చిన్నటౌన్‌లో ఉంటుంది కదా-పట్టువస్త్రాలు అక్కడ ఏం బాగుంటాయి?.. బాగుండవు- ట్రింగ్‌... ట్రింగ్‌... ఈ పట్టు వస్త్రాలు ఉన్నాయే.. అవి మన సంస్కృతిలో భాగమట!...పట్టుచీర కట్టుకొని గుడికో, పెళ్లికో పోవడం మన ఆచారమట... సంస్కృతి, ఆచారం ఒక్కటేనా... అమ్మ ఇంకా లేవదేం.. ఇది సంస్కృతా... ఆచారమా?.. లేచి ఆ ఫోన్‌ అందుకోవచ్చు కదా... రోజంతా రాజకీయాలు నడిపి... నడిపి అలసిపోయింది... ఎలెక్షన్లు దగ్గర పడుతున్నాయట... పార్టీ పనుల్లో మునిగి తేలుతూ.. అమ్మకు ఇరవైనాలుగు గంటలు సరిపోవనుకో... మీ అమ్మ పార్టీలో లీడర్‌కదా-అవును.. తెలంగాణ మీద మీ అమ్మ అభిప్రాయం ఏవిటి?.. సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకుంటుంది... ఆ సరియైన సమయం ఎప్పుడు వస్తుంది... ఎప్పుడో వస్తుంది... మా అమ్మకేం తెలుసు.. అణు ఒప్పందంపై మీ అమ్మ అభిప్రాయం ఏవిటి?.. సరైన సమయంలో సరైన అభిప్రాయం చెబుతుంది... ధరలెట్లా పెరుగుతున్నాయో!... తగ్గించే మార్గం లేదటనా?... సరైన సమయంలో సరైన మార్గం ఉంటుంది- ట్రింగ్‌... ట్రింగ్‌... ఆగిపోయిందేం?... కాల్‌రెడీలో ఎవరైంది చూడరాదూ... ఆఁ... వంకాయ్‌.. అవసరం ఉంటే వాళ్ళే చేస్తారు....