సాయంత్రం అయిదు గంటలు దాటి నలభై నిమిషాలయింది. సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నట్లుగా అటువైపు ఆకాశమంతా ఎర్రబడుతోంది.వాకిట్లో ఇంకా పదిమంది దాకా పిల్లలు ఆడుకుంటున్నారు. గోలగోలగా అరుస్తున్నారు.లోపల ఉయ్యాలలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ ఉయ్యాల పక్కగా దమయంతి కూర్చొని వున్నది.ఒక్క అరగంటలో ఆ పిల్లల తల్లులో, తండ్రులో వచ్చి వాళ్ళను తీసుకు వెళతారు. అప్పటిదాకా పిల్లలతో సందడిగా వున్న ఆ ఇల్లు ఒక్కసారిగా బోసిపోతూ నిశ్శబ్దమయిపోతుంది.సునంద ఆమె భర్త స్కూటర్‌ మీద వచ్చారు. ఇద్దరూ ఉద్యోగస్తులే. సంవత్సరం వయస్సులో వున్న తమ కూతుర్ని రుక్మిణి దగ్గర వదిలి వెళతారు ఉదయం తొమ్మిది గంటలకు. మళ్ళా సాయంత్రం ఈ సమయానికి వచ్చి తీసుకు వెళతారు.రుక్మిణి పాతిక మంది పిల్లల్ని మాత్రమే తన క్రెష్‌లో జేర్చుకుంటుంది. అంతకు మించి వాళ్ళు ఎంత ఇస్తామన్నా తీసుకోవటానికి అంగీకరించదు. ఎవరన్నా ట్రాన్స్‌ఫర్‌ అయి వెళితేనో లేక మరెవరయినా మరేకారణంతోనయినా వాళ్ళ పిల్లల్ని పంపటం మానివేస్తేనో అప్పుడు వెయిటింగ్‌ లిస్ట్‌లో వున్న వాళ్ళకు ఫోన్‌ చేసి చెబుతుంది.ఆమె చెప్పేది ఒక్కటే. ‘‘నేను నా దగ్గర వుంచుకున్న పాతికమంది పిల్లల్ని నా స్వంత పిల్లల్లా చూసుకుంటాను. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేం తింటారో చెప్పండి ఏర్పాటు చేస్తాను. 

పాలు కూడా మా ఇంట్లో కాచినవే ఇస్తాను... అవసరమొస్తే నేనే డాక్టరును పిలిచి ఫస్ట్‌ ఎయిడ్‌ ఇప్పించి అప్పుడు ఫోను చేసి మీకు చెబుతాను... మీరు మీ పిల్లల విషయంలో నిశ్చింతగా వుండవచ్చు!’’ అని భరోసా ఇవ్వటమే కాకుండా, అలా చెప్పిన మాట ప్రకారం చూస్తుండటం వలనే కాస్త ఖర్చు ఎక్కువయినా చాలామంది తమ పిల్లల్ని అక్కడ జేర్చటానికి వస్తుంటారు.రోడ్డుమీద దీపాలు వెలుగుతున్న సమయానికి మిగతా పిల్లల్ని కూడా వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకు వెళ్ళిపోయారు. ఆ వెంటనే దమయంతి ఉయ్యాలలోని గుడ్డలు మార్చేసి, హాలు కడిగి, తుడిచి, ఇంత సాంబ్రాణీ ధూపమేసింది. పొద్దున పిల్లలు వచ్చే సమయానికి అన్నీ శుభ్రంగా వుండాలి. అప్పుడు చేయాలంటే కుదరదు.యాభై సంవత్సరాల దమయంతి ఆ కాంపౌండ్‌లోనే నైరుతీ మూలగా వున్న చిన్నగదిలో వుంటుంది. ఆమెకు నా అనేవాళ్ళెవరూ లేరు. చాలా సంవత్సరాలయింది ఆ ఇంట జేరి, ఇరవై నాలుగు గంటలూ అక్కడే ఉండటంతో ఒకవిధంగా ఒంటరిగా వుండే రుక్మిణికి ఆమే తోడు. ఎవ్వరూ లేని దమయంతికి ఆ ఇల్లే నీడ.లోపల దమయంతి హాలును శుభ్రం చేస్తుంటే రుక్మిణి వీస్తున్న చల్లటి గాలి కోసమన్నట్లుగా వరండాలో కుర్చీ వేసుకొని కూర్చున్నది.