ఓ తెల్లార గట్ట నాకు జ్ఞానోదయం అయింది.అదెల్లా అయిందీ అంటే-ములగచెట్టు కింద కూర్చుని పళ్ళు తోముకుంటుంటే వీపు మీద గొంగళిపురుగు పడింది.వొళ్ళంతా కంపరవెత్తింది. కెవ్వున కేకేస్తే, నాలుగిళ్ళ చావిడీ జనం వచ్చి ‘ఏవయిందీ’ అన్నారు.‘‘గొం... గొం... గొం...’’ నోట మాట రావట్లేదు!‘‘పాము కుట్టిందేమో’’ మళయాళీ యాసలో పై పోర్షన్‌లో కుర్రాడు..పాము కుట్టడం ఏమిటీ నా బొంద... వెధవ తెలుగు! తేలు కొరకడం, చీమలు కరవడం, చెప్పులు కాటెయ్యడం అనుకున్నా.‘‘గొంగళిపురుగు పాకింది...’’ అన్నాను!‘‘జేళ్ళూ - తెర్రులూ పాకుతాయ్‌... అందటైపా’’ అన్నాడు మళయాళీ!‘ఓరి నీ మొహం మండా! ‘ముప్ఫైరోజుల్లో తెలుగుభాష’ పుస్తకం కొన్నట్టున్నాడు’ అనుకున్నా..‘‘గొంగళిపురుగా! భవిష్యత్తులో అదే సీతాకోక చిలకవుతుంది. మరేం పరవాలేదు’’ అన్నాడు ఆప్టిమిస్టు...వీపు మీద తట్టు తేలింది... రూమ్‌లోకొచ్చా మందు రాసుకుందామనుకున్నా... అంది చావదాయె! 

వెధవ వీపు.... వెనకే పెట్టాలా... దేవుడి మీద విసుక్కున్నా... ఇదే పెళ్ళాం వుంటే.... ఈపాటికి...భోరున ఏడుస్తూ... వీపు మీద ఏ మలామో రాసేది సుతారంగా! వొళ్ళో తలెట్టుకునీ.... పడుకుందును కమ్మగా... అనిపించి నిట్టూర్చా! సరే... అందరికీ అంత అద్భుతమైన పెళ్ళాలు దొరకొద్దూ! అంచేత అర్జెంటుగా పెళ్ళాల్ని వేటాడాలి! అని నిర్ణయించుకున్నా... ...అసలు దాంపత్యం ఎలా ఉండాలి! అదర్శ దాంపత్యానికి మార్గదర్శక సూత్రమేది... వెంటనే తాపీ ధర్మారావుగారి ‘పెళ్ళి పుట్టుపూర్వోత్తరాలూ...’ చలం గారి పుస్తకాలు... ‘మేరెజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌’, ‘షాదీకీ బాత్‌’... వగైరా పుస్తకాలు... తెగ కొని అర్థరాత్రుళ్లు వేడి వేడి చాయ్‌ తాగుతూ కంఠతా పట్టా!ఊహు... సుఖం లేదు! ‘పెళ్ళనేది పెద్ద కాంప్రమైజు’ ‘మేరేజ్‌ ఈజ్‌ లాటరీ....!’ వగైరా కొటేషన్స్‌ తగిలాయ్‌.... అబ్బా.... పోనీ కొన్ని ఫామిలీస్‌ని... అంటే కొంత మంది దంపతుల్ని దగ్గర్నుంచి పరిశీలిస్తే! బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది! నేనుంటున్నది మేడ మీద పోర్షను! గది నిండా... కృష్ణశాస్త్రి.... శ్రీశ్రీ... బాపుగారి బొమ్మలూ.... అక్కడక్కడా... పెన్సిల్‌తో పాల ఖాతాలు... విరిగిపోయిన హార్మోనియం. డెబనీర్‌లోంచి చింపి అంటించిన ‘నగ్న సుందరీ మణులు’ అగరొత్తుల పొగ చూరిపోయిన వెంకటేశ్వర స్వామి....