నివేదనఆర్నాద్‌సభకి నమస్కారం!సాహితీ వేదికపై పెద్దలు, లబ్ధప్రతిష్ఠులు పదిమందికి పైగా ఆసీనులయ్యారు. ఆ వరసలో, వేదికపై మా తాతయ్య కూడా వుండాలి. వారు అనారోగ్యరీత్యా రాలేకపోయారు. డెబ్భయ్యేడు సంవత్సరాల వయసున్న వారి ఆరోగ్య విషయయై మా కుటుంబమంతా తీవ్ర ఆందోళన చెందుతోంది. డాక్టర్లు కూడా ‘మా చేతుల్లో ఏమీ లేదు’ అనేశారు.అయితే మా తాతయ్యను మాకు దక్కించే శక్తి ఈ సాహితీ వేదికలకే వుంది. అంచేత మిమ్మల్ని ప్రార్థించడానికి వచ్చేను. సభాధ్యక్షులు నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందులకు వారికి నా ధన్యవాదాలు. వేదికపై మా తాతయ్య లేని కారణంగా, ఆయన సమయాన్ని నాకిచ్చినందులకు నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. (నేనూ అప్పుడప్పడు కథలు, కవితలు రాస్తుంటాను)సభలో మీరంతా రెండున్నర గంటలకు పైగా ఈ సాహితీ వాతావరణ మలయమారుత వీచికలలో మల్లెపూల సుగంధ సౌరభంలో మునిగి పరవశులై తేలియాడారు. సాహితీ సభలంటే మా తాతయ్యకి ప్రాణమని మీకుప్రత్యేకంగా తెలియజేయ నక్కర లేదని భావిస్తున్నాను. ఆయన రాయడం మానేసి ఇరవయ్యేళ్లు దాటినా, సాహితీ సభలకు మాత్రం ఏనాడూ మిస్‌ కాకుండా, ఇరవయ్యేళ్లయువకుడిలా పరిగెట్టుకువచ్చేవారు. ఆయన మంచి వక్త అని మీకుతెల్సు. తను రచనా వ్యాసంగం చేసినన్నాళ్లు వేదిక ఎక్కలేదు. వేదిక ఎక్కడానికి సిగ్గుపడ్డాడు. మొహమాటపడ్డాడు. మాఖర్మకాలి, ఆయన్ని కొందరు బలవంతంగా ఒక రోజున వేదిక ఎక్కించేసేరు. ఆ రోజు నుంచి ఆయనకు వేదికే ప్రపంచమయి పోయింది. ఆ రోజు నుంచి సిగ్గు, మొగమాటం లేకుండా వేదిక ఎక్కేయడం అరంభించేరు.సభకు వచ్చే మా తాతయ్యను వేదికపైకి పిలవకుంటే అలుగుతారనీ, శివతాండవం చేస్తారనీ ఈ వూళ్లోని సమస్త సాహితీ సంస్థలకి తెల్సు. మా తాతయ్య అంతో,ఇంతో ఒక సాహితీవేత్త కావడంతో, వారిపై గౌరవంతో కాదనలేక, తను ఏ సమయంలో సభకు విచ్చేసినా, వేదికపై కుర్చీ వేసి కూర్చో బెట్టేస్తారు. నాకు తెల్సి, మా తాతయ్యను సభలో ప్రేక్షకుడిగా నేనెప్పుడూ చూడలేదు. అంతటి అదృష్టం మాకు కలగనివ్వరు కూడా..!‘మీ తాతయ్య వేదిక ఎక్కితే మీకొచ్చిన నష్టం ఏమిటి? బాధ ఏమిటీ?’ అని మీరు అడుగుతారు. ఆ విషయానికే వస్తున్నాను. వేదికపై ఎంతటి మహానుభావులైనా ఎంతమంది కూర్చోగలరు? మహా అయితే ముగ్గురూ, నలుగురు. కాని మా తాతయ్య లాంటి సాహితీవేత్తల ఒత్తిడికి తట్టుకోలేకో, లేక సభ లు నడిపే సంస్థలు విశాల హృదయులు కావడం చేతో, వేదికపై ముందు వరస చాలకుంటే వెనుక వరసలో కూడా కుర్చీలు వేయబడుతున్నాయి. పాపం కిందా మీదా పడి ఆహూతులను పది నుంచి పదిహేను మంది వరకు మానేజ్‌ చేయగలుగుతున్నారంటే మనం ఎటువైపు పయనిస్తున్నాం అనిపిస్తుంది.