పాత పరిచయాలు పక్కన పెడుతూ కొత్త పరిచయాలకు స్వాగతం పలుకుతూ ఆ రైలు అక్కణ్ణుంచి బరువుగా కదిలింది.ప్లాట్‌ ఫారం మీద చివరగ ఉన్న ఒక బెంచ్‌ మీద కూర్చుని ఉన్న దినేష్‌ రైలు పూర్తిగా వెళ్లి పోయో వరకూ అక్కడే కూర్చుని మెల్లగా లేచాడు.సాయంత్రం ఆరు గంటల సమయం. ఆ పల్లెటూర్లో సాయంత్రం వచ్చే ఒకే ఒక రైలు అది. ఆ తరువాత అక్కడ ఈగలు తోలేందుకు కూడా జనం ఉండరు.నిరాశగా నిట్టూరుస్తూ బయటికి నడిచాడు దినేష్‌. వస్తారనుకున్న ఆప్తులు కంటబడలేదు. వస్తారా లేదా అన్న మీమాంస కూడా ఉన్నది. ఐనా ఏదో ఒక నమ్మకం ఖచ్చితంగా వచ్చి తీరుతారని. ఆ నమ్మకంతోనే ప్రతిరోజూ ఆ సమయానికి అక్కడికి వచ్చి అలా కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు.అతను ఎదురు చూసేది వేరెవరి కోసమో కాదు. తన రిలీవర్‌ కోసం. వ్యక్తి వచ్చి తనను రిలీవ్‌ చేస్తే తాను వె ళ్లి పట్నంలో డ్యూటీ జాయినవ్వవచ్చు.అతను ఆ పల్లెలోని బడిలో మాస్టారు. అదొక ఎలిమెంటరీ స్కూలు. పెద్దదో చిన్నదో మొత్తానికి ఆ ఊరికి అదే ఏకైక బడి. బడిని గుడిగా చూడమన్నారు పెద్దలు. ఐతే అతనికి మాత్రం ఎప్పుడెప్పుడు ఆ బడిని వదిలి వెళ్దామా అని ఉంది. అక్కడ పోస్టింగ్‌ వచ్చిన దగ్గర నుండీ అసలు ఎందుకు బీఎడ్‌ చేశానా అన్నంత విరక్తి కలిగింది.

అసలే ఉద్యోగం దొరకని రోజులు ప్రస్తుతానికి ఏదో ఒక చోట చేరితే ఆ తరువాత బదిలీ చేయించుకుని వెళ్లొచ్చన్న ధీమాతో వెంటనే వచ్చి చేరిపోయాడు. ఐతే అక్కడికి వచ్చి చేరిన తరువాత గానీ తెలియలేదు అక్కడికి వచ్చిన వాళ్లు ఇక ఎక్కడికీ వె ళ్లలేరని. దాంతో హతాశుడాయ్యాడు దినేష్‌. ఇక్కడ చేరి ఇప్పటికి దాదాపు మూడు నెలలైంది.ఎన్నెన్నో కలలు క న్నాడు పెద్ద పెద్ద స్కూళ్లలో చేరవచ్చని. వందల సంఖ్యలో విద్యార్థులు, పదుల సంఖ్యలో టీచర్లు. వాతావరణమంతా గోలగోలగా భలేగా ఉంటుంది అని ఎన్నో ఊహలతో ఉన్న అతనికి ఈ పలె ్ల పోస్టింగ్‌ మింగుడు పడలేదు. ఐనా తన భగీరత ప్రయత్నంలో తెలిసిన అధికారుల కాళ్లు పట్టుకుని గత నెలలోనే ఎలాగో ఒకరికి అక్కడ పోస్టింగ్‌ చేయించాడు.ఐతే ఆ వ్యక్తి ఇదిగో ఇవాళ రేపు అంటూ రోజులు గడిపేస్తున్నాడు. అది దినేష్‌కు భరించరాని అసహనాన్ని రేపుతూంది. దాని మూలంగా ఆ వచ్చే వ్యక్తి కోసం రోజూ రైల్వే స్టేషన్లో పడిగాపులు కాస్తూ కూర్చోవడం కూడా దినచర్యలో ఒక భాగంగా మారింది.