‘‘రామ్మా దీప్తీ....’’ కారు దిగుతున్న కోడలు దీప్తిని సాదరంగా ఆహ్వానించింది సుభద్రమ్మ.అత్తయ్య చెయ్యిని ప్రేమగా పట్టుకుంది దీప్తి. కారు కొంచెం రివర్సు చేసి ఇంటికి దగ్గరగా పార్క్‌చేసి దిగాడు శంకర్‌.‘‘రారా శంకర్‌, ఎలా జరిగింది ప్రయాణం?’’ కొడుకును ఆప్యాయంగా పలకరించాడు ఈశ్వరరావు.‘‘బాగా జరిగింది నాన్నా, రోడ్లు మెరుగయ్యాక డ్రైవింగ్‌ బాగా అనిపిస్తోంది’’.‘‘రండి, కాళ్ళు కడుక్కుని వస్తే కాఫీ పెడతాను’’.‘‘మీరు కాఫీ తాగరు కదా అత్తయ్యా’’.‘‘మేము తాగకపోయినా ఇంటికి వచ్చినవాళ్ళకి ఇవ్వడానికి ఇంట్లో కాఫీ పొడి ఉంచుకుంటా దీప్తి’’ అని నవ్వుతూ వంటింట్లోకి నడిచింది సుభద్రమ్మ.మామగారు ఆరోగ్య సూత్రాలు నిక్కచ్చిగా పాటించే వ్యక్తి అనీ, అదే వాళ్ళ చక్కటి ఆరోగ్య రహస్యం అని తెలుసు దీప్తికి. సుభద్రమ్మను అనుసరిస్తూ వంటింట్లోకి వెళ్ళిన దీప్తి కాఫీ ప్రయత్నం చేస్తున్న అత్తగారి దగ్గరగా నిలబడింది.‘‘ఏమ్మా?’’ అంటూ వెనుదిరిగిన సుభద్రమ్మ చేతిని అందుకుని ముఖానికి ఆనించుకుంది. ఆమె కన్నీళ్లు సుభద్రమ్మ చెయ్యి తడిపాయి...‘‘ఏమైందిరా?’’ ప్రేమగా దీప్తిని దగ్గరకు తీసుకుంది సుభద్రమ్మ.‘‘ఏమిటో అత్తగారూ, కోడళ్ళ మంతనాలు?’’ హఠాత్తుగా శంకర్‌ మాటలు వినిపించి దూరంగా జరిగింది దీప్తి.‘‘అమ్మా, నాన్నగారి ఆరోగ్యం బాగుంది కదా’’ అని అడుగుతున్న భర్త ఎంతో నార్మల్‌గా ఉన్నట్టు అనిపించి సంతోషించింది దీప్తి.‘‘బాగుంది నాన్నా, పోయిన నెల వైరల్‌ఫీవర్‌ వచ్చి నాలుగు రోజులు నలతగా ఉన్నారు. అంతే’’.‘‘హోమియోపతి తప్ప వాడరుకదా... మిమ్మల్ని మార్చలేమమ్మా’’

‘‘అలా అనకురా! ఈ చిన్న పల్లెటూళ్ళో మీ నాన్న ఇచ్చే హోమియో మందులతో ఎంతమందికి జబ్బులు నయమవుతాయో తెలుసా!’’‘అందరి సేవా చేస్తారు కానీ నా దగ్గరికి వచ్చెయ్యమంటే రారు..’’‘‘ఇప్పుడేమయింది? ఇక్కడ నలుగురికి ఉపయోగపడుతున్నాం కదా. అయినా సిటీలో మీ బిజీలై్‌ఫలో మేముండడం కంటే అప్పుడప్పుడూ మీరు ఇలా మా దగ్గరకు వచ్చేస్తే సరదాగా ఉంటుంది. ఇక పూర్తిగా పనులు చేసుకోలేని పరిస్థితి వస్తే అప్పుడే చూడచ్చులే...’’ నవ్వుతూ అంది సుభద్రమ్మ.కాఫీలు అయ్యాక భోజనాలు... కాసేపు విశ్రాంతి అంటూ తండ్రీకొడుకూ పడుకున్నాక, వంటింటి వెనక ఉన్న వసారాలో చాపమీద పడుకున్న సుభద్రమ్మ పక్కన చేరింది దీప్తి. దగ్గరగా జరిగి కూర్చున్న దీప్తిని చూసి సుభద్రమ్మ ‘‘ఏమయింది దీప్తి?’’ అంది. జవాబుగా దీప్తి కళ్ళల్లో నీళ్ళు... వచ్చినప్పటి నుండీ ఏదో చెప్పాలన్న దీప్తి తపనను గ్రహించింది సుభద్రమ్మ.