‘‘చయనులూ నేన్నీకేమవుతా?’’చయనులు, తలొంచుకున్నాడు సమాధానం చెప్పలేక, చెప్పడం ఇష్టం లేక.గవండ్ల దుర్గమ్మ కాళీమాతలా నిలబడితే - ఆమె నోటికి, రూపానికి అందరూ తలొంచుకోవాల్సిందే ఆ అగ్రహారంలో.‘‘సర్లే - చయనులూ - నే అడిగిందానికీ ఏం చెయ్యదల్చుకున్నావో ఆలోచించుకొని చెప్పు’’.దుర్గమ్మ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది అగ్రహారంలో చయనలు సంపన్నుడే. కాస్తో, కూస్తో, సంస్కృతం, తెలుగు చదువుకున్నవాడే. అయితే ఆ చదువు ఉద్యోగానికి అక్కరకు రాక పోయినా ఊళ్లేలటానికి పనికొచ్చింది.వయస్సులో ఉండగా, కొన్నాళ్లు నాటకాల కంపెనీలతో తిరిగాడు. వాళ్లతో ఊళ్లు తిరిగాడు. సంగీతం అబ్బలా! కనుక వేషాలూదక్కలా! హార్మనీ పెట్టె మోయడం - తెరలు లాగటం అబ్బింది. ఎప్పుడన్నా, హరిశ్చంద్ర - కాటిసీనుల్లో - శవంలా పడుకోవడం, లేదా ‘చిత్తం మహారాజా’ అనటం మినహా ఇంకేం ముందుకు సాగలా. కాకపోతే, కొందరు నటీమణులతో సన్నిహిత సాంగత్యం అబ్బింది. పేకాట ఆడటం క్షుణ్ణంగా వచ్చేసింది.కొడుకు, ఊళ్లవెంట, సానిపాపలతో తిరుగుతున్నాడని తెల్సి, తండ్రి, మేనమామ బలవంతాన పట్టుకొచ్చి పెళ్ళిచేశారు. అలాగైనా కొంప వదలకుండా ఉంటాడని, వాళ్ళ ఆశ నెరవేరింది. 

ఊళ్లోనే పేకాట, ఊరిబయట తోపులో అప్పుడప్పుడూ కోడి పందాలు, అవీ కాదనుకుంటే సైకిలేసుకుని దగ్గర్లో వున్న టౌనుకెళ్లి సినిమా చూసి, ఏ అర్ధరాత్రో, అపరాత్రో కొంపకు చేరడం దినచర్య అయి కూర్చున్నది.చయనులు తండ్రి - విశ్వేశ్వరశాస్త్రి దిగులుపడ్డాడు. కొడుకు ఇలా భ్రష్డుడయ్యాడే అని - కానీ ఏం చెయ్యాలో, ఏం చేస్తే, దారికొస్తాడో ఆయనకు తోచలా. ఆయనకు లోకజ్ఞానం తక్కువ. పైగా లేకలేక చాలా ఏళ్ళకు పుట్టిన కొడుకు. చయినులు అంటే వల్లమాలిన ప్రేమ వాత్సల్యం.అసలు పుట్టినప్పుడే సమస్యలు వెంట పెట్టుకొచ్చాడు. అతడిని కన్న తరువాత భార్య సంవత్సరం పాటు మంచం దిగలేదు. తిరిగి మనిషిని చేయటానికి వేలకు వేలు ఖర్చు పెట్టించాడు. అంత డబ్బుపోయినా అదృష్టం బాగుండి ఆమె బ్రతికి బట్టగట్టింది.కోడలు - మేనకోడలు - గాయిత్రిని అడిగి, పరిష్కారం కనుగొందామని ప్రయత్నించాడు. గాయిత్రి ఆ రోజుల్లో మిడిల్‌క్లాస్‌ పాసయింది. పుట్టింది పల్లెటూరయినా - కథలు, నవలలు, పురాణాలు, కాశీమజిలీ కథలూ చదివి లోకాన్ని అర్థం చేసుకున్నది.‘‘మామయ్యా! మీకు కొడుకుని ప్రేమించడం తప్ప, పెంచడం తెలియదు. ఒక్కడే కొడుకు, ఒక్కడే కొడుకు అనిచెప్పుకుంటూ గారాబం చేశారు. చదువబ్బలేదు. డబ్బు అడిగిందే తడవు ఇచ్చారు. వ్యసనాలు అలవడ్డాయి. పెళ్ళిచేస్తే కుదురుకుంటాడని భావించారు. సానులను మరిగినవాడికి, సంసారితో సౌఖ్యం రుచించదు. అంతా ఖర్మ, పూర్వజన్మ పాపం అంటూ దేవుడిమీద భారంవేసి, చేతులు కట్టుకు వరండాలో కూర్చుంటే మీ ప్రతిష్ట, పూర్వీకుల ఆస్తి, అన్నీ ఖరారావుడీ అవుతాయి!’’ అని చెప్పింది గాయిత్రి నిర్మొహమాటంగా.