అరుణకి ఆ రాత్రంతా నిద్దర పట్టలేదు. గంటగంటకీ లేచి గడియారం కేసి చూస్తూనే ఉంది. తెల్లారితే కార్తీక్‌ అమెరికా ప్రయాణం. ఆర్నెల్లక్రితం కూడా ఇలాగే రాత్రంతా నిద్దరపోకుండా కూర్చుంది. కాకపోతే అపడు కార్తీక్‌ కూడా నిద్రపోలేదు. అంతేకాదు, అన్నం తినకుండా విసురుగా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.మండుతున్న కళ్ళని నులుముకుంది. అరుణ, శేఖర్‌లకి ముగ్గురబ్బాయిలు. శేఖర్‌ చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌. ప్రైవేట్‌ ప్రాక్టీసు. పెద్దవాడు శ్రీనివాస్‌ డాక్టర్‌. శ్రీనివాస్‌ చదువవగానే అమెరికాలో ఉంటున్న మేనత్త కూతురు సుజాతని పెళ్లిచేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. 

రెండోవాడు సుందర్‌ ఇంజనీరింగ్‌ అయాక అన్నగారి ప్రోద్బలంతో తను కూడా వెళ్లిపోయాడు. తనతో పనిచేసే అల్పన అనే బెంగాలీ అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు.‘‘పెద్దపిల్లలిద్దరూ దూరంగా ఉంటున్నారు, వీడినైనా మన దగ్గర ఉంచేసుకుందాం’’ శేఖర్‌ ఎపడూ అంటుంటాడు. అందుకే ఇంటర్‌ అవగానే సి.ఏ లో చేర్పించారు. కార్త్తీక్‌కి అమ్మ దగ్గర చాలా గారాబం. ఏది కావాలంటే అది ఎపడు పడ్తే అపడు సాధించుకునేవాడు.చిన్నప్పట్నుంచీ చాలా తెలివిగా అన్నింట్లో ముందుండే వాడు కార్తిక్‌. సి.ఏ పరీక్షలు కూడా మొదటి ఛాన్స్‌ లోనే పాసయి పోయాడు. అది చూసి సుందర్‌ వచ్చినపడు నూరిపోసాడు.‘‘నువ్వు కూడా వచ్చేయరా. మంచి యూనివర్సిటీ లో యమ్‌.బి.ఏ చేసావంటే స్కై ఈజ్‌ ద లిమిట్‌. ఇక్కడేం ఫ్యూచరుంది’’ అన్నమాటలకి కార్తీక్‌ ఆలోచనలన్నీ మారిపోయాయి.‘‘నీకు వెతుకుదామన్నా ఎక్కడా దుమ్ము కనిపించదు తెలుసా! పైగా ప్రతీ సిగ్నల్‌ లైట్‌ దగ్గరా ఈ బెగ్గర్స్‌ ఏంట్రా బాబూ! కారుడోర్‌ తీశామంటే కంపు.

హాయిగా వచ్చేయ్‌’’ కళ్ళు పెద్దవి చేసుకుని అన్నచేత మరీమరీ చెప్పించుకుని విన్నాడు అమెరికా విశేషాలు.అంతే అప్పట్నుంచీ మొదలు పెట్టాడు ఆర్గ్యుమెంట్లు.‘‘అన్నలిద్దర్నీ ఏం అనకుండా పంపించారు. నా దగ్గరకి వచ్చేసరికి ఎందుకింత నస? మీకు ఎలాగైనా నన్నిక్కడే ఉంచేయాలని. ఐ డోంట్‌ వాంట్‌ టు ఫ్లాట్‌ హియర్‌. మీ కంపెనీ కోసమని నా కెరీర్‌ పాడుచేసుకోవాలా’’ కార్తీక్‌కి దూకుడెక్కువ.అరుణకి కళ్లనీళ్ళొచ్చేశాయి. ‘‘నిన్ను వదిలి నేవుండలేన్రా బాబూ!’’‘‘అవును నాఖర్మ కొద్దీ ఆఖరి కొడుకుగా పుట్టాను’’ కాళ్ళు నేలకేసి తంతూ కంచం నెట్టేసి వెళ్ళిపోయాడు.్‌్‌్‌ఆ రోజు రాత్రి కూడా ఇలాగే కూర్చుంటే శేఖర్‌ సముదాయించాడు. ‘‘పిల్లల్ని కని పెంచడం వరకే మనవంతు. వాళ్ళ మీద ఏం ఆశలు పెట్టుకోకూడదు. ఒక వేళ బలవంతం మీద ఉంచినా వాడికి ఇంట్రస్టు ఉండదు. అయినా మనిద్దరం ఒకరికొకరం. ఇపడైనా ఏకాంతాన్ని ఎంజాయ్‌ చేద్దాం’’ నవ్వించడానికి ప్రయత్నించాడు.రాత్రంతా అరుణ వెక్కుతూనే ఉంది.‘‘నీకున్న హాబీస్‌ని డెవలప్‌ చేసుకో. పెయిం టింగ్‌ క్లాస్‌లో చేరు. ఆర్ఫనేజ్‌లో వాలంటీర్‌ పని చెయ్యి’’ శేఖర్‌ సలహా ఇవ్వబోయాడు.