ఆకాశంలా అమాయకంగా లేత నీలం రంగులో మెరిసిపోతోంది సముద్రం.తూరుపున ఇప్పుడిప్పుడే సముద్రం మీంచి పైకొస్తున్న సూర్యుడు నిగనిగలాడుతున్న నారింజలా ఉన్నాడు.పౌర్ణమి రోజులు కావడంతో.. నిన్న సాయంత్రం ఒడ్డునున్న పడవల దగ్గరకి తన్ను కొచ్చిన అలలు ఇప్పుడు సముద్రం లోపలెక్కడో ఉన్నాయి. అప్పుడు పొంగిన అలల దుడుకు... ఒడ్డు చివర్న పడున్న గుర్రపుడెక్కని, గవ్వల్ని, ఆల్చిప్పల్ని చూస్తే తెలుస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం కల్లోలమే తెలీనట్టు నిశ్శబ్దంగా, నిండుగా ఉంది సముద్రం.

రాత్రి ఏ వేళప్పుడో తీరానికి కొట్టుకొచ్చిన తాబేలు పిల్లలు, నత్తలు సముద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నించే కొద్దీ అలలు నిర్దయగా వాటిని మళ్ళీ ఒడ్డు మీదకి నెట్టేస్తున్నాయి. అయినా వాటి ప్రయత్నం మానటం లేదు అవి.సముద్రమే నా దగ్గర ఉండొద్దని బయటకు నెట్టేసినా దిక్కులేన ట్టుగా మళ్ళీ సముద్రంలోకి వెళ్తున్న నత్త గవ్వల్ని, శంఖాల్నీ చూస్తుంటే ఏదో సూచన మెదడుకి అందీ అందనట్టుగా......! ఏంటది?చుట్టు ఉన్న వాతావరణమంతా ప్రశాంతంగా ఉన్నా నా మనసు మాత్రం అల్లకల్లోలంగా ఉంది. నిన్న సాయంత్రం సముద్రాన్ని చూశాక ఆ అలజడి మరింత పెరిగింది నాలో.ఈ నెల రోజులే మా చేతిలో రూపాయి. ఆ తర్వాత...?పైకి స్థిర చిత్తంతో ఉందామనుకున్నా కానీ.. మనసు మాత్రం జంకుతూనే ఉంది.ఎండ చర్మాన్ని చురుక్కుమనిపిస్తుంటే.. ఇంటి దగ్గర మల్లి ఎదురు చూస్తుంటుందని గుర్తొచ్చి, లేచి ఇంటివైపు నడిచాను..ఫఫఫచైత్రం వచ్చేసింది.

‘సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలే’ మని సముద్రంలో చేపల వేటని ఆపెయ్యమని సూచనలిచ్చింది ప్రభుత్వం.మళ్ళీ పల్లోళ్ళమందరం బ్రతుకు తెరువు వెతు క్కోవలసిందే.సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తూ చేపల వేట ముఖ్యవృత్తిగా బ్రతికే మాలాంటి వాళ్లని ‘పల్లోళ్ళు’ అంటారు. కొన్ని చోట్ల ‘మరకాళ్ళు’ అని కూడా పిలు స్తారు.సముద్రంలో చేపల వేటంటే అన్ని ఉద్యోగాల్లా సంవ త్సరం పొడుగూతా ఉండదు. బాధ్రపదం మొదలు కొని చైత్రం వచ్చేవరకు మాత్రమే చేపలు పట్ట డానికి ప్రభుత్వం అనుమతినిస్తుంది. అంటే వినా యక చవితికి నాలుగు రోజులు ముందు నుండి ఉగాది వచ్చేవరకు. మిగిలిన రోజుల్లో సముద్రం నిల కడగా ఉండదని, వానలు పడే అవకాశాలు ఎక్కు వుంటాయని, జాలర్లు గల్లంతైపోతారని.. వేటని నిషే దిస్తుంది ప్రభుత్వం.