చెట్టుచాటు నుండి మరోసారి ఇటు చూశాడు మురారి. మురారికి పదిహేను ఇరవై గజాల్లో తారు రోడ్డు, రోడ్డుకి అవతల పిట్టగోడా, గోడకి అవతల మొక్కల తలలూ కనిపిస్తున్నాయి. మొక్కల తలలు దాటితే ఖాళీ.పిట్టగోడ వర్తులంగా ఉన్నట్టు నెలవంక వంపు తిరిగి అంచులు మాయమవుతున్నాయి. పిట్టగోడకు అవతల అంతులేని ఖాళీ, మొక్కలు అగాధం అంచుల్లో పెరిగాయి. పిట్టగోడ మీద తెల్లటి సున్నపు పట్టీలూ, వాటి మధ్యలో తారుపట్టీలు అమరిపోయి ఆ గోడకి ఒక రకమైన సర్కారీ కళ వస్తోంది.మురారి నవ్వుకున్నాడు.పిట్టగోడకు సర్కారి కళ వచ్చి ఉంటే, తనకి చావు కళ వచ్చినట్టే!నిజంగా చావు కళే.చావు కళ!తమ ఇంటికి మామయ్య వచ్చాడు. ఈ రోజుకి ఆయన వచ్చి పదిహేనో రోజు. పదకొండో రోజున కార్యమైపోయాకనే వెళ్లిపోవచ్చు కదా! మిగతా బంధువులు వెళ్లిపోలేదా? మేనమామకేం వచ్చింది? నిలబడిపోయాడు.అందుకు సంజాయిషీ కూడా ఆయనే ఇచ్చుకున్నాడు.‘‘నాకెక్కడ కుదురుతుందీ? మిగతావాళ్లంటే పెద్దకార్యం కాగానే లేచి చక్కాపోయారు. నాకలా అవుతుందా? ఒక్కనాటికీ కాదు. నాతోడ బిడ్డకు పసుపు కుంకుమలు చెరిగిపోతే నేను అంత చప్పున ఏ రకంగా తెంచుకు రాగలను?’’ అంటూ తనను బయల్దేరదీయాలని చూసిన బంధువులను సాగనంపాడు.తాను, చెల్లీ ఆయనవైపు తేరిపార చూశారు.పెద్దకార్యం నాటికి ఆయన తమ ఇంటికి వచ్చి అచ్చంగా పదకొండు రోజులే గడిచాయి. ఆయన చలాయించిన అజమాయిషీ మాత్రం పదకొండు సంవత్సరాలకు సరిపడేది.ఆయన వస్తూనే శవం చుట్టూ చేరిన బంధువులను చెదరగొట్టేశాడు.

‘‘ఏం తమ్ముడూ? అరె పెద్దోడా! నువ్వు కూడా మా బావ శవం దగ్గర చేరి ఏం చేస్తున్నావయ్యా? అదిగో గదిలో ఒక మూల చేరి దిక్కుతోచకుండా పోయి కుమిలిపోతోందే మా అక్కయ్య ఆవిడ్ని ఓదార్చండయ్యా మీకు పుణ్యముంటుంది. వెళ్లండి బాబూ కడసారి చూపులకు వచ్చిన వాళ్లు మాత్రమే ఇక్కడుంటారు. వెళ్లండయ్య మీక్కాదూ చెప్పేది?’ప్రజల్లో ఎక్కువమందిది గొర్రెదాటు మనస్తత్వం. ఎవడో ఒకడు మావయ్య లాంటివాడు అదలించే వాడుండాలే కానీ అతడి మాటను శిలాశాసనం లాగా పాటిస్తారు.నాన్న శవాన్ని వదిలిపెట్టి అమ్మను చుట్టుముట్టింది బంధుబలగం. ఏడ్చి, ఏడ్చి అమ్మ సొమ్మసిల్లిపోయింది.‘బంధువులొచ్చారు చూడు’ అంటూ ఆమె నెవరో కుదిపారు.మగతలోంచి తేరుకుని ఒకసారి చుట్టూచూసి కర్తవ్యం గుర్తుకు వచ్చినట్లు భోరుమంటూ ఏడవడం మొదలు పెట్టింది అమ్మ.మామయ్య ఎంత పనిచేశాడు? ఊరుకున్నదాన్ని లేపి తిరిగి ఏడిపించాడు. ఘోరం. మరణం ఒక శాపమైతే, ఆ మరణానికి దారుణాతి దారుణంగా విలపించడం అంతకంటే ఘోరమైన శాపం.ఈ రకంగా విలపిస్తూ పోతే అమ్మ కూడా బతకదు.