తన ఎదురుగా వున్న ఛెయిర్లో ఆందోళన నిండిన మొఖంతో కూర్నుని వున్న ఆనంద్‌ను పరిశీలనగా చూశాడు డాక్టర్‌ రాందాస్‌. ముప్ఫైఐదేళ్ల ఆనంద్‌ మొఖంలో టెన్షన్‌ గూడు కట్టుకొని వుంది. ఏదో ఆలోచనలో వున్నట్లు పరధ్యానంగా వున్నాడతను.డాక్టర్‌ రాందాస్‌ చిన్నగా గొంతు సవరించుకొని చెప్పాడు ‘‘మిస్టర్‌ ఆనంద్‌, మీరు ఇంతగా వర్రీ కావలసిన అవసరం లేదు, మెడికల్‌ టెక్నాలజీ ఇప్పుడు బాగా ఇంప్రూవ్‌ అయ్యింది కదా, వారం రోజుల్లో మీకు జరిగే ఆపరేషన్‌ గురించి మరింతగా కలత చెందవలసిన అవసరం లే దు’’ ఇంకా చెప్పబోతున్న రాందాస్‌ తన గొంతుకేదో అడ్డం పడినట్లు ఠక్కున ఆగిపోయాడు. తాను చెప్తున్నది పూర్తిగా నిజం కాదని తనకే తెలుసు.‘‘అది కాదు డాక్టర్‌, నాకేదో జరుగుతుందన్న భయం నాకు లేదు. నామీద ఆధారపడి మొత్తం మరో నలుగురున్నారు మా ఇంట్లో... పై పెచ్చు నాకూ, నాన్నగారికీ ఒకేసారి ఆపరేషన్‌ జరగబోతోంది కదా.’’రాందాసు ముందున్న టేబిల్‌పై ఎర్ర రంగు లైటు వెలిగింది. పేషెంటు తన కన్సల్టింగ్‌ రూంలోకి వచ్చి పది నిమిషాలయ్యిందనే దానికి సూచన అది. సాధారణంగా రాందాసు తన పేషెంట్లను ఆ గడువులోనే పరీక్ష చేసి పంపుతూ వుంటాడు.కానీ ప్రస్తుతం తన ముందున్న ఆనంద్‌కు చెయ్యవలసిన పరీక్షలన్నీ ఎప్పుడో చేసేశాడు రాందాసు. సాధారణంగా ఆపరేషన్‌కు ముందు తన పేషెంట్స్‌కు ఒకటి, రెండు సెషన్స్‌లలో కౌన్సిలింగ్‌ ఇస్తూ వుంటాడు రాందాసు. 

ఇప్పుడు ఆనంద్‌ను ఆ కారణంగానే క్లినిక్కు రమ్మన్నాడు రాందాసు.వారం రోజుల్లో ఆనంద్‌ తండ్రి రాఘవరావుగారికి ‘లివర్‌ ట్రాన్స్‌ప్లేంటేషన్‌ చేయవలసివుంది. సాధారణంగా పేషెంటు దగ్గర బంధువుల్లో ఎవరో ఒకరి లివర్‌లోంచి కొంత భాగాన్ని తీసి పేషెంటుకు అమరుస్తూవుంటారు. రాఘవరావు గారి వయస్సు అరవైరెండు. ఆయన భార్య ఎప్పడో పోయింది. సోదరులకు ఆయనకంటే ఎక్కువ వయసు వుంది. రాఘవరావు గారి కొడుకు ఆనంద్‌ను పరీక్షించి లివర్‌ డొనేషన్‌కు అర్హుడుగా నిర్ణయించాడు రాందాసు.ఓ చిన్న ప్రయివేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు ఆనంద్‌. రోజూ తొమ్మిదిగంటల పాటు ఆఫీసు పని... పోనూ, రానూ మరో రెండు గంటలు సిటీ బస్సుల్లో ప్రయాణం. భార్య సునందుకు ఇద్దరు పిల్లలతోనే పని సరిపోతూ వుంటుంది. ఆర్టీసీలో ఆఫీసరుగా పని చేసి రిటైరైన రాఘవరావుగారే ఆ ఇంటికి పెద్ద దిక్కు.ఏడాది క్రితం ఆనంద్‌కు ఛాతీలో స్వల్పంగా నొప్పి రావడంతో కార్డియాలజిస్టు దగ్గరకు వెళ్లాడు. డాక్టర్‌ పరీక్షించి, ఆనంద్‌కు హార్ట్‌ ప్రాబ్లమ్‌ వుందని తేల్చాడు. క్రమం తప్పకుండా మందులు వాడితే, జబ్బు కంట్రోల్లో వుంచుకోవచ్చని చెప్పాడు. చిరుద్యోగైన ఆనంద్‌కు ఆ వార్త ఆశనిపాతమయ్యింది.