నిశ్శబ్ధ సంకేతంవారాల కృష్ణమూర్తిబస్సు దిగి బస్టాండ్‌ ఆవరణలో నాలుగడుగులు వేసి చుట్టూ కలియచూశాడు. పెద్ద మార్పేమీ కనిపించలేదు. అదే హడావిడి. మాటలు కేకలు బస్సుల హారన్‌లు కలగాపులగంగా శబ్దాల హోరు. ఎవరికి వారు తమ వాళ్ళను, సామాన్లను కాచుకుంటూ చూసుకుంటూ బయటికి వెళ్ళేజనం, మరో బస్సుఎక్కను మరో ప్లాట్‌ఫాం చేరుకుంటూ ఎవరి పరుగులో వారు వున్నారు. బస్సు దిగిన నారాయణ మాత్రం ఎలాంటి ఆదుర్దాలేకుండా చేతిలోని చిన్న సూట్‌కేస్‌తో నింపాదిగా మరో నాలుగడుగులు వేసి బస్టాండ్‌ అంతా కలియ చూశాడు. స్టాల్స్‌ అన్నీ యధాస్థానంలోనే వున్నాయి. కాకుంటే అమ్మే వ్యక్తులు మారారు. అదే పళ్ళ దుకాణం! అదే పుస్తకాల షాపు! అదే కూల్‌డ్రింక్స్‌ కార్నర్‌! అదే ఫలహారశాల. దానికి ముందు కాఫీ టీ అమ్మే అయ్యర్‌. అన్ని షాపుల్లో వ్యక్తులు మారినా అయ్యర్‌ మాత్రం మారలేదు. నారాయణ అక్కడ ఆగి చిరకాల మిత్రుడిని చూసినట్టు అతన్నిచూసి ‘‘ఒక టీ’’ అన్నాడు. తనకతను ప్రత్యేకం... అతనికి తను కాదు. టీ అందుకుని కాస్త రుచి చూశాడు. అదే నీళ్ళ టీ! ఏ మార్పులేదు. టీ తాగాక గ్లాస్‌ అక్కడుంచి పది రూపాయల నోటిచ్చాడు.అయ్యర్‌ ‘‘చిల్లర మూడు రూపాయలు ఇవ్వండి’’ అన్నాడు.  

టీలో మార్పు లేదుగాని రేటు మూడింతలయింది. జేబులో చిల్లర వెతికి అయ్యర్‌కు ఇచ్చి తాపీగా బస్టాండ్‌ అణువణువూ చూపు సారించాడు. అంతా అదే పాతదనం. మరింత రొచ్చుగా అనిపించింది. ప్లాట్‌ఫాం ముందున్న పిల్లర్స్‌కు అతికించిన పోస్టర్లలో మాత్రం మార్పు కనిపించింది. ప్రతి పిల్లర్‌ మీద కాసింత చోటు కూడా వదలకుండా ఇంటర్‌ కాలేజీలు, కాన్వెంట్‌ స్కూల్స్‌, ఎంసెట్‌ కోచింగ్‌ సెంటర్‌ల గొప్పదనాలు, ఆపరేషన్‌ లేకుండా మొలలు - ఫైల్స్‌ గ్యారంటీగా బాగు చేయబడును అన్న నాటు వైద్యుల హామీ పత్రాలు - తప్పిపోయినపిల్లలు - ఇల్లొదిలిన ముసలివాళ్ళ ఫొటోలు - వాటికింద వాళ్ళ ఆచూకీ తెలిస్తే తెలపాల్సిన వాళ్ళ చిరునామాలు ఫోన్‌ నంబర్లు. బస్టాండ్‌ నిండా వాల్‌ పోస్టర్లలో ‘ఇరవై సంత్సరాల ఈ ఫొటోలోని వ్యక్తి పేరు... అలియాస్‌... అలియాస్‌.... ఇతని ఆచూకీ తెలియచేసిన వారికి... లక్షల బహుమానం. మీ వివరాలు గోప్యంగా వుంచబడును’ అంటూ ప్రకటనలు. ప్రతి వారం ఒక కొత్త పోస్టర్‌. బొమ్మలు అంకెలు మార్పు. మిగిలిన వివరాలు షరా మామూలే! ప్రయాణికులు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఒక్కరంటే ఒక్కరు ఆ ప్రాంతం వారు నిలిచి చూచినా... పోస్టర్‌ చదివిన పాపాన పోయే వారు కాదు.