గాయత్రి పెళ్ళి. శుభలేఖ ఇవ్వలేదు.ఆమె ఆమాత్రం అలక పూనడం సహజమే.అయినా సంతోషం. ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు రాబోతున్నది. అందరూ ఆశించేది అదే, సరిగ్గా అలాంటి మార్పునే.అంతా ఛిన్నాభిన్నం అయ్యాక కూడదీసుకోవడం ఎంత కష్టమో - కూడదీసుకుని మళ్ళీ నిలదొక్కుకోవడమూ అంతే కష్టం.ఇదంతా జరగవలసింది కాదు. కానీ జరిగింది.ఎవరిపాటికి వాళ్ళు నిస్సహాయంగా చూస్తూ ఉండగా -గాయత్రిని చికాకు పెట్టేట్లు -అహ, కాదు -గాయత్రిని ఒక్కదానినే కాదు. ఆమెతో ముడిపడ్డ వారందరినీ.గాయత్రి తండ్రి వయోలిన్‌ నేర్పేవాడు. అప్పట్లో, ఎపడైనా కచేరీలు ఉండేవి. కొన్నాళ్ళకి అవీ లేవు. ఏదో బడిలో కొంతకాలం పనిచేశాడు. పుస్తకాలు బైండింగ్‌ చేయడం, ప్రూఫ్‌ రీడింగ్‌ లాంటి అరకొర పనులు చేస్తూ వుండేవాడు - పని దొరికినపడల్లా.ఏమైనా నిత్య జీతభత్యాలు లేని జీవితాలు, బొటాబొటి సంసారాలు. వారికి ముగ్గురు అమ్మాయిలు మైత్రేయి, గాయత్రి, వైదేహి.మైత్రేయి డిగ్రీ పూర్తవగానే కోరల్‌ మైక్రోల్యాబ్స్‌లో ఉద్యోగానికి అప్లై చేసింది. కోస్తా తీరమంతా వ్యాపించిన రొయ్యల చేపల సాగుదార్లకు ఇది చాలా ముఖ్యమైన సంస్థ. దాని వ్యవస్థాపకులు మైక్రో బయాలజిస్ట్‌లు సుమతి, ఉదయ్‌లు. ఈ దంపతులు రోగనిర్ధారణ చేయడమే కాక, నిపుణులతో ప్రత్యేక చికిత్సా కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు.

 ప్రతి మండల కేంద్రంలోనూ. సుమతి రోగ నిర్ధారణ విభాగాన్ని - ఉదయ్‌ చికిత్సా విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అటు కలకత్తా నుంచి ఇటు కొచ్చిన్‌ వరకు ఎక్కడినుంచైనా నిపుణుల అభిప్రాయాలను నిమిషాల్లో తెప్పించగల వ్యవస్థను వారు రూపొందించారు.చూస్తుండగానే, కోరల్‌ మైక్రో ల్యాబ్స్‌ రైతుల నోట్లో నాని - రొయ్యలాసుపత్రిగా పేరు గడించింది. ఆ దంపతులు రొయ్యల డాక్టర్లు అయిపోయారు.ఏ మాటకు ఆ మాట చెపకోవాలి. ఈ రొయ్యలాసుపత్రికి ఆ ఊళ్ళో ఓ మంచి పేరుంది. విమెన్‌ ఫ్రెండ్లీ - అని. ఉన్న వారిలో ఏ కొద్దిమందో తప్పించి అందరూ ఉద్యోగినులే. ఆ కొద్దిమంది కూడా వివాహితులు. మర్యాదస్తులు.ఉద్యోగ వాతావరణం మీద సుమతికి, ఉదయ్‌కి కొన్ని స్పష్టమైన ఆలోచనలు వున్నాయి. స్త్రీ పురుషుల భేదం లేకుండా ఒక మర్యాదపూర్వకమైన గౌరవప్రదమైన వాతావరణం కల్పించగలిగామని వారి భావన. ఆమేరకు తమ సిబ్బందికి బోధనా తరగతులు నిర్వహిస్తారు.ఆ చిన్న పట్టణంలో ఈ వార్త నలుగురి నోట్లో నానుతూ ఉంటుంది. చివరికి, మర్యాదస్తులే రొయ్యలాసుపత్రిలో ఉద్యోగానికి చేరతారన్న భావన స్థిరపడిపోయింది.మైత్రేయి అక్కడ మూడేళ్ళు అకౌంటెంట్‌గా పనిచేసింది. తన జీతంలో కొంత చెల్లెళ్ళ చదువుకు, మరికొంత తన పెళ్ళికి పొదుపు చేసుకొంది.పెళ్ళయి వెళుతూ, తన ఉద్యోగంలో చెల్లెలు గాయత్రిని చేర్పించి వెళ్ళింది.