గేటు తెరిచిన చప్పుడై, అటు చూచి- ‘‘రండిఅన్నపూర్ణమ్మగారు! ఎలావున్నారు? ఆరోగ్యం బాగుంది గదా! బీపీని కంట్రోల్లో వుంచుకుంటున్నారా?’’ అని పక్కింటి పెద్దావిణ్ణి పలకరించింది పేపరుచూస్తున్న యశోద.‘‘మీ దయ వల్ల అంతా బానే వుందమ్మా! మాఅమ్మాయికే ఆరోగ్యం బాగలేదు’’‘‘ఆదేం - అలా అంటున్నారు! ఏమైనా జబ్బు చేసిందా?’’‘‘ఫిట్సట - రోజుకు రెండు సార్లు విరుచుకుపడుతోందట’’‘‘అయ్యో! అదేం? మొన్న పండక్కి వచ్చినప్పుడునవ్వుతూపేల్తూ కంకణంలా మనిళ్ల మధ్య తిరిగిందిగదా! ఇంతలోనే ఫిట్సేంటి?‘‘ఎంతలోకి రావాలమ్మా ఏవైనా! మూణ్ణెల్లుగా మొగుడి పోరు తట్టుకోలేక పోతున్నదట. అల్లుడు మోటరు బైకు కావాలని సతాయిస్తుంటే నలభైవేలు చేతిలో బెట్టాం. మళ్లీ యిప్పుడు మరో పోరట. స్వంత ఇండస్ట్రీ అయితే - లాభం మొత్తం మనదే. పెట్టుబడి కోసం ఆరు లక్షలవసరం.. ఎప్పుడు బయల్దేరతావు? అంటూ రాత్రీపగలూ వేధిస్తున్నాడట శ్యామల్ని. ప్రేమ ప్రేమంటూ - రూపాయి లేని దాన్ని గుళ్లోపెళ్లి చేసుకుని తీసుకొచ్చావని మా అమ్మానాన్న గొడవ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు నేను ఔనంటే పది లక్షల కట్నంతో వచ్చే పిల్లతో వివాహం చేస్తామనీ అంటున్నారు. అంచేత బాగా ఆలోచించుకో. ఏం చెయ్యాల్సిందీ నువ్వు తేల్చుకో - అని క్షణ క్షణం బెదిరిస్తుంటే - ఉక్కిరి బిక్కిరవుతూ - బిడ్డ ఫిట్సులోకి దిగింది’’ అని భోరుమని ఏడ్చింది అన్నపూర్ణమ్మ.

‘‘అయ్యో! దుఃఖపడొద్దండీ అన్నపూర్ణమ్మగారూ! ఎప్పుడో రిటైరై మీ వారి ఆ కొద్ది పెన్షన్‌తో గడుపుకుంటున్న మీరు లక్షలెలా యివ్వగలరు. ప్రేమించి పెళ్లి చేసుకుని - లక్షల కోసం మరో పెళ్లా! ఎంత వంచన!’’ యశోద కంఠంలో ఆగ్రహం.‘‘అదే నమ్మా మరి. ఇప్పటికే దీని నగలన్నీ నడిచిపోయాయి. ఏదో కంప్యూటర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. యిప్పుడు అది చెయ్యడట. మేము లక్షలిస్తే స్వంత ఇండస్ట్రీ పెట్టుకుంటాడట.’’‘‘ఇలాగే ఆకాశానికి నిచ్చెన లేస్తూ వుండమని అత్తగారికి చెప్పి మీ కూతుర్ని మాత్రం మీ దగ్గరకి తెచ్చేసుకోండి.‘‘తీసుకొస్తే డబ్బులేందే కాపరానికి రానివ్వరే!’’‘‘ఐతే శ్యామలని అక్కడే వుంచితే కాపురం నిలబడుతుందా? అతని డిమాండ్లన్నీ అక్కడే వుంటూ తీర్చగలుగుతుందా? అది సాధ్యం గానప్పుడు - వచ్చేయడం మంచిది గదా!’’‘‘అన్నీ వదులుకు వచ్చెయ్యడమే! పిల్ల బరితెగించి పెళ్లి చేసుకుందని యిప్పుడే చుట్టుపక్కల రాకల్లేవు. ఇప్పుడిక అన్నీ వదిలొచ్చిందని వింటే వెలేసేస్తారు మమ్మల్ని. చావో బతుకో తను కట్టుకున్నవాడితోనే కర్మను అనుభవించనివ్వండి’’ అంది తల్లి.‘‘అసలు శ్యామల్ని తమతో వుండనివ్వాలిగా వాళ్లు. మన బిడ్డను మనం తెచ్చేసుకుని, తగిన వైద్యం చేయించి బతికించుకోవాలి. లోకానికి ఝుడిసి ఆ నరకంలోనే వుంచుదామా?’’‘‘ఔన్లెండి. అక్కడ అదిగాని గుటుక్కుమంటే మేమిక ఎవరికోసం బతకాలి! మీ రంటున్నట్లు శ్యామల్ని తీసుకు వచ్చేస్తే - తనకు భద్రత మాకు భరోసా రెండూ వుంటాయి.’’