నిలువెత్తు కన్నీటి బొట్టులా ఉందామె. మాట కదిపితే చాలు కన్నీటి ప్రవాహమై మనల్ను ముంచెత్తేలా ఉంది. అయినా ఆమె మాట్లాడటం లేదునిప్పు కణికలా ఉందామె. తాకితే చాలు మనల్ని దగ్ధం చేసేలా ఉంది. అయినా ఆమె స్పందించడం లేదు.వ్యక్తం కాని దుఃఖంతో, వ్యక్తం కాని బాధతో అలజడిగా ఉందామె. మట్టి కుండలాగ, ఏ ఆభరణం లేకుండా, పాత చీర రవికెతో ఉన్న ఆమె పేరు శ్రీదేవి. వయసు యాభైఏళ్లకు కాస్త అటుఇటుగా ఉండచ్చు. మంచానికి తల ఆనించి కింద కూర్చుని ఉందామె.గుంతగా అయిపోయిన పాత నులకమంచంమీద ఒకతను పడుకుని ఉన్నాడు. అతనికి పక్షవాతం సోకిందనడానికి గుర్తుగా ఎడమవైపు మూతి ఒక పక్కకు పోయింది. మంచానికి కుడి వైపున పొడవాటి కర్ర ఆనించి ఉంది. చెట్టు నీడలో నులక మంచంమీద విల్లులా పడుకుని ఉన్న అతని కళ్ళు శూన్యంలో దేనినో వెదుకుతున్నట్టున్నాయి. అతని ముఖంలో ఎలాంటి భావాలు లేవు. ఇలా ఎంతకాలం జీవించేది అనే ప్రశ్నమాత్రం కనిపిస్తోంది! అతను రాజయ్య. శ్రీదేవి భర్త.ఊరంతా ఏదో రహస్యాన్ని దాచుకున్నట్టుగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో అనే అనుమానాస్పద వాతావరణం. ఎవరిళ్లలో వారు కూర్చుని గుసగుసలు పోతున్నారు. వందగడప ఉన్న ఆ పల్లె రాజుకుంటున్న బొగ్గుల కుంపటిలా ఉంది.పడుకున్న భర్త మీదుగా గుడివేపు చూసింది శ్రీదేవి. గుడి తలుపులు తెరిచి ఉన్నాయి.

 గుడిలోపల ఉన్న నల్లనయ్య గోపాల కృష్ణుడు అస్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆయనను చూస్తుంటే శ్రీదేవి కళ్లముందు ఏడాది క్రితం జరిగిన సంఘటలు కదలాడుతున్నాయి. ఆమె ఆలోచన్ల నిండా ఆనాటి విషయాలు సుడులు తిరుగుతున్నాయి.ఆ రోజు కూడా ఈరోజులాగే ఆకాశం నిర్మలంగా ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ ఊరే అలజడిగా ఉంది. ఆందోళనగా ఉంది. ఆనందంగా ఉంది. అధికారులతో కలసి ఎమ్మెల్యే నాగులయ్య ఊర్లోకి వచ్చాడు. అతను ఆరడుగుల పొడవున్నాడు. గంజిపెట్టిన తెల్లటి ఖద్దరు దుస్తులు ధరించాడు. తలకు రంగేశాడు. మెడలో బంగారు చైను, ఎడమచేతికి బంగారు రంగులో ఉన్న వాచీ, కుడి చేతికి బ్రాస్‌ లైట్‌ ఉన్నాయి. వీటన్నింటికి అదనపు ఆకర్షణ అతని ముఖంలో చెరగని నవ్వు. ఎమ్మెల్యే రావడంతో ఊర్లో హడావుడి మొదలయింది. ఎమ్మెల్యే కృష్ణుని గుడిలో కొబ్బరి కాయ కొట్టాడు. రాజయ్య ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకుని పళ్లెంలో వందరూపాయల నోటు వేశాడు. అధికారులు కూడా కృష్ణుడికి నమస్కారం పెట్టారు. తర్వాత గుడిముందు చెట్టుకింద నులకమంచాల్లో కూర్చున్నారు. అధికారులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు.