‘‘మీ అమ్మ ఉందా?’’అరుగుమీద గచ్చకాయలు ఆడుకొంటుంది రాధ ఒక్కతే! తలెత్తి చూసింది. పక్కింట్లో ఉండే తాయారమ్మ కొడుకు రమణ పీరుకట్టెలా పొడుగ్గా, ఇస్త్రీలేని కాటన్‌పాంట్‌, కాటన్‌చొక్కా వేసుకొన్నాడు. జుట్టుకు కొబ్బరినూనె లేక ఎన్నిరోజులైందో, ఎర్రగా రాగి రంగువేసినట్టుగా ఉన్నాయి. ఒంటిరంగు తెలుపే కాని, రక్తం లేక, వెలసిపోయిన గుడ్డలా ఉంది. తిండిలేక ఎండుకు పోయినట్టుగా ఉన్న చెంపలు. కాని, పొడుగాటి ముక్కు, చురుకైన పెద్దపెద్దకళ్ళు. అతడినంత తేలిగ్గా తీసివేయనీయవు!‘‘ఎందుకూ?’’ దీర్ఘం తీసింది.‘‘ఇవతలికి పిలుస్తావా?’’అతడు చేతిలో గ్లాసు పట్టుకు ఉండడం చూసి, ‘‘పాలు కావాలా? లేవు. రాతాలకి పోసేశారు’’ అంది.‘‘పాలు కాదు. కొంచెం మజ్జిగ కావాలి’’.రాధ లోపలికి వెళ్ళింది. ‘‘తాయారమ్మ కొడుకు వచ్చాడమ్మా! మజ్జిగ కావాలట!’’‘‘పాలన్నీ రాతాలకి పోసేస్తాం. మజ్జిగెక్కడుంటుంది?’’‘‘చెప్పుదువు రా!’’‘‘ఈ ముక్క చెప్పడానికి చేతిలో పని వదిలేసి రావాలా?’’ విసుక్కుంది సీతమ్మ. ఆమె గేదెలకి తవుడు పెడుతూంది. పది గేదెలున్నాయి. అందులో అయిదు గేదెలు వట్టిపోయాయి. వేసవి వచ్చేసిందేమో, ఇచ్చేవికూడా చేరెడు చేరెడు రాల్పుతున్నాయి. రాతాలకి చాలక నీళ్ళడోస్‌ పెంచాల్సి వస్తూంది, పోయించుకొనేవాళ్లు ఎన్ని తిట్లుతిట్టినా, కాస్త టీకి, తోడు పెట్టుకోడానికి పాలు ఓ అర్ధ లీటరు ఉంచుకొని మిగతావన్నీ అమ్మేస్తుంది. అన్నంలోకి పాలు పోసుకొంటామని, పిల్లలేడ్చినా సరే, పాలు రాతాలకి పోసేస్తుంది.తవుడు కలిపిన చేతుల్తోనే ఇవతలికి వచ్చింది సీతమ్మ. 

‘‘ఏం నాయనా?’’‘‘వేడి చేసి కళ్ళు మండుతున్నాయండీ! కొంచెం మజ్జిగ పోయించుకుపోదామని వచ్చాను’’.గేదెలు సగం వట్టిపోయాయి. మిగతావి పాలు తగ్గించేశాయి! రాతాలకే పాలు చాలడం లేదు. ఇక ఇంట్లో మజ్జిగెక్కడుంటుంది? రాత్రి తోడుపెట్టిన పావు లీటరు పాలు చిలికితే అందులో కాస్త మజ్జిగ పోయొచ్చు! కాని, లేదని చెప్పడమే సులభం కొందరికి. అయ్యో, గ్లాసు పట్టుకు ఇంటి ముందుకు వచ్చాడే, ఎప్పుడూ రానివాడు, వేడి చేసిందని చెబుతున్నాడే. తాము పోసుకొనే మజ్జిగలోనే ఓ గ్లాసుడు నీళ్ళెక్కువ పోసి, అతడికి కాస్త పోస్తే తలుచుకొంటాడన్న ఆలోచన రాలేదు సీతమ్మకు.గ్లాసుడు మజ్జిగ పొయ్యడం పెద్ద ఉపకారమేమి కాదు. కాని, అతడున్న పరిస్థితిలో ఆ గ్లాసుడు మజ్జిగ సీతమ్మ నుండి పొంది ఉంటే, అతడి మనసులో మాత్రం కొండంత విశ్వాసం కలిగేదేమో ఆమె మీద! కృతజ్ఞతతో హృదయం నిండిపోయేది.ఎప్పుడూ అడగని వాళ్ళు అడిగి లేదనిపించుకొంటే ఎదురయ్యే బాధ రమణ ముఖంలో కదిలింది. దెబ్బతిన్న అభిమానంతో కాళీగ్లాసుతో వెనుదిరిగాడు రమణ.అతడు పొందిన ఆశాభంగం గమనించే తీరికలేనట్టుగా విసవిసా లోపలికి వెళ్ళిపోయింది సీతమ్మ.ఇంటికి వచ్చాడు రమణ. గ్లాసు పక్కనపెట్టి తను చదువుకొనే చాపమీద కూర్చున్నాడు. కళ్ళు వేడితో భగభగ మండుతున్నాయి. గొంతులో ముక్కులో వేడి ఆవిర్లు వస్తున్నాయి. ఒక గ్లాసుడు మజ్జిగ కోసం మనసు తహతహ లాడుతుంది. ఎక్కడైనా పెరుగుకొని తెచ్చుకుందామన్నా అమ్మ దగ్గర ఒక్క నయాపైసా లేదని తెలుసు.