మరోసారి కాలింగ్ బెల్ కొట్టడం కోసం చేయిపైకెత్తుతున్న రాఘవ గడప కవతల కనిపించగానే తెరచిన తలుపును అలాగే చేత్తో గట్టిగా పట్టుకుని శిల్పంలా నిలబడిపోయిందామె. మేఘాలు లేని ఆకాశంలా యెప్పుడూ నిర్లిప్తంగా కనిపించే ఆమె ముఖంలో కోపమూ, దుఃఖమూ పలచటి దూదిమేఘాల్లా అలా కనిపించి ఇలా మాయమైనట్టు తోచింది రాఘవకు. కాసేపు తానూ స్థాణువులా మారి ఆవిడ ముఖంలోకే చూస్తూవుండిపోయిన తర్వాత వులిక్కిపడి తేరుకుని, తడారిన పెదవులను నాలుకతో బలవంతంగా విడదీసి, ‘‘సారీ రాణీ! నాకు తెలిసింది నిన్న సాయంత్రం అయిదు గంటలకే.... రాత్రి తొమ్మిది గంటల బస్సు దొరికింది. అది గంట లేటుగా పదికి చేరిందిక్కడికి’’ అన్నాడు రాఘవ జీరబోయిన గొంతుతో.‘‘అంకుల్ని కారిడార్లోనే నిలబెట్టేస్తావా మమ్మీ!’’ అంటూ రాణి వెనక నుంచి ఓ యువతి గొంతు వినిపించింది.
రాణి పక్కకు తప్పుకోగానే లోపలికి వచ్చి సూట్‌కేసు పక్కన పడేసి, సోఫాలో కూచుంటూ ‘‘నువ్వెప్పుడొచ్చావు కిరణ్?’’ అని పలకరించాడు రాఘవ.ల్యాప్‌టాప్ సంచితో బయటికెళ్లడానికి సిద్ధమైవున్న కిరణ్మయి యెదుటిసోఫాలో కూచుని ‘‘యిప్పుడు నా జాబ్ యిక్కడే అంకుల్....సిక్స్‌మంత్సయింది యిక్కడికొచ్చి’’ అంది.‘‘మరి నీ హజ్బెండు?’’‘‘శ్రావణ్ బెంగుళూరే! ట్రాన్స్‌ఫర్ కోసం ట్రై చేస్తున్నాడు’’.గోడపైన పూలమాల వేసి ఉన్న ఫోటో ఫ్రేములోంచి సీతారామచంద్రమూర్తి సూటిగా తననే చూస్తున్నట్టు అనిపించగానే రాఘవ బెంబేలుపడ్డాడు. మూర్తి ముఖంలో అదే చిరాకు..నవ్వుతున్నాయో, యెగతాళి చేస్తున్నాయో తెలియని పెదవులు... ఇటే చూస్తున్నా గాలిస్తున్నట్టుగా కనిపించే చూపులు... రాఘవ ముఖం అవతలికి తిప్పుకున్నాడు.డ్రాయింగ్‌రూంలోని సోఫా, కుర్చీలూ, టీవీస్టాండూ రాఘవతో తమకున్న పాత స్నేహాన్ని గుర్తుచేస్తున్నాయి. ఎదురుగా కూచున్న రాణి ముఖంలో ఇప్పుడు అదనంగా రెండు మూడు ముడతలూ, తలపైన నాలుగైదు తెల్లవెంట్రుకల పాయలూ కనిపించాయి రాఘవకు. పక్కన కూచున్న కిరణ్మయి ముఖంలో ఆమె తల్లిదండ్రుల పోలికలు వెదుకుతూ ‘ఎప్పుడు?’ అని ప్రశ్నించాడు రాఘవ.రాణి ఓ నిమిషం సేపు అతణ్ణి కళ్లార్పకుండా చూసి, ముఖం తిప్పుకుంది.‘‘నెలరోజులుగా సిమ్లాలో ఉన్నాను విజిటింగ్ ఫెలోగా. తిరిగొచ్చింది నిన్నే! సాయంత్రం బాటనీ డిపార్టుమెంటు బయపరెడ్డి కనిపించి క్యాజువల్‌గా చెప్పాడీ సంగతి. రిటైరైపోయిన తరువాత యూనివర్సిటీ కెళ్లడం తగ్గిపోయింది.
ఒకరినొకరు పట్టించుకునే వాళ్లిప్పుడెక్కడున్నారు?’’ బలహీనమైన గొంతుతో సంజాయిషీ చెబుతూవచ్చి, రాణి తటాలున తలపైకెత్తగానే తన మాటలు గురి తప్పుతున్నాయని తెలుసుకుని గబుక్కున ఆగిపోయాడు రాఘవ. తరువాత దీనంగా ‘‘ఎప్పుడు? ఎలా?’’ పాత ప్రశ్ననే మళ్లీ వేశాడు.‘‘డాడీ ఆ రోజు డిన్నర్ తిన్నాక పడుకున్నారంకుల్!’’ గొంతులో సన్నటి జీర తొంగిచూస్తున్నా కిరణ్మయి ధైర్యంగానే చెప్పుకుపోయింది. ‘‘మార్నింగ్ లేవలేదు. అర్ధరాత్రెప్పుడో హార్ట్ అటాక్ వచ్చిందన్నారు డాక్టరు. ఏదో అసోసియేషన్ ఎలక్షన్లూ ... వాళ్ల కజిన్ ఆ పల్లెటూర్లో వుండే ఇల్లు ఆక్యుపై చేసుకున్నాడని కోపం.... పెద్దఇష్యూలేం గాదు. అజిటేటెడ్‌గావున్నారంతే! కానీ....’