మధ్యాహ్నం ఎండ మహాజోరుగా ఉంది. కిటికీ కర్టెన్‌ కొద్దిగా జరిపి చూస్తున్నాను.పాల వ్యాన్‌ పెద్దహారన్‌తో పోతోంది. స్కూల్‌ బస్సు ఆగింది. బుడతకీచుల్లా ఇద్దరు పిల్లలు దింపబడ్డారు బస్సులో నుంచి. వాళ్ళ భుజాలకి పుస్తకాల సంచులు వాటర్‌బ్యాగులు, నెత్తిన తెల్ల టోపీలు, కాళ్ళకి మేజోళ్ళతోబిగించిన బూట్లు, వాటిమీద దుమ్ము. బస్సులో నుంచిదింపబడ్డ ఆ పసివాళ్ళు వేళ్ళాడిపోతూ ఉన్నారు.వాళ్ళకోసం రోడ్డు ప్రక్క గొడుగులేసుకుని ఎదురు చూస్తున్నఅమ్మలో, అక్కలో, ఆయాలో గానీముందుకు వచ్చి, ఆ పిల్లలభుజాల బరువంతా ఊడలాగితమ మీద పడేసుకుని వాళ్ళనిగొడుగుల్లోకి లాక్కునితీసుకెళుతున్నారు.సైకిల్‌ బళ్ళమీద కూరగాయలు నేర్పుగా పేర్చుకుని పక్కనున్న సీనారేకు డొక్కులో నుంచి నీళ్లు జల్లుతూ - ‘తాజా కూర’లని కేకలు పెడుతూ పోటీలమీద పోతున్నారు నల్గురు కుర్రాళ్ళు! వెన్నెట్లో నడుస్తున్నంత కులాసాగా ఉంది వాళ్ళ వరుస!వయస్సు పొగరు అలాంటిది మరి!సంచులు, బ్యాగులు, బుట్టలు పట్టుకుని పాల ప్యాకెట్ల కోసం హడావిడిగా బయల్దేరేరు. అప్పుడే కొందరు అంగనామణులు!ఎండనుకుంటే కుదరదుగదా? అవసరం అలాంటిది! పేపర్లు సీసాలు, డబ్బాలు కొనుక్కునేవాడు తట్ట నెత్తిన పెట్టుకుని నీరసంగా అరుస్తున్నాడు.

 సందు చివర ఓ స్టీల్‌ సామాన్ల అవ్వ నడుముకి కట్టుకున్న గుడ్డ ఉయ్యాల్లో నెలల పసిగుడ్డును కూర్చోబెట్టుకుని, గొంతెత్తి నాల్గు వీధులకి వినిపించేలా అమ్ముతోంది! తల్లితో పాటు ఆ పసిగుడ్డు కూడా ఎండంతా భరిస్తోంది!బ్రతుకు తెరువుకోసం అగచాట్లైన్నైనా భరించాల్సిందే గదాఇంతలో-ఆదరాబాదరా హేండ్‌ బ్యాగ్‌లు ఊపేసుకుంటూ, చెమట కక్కుకుంటూ, జారిపోతున్న నైలెక్స్‌ చీరల్ని సర్దుకోలేక ఆయాసపడుతూ లేస్తూ మార్నింగ్‌షోలు చూసి వస్తున్నారు కొందరు మహిళలు. సినిమా చూసిన ఆనందం కన్నా స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చారేమో, ఆఫీసునుంచి భర్త వచ్చే వేళకి టిఫిన్‌, కాఫీలు చేయగలమో లేమో అన్న ఆరాటం, ఆదుర్దాయే వాళ్ళ ముఖాల్లో తాండ విస్తోంది!‘బాధ్యత గల ఇల్లాళ్ళకి సరదాలు తీరాలంటే ఆ మాత్రం హైరాన తప్పదు కదా?’ అనుకుంటూ కిటికీ కర్టెన్‌ సరిచేసి లేవబోతున్నప్పుడు చూసేను.సందు చివర భారంగా అడుగులు వేస్తూ ఓ పెద్దావిడ చేతిలో సంచీతో వస్తూంది. ఒక ఇంటి ముందు ఆగి కొంతసేపు ఆలోచించి లోపలికి వెళ్ళింది. ‘ఎవరోలే’ అనుకుని లేచి ఇంట్లోకెళ్ళి పోయేను.మరొక పావుగంట తర్వాత, ఏదో పనిమీద బాల్కనీలోకి రాగానే ఆ పెద్దావిడ రెండో ఇంట్లోకి వెళ్తోంది. ‘బహుశా ఆ మొదటి ఇల్లు కాదేమో?’ అనుకుని వెనుతిరగబోతుంటే, మళ్లీ ఆవిడ... ఆ రెండో ఇంట్లో నుంచి కూడా బయటికివచ్చి మూడో ఇంట్లోకి వెళ్ళనా మాననా, అన్నట్టు సంశయంగా కాస్త సేపు ఆగి, ఇక మానేసి నాల్గో ఇంటికి - అంటే సరిగా మా పక్క ఇంట్లోకి వెళ్తోంది! ఇదేదో ఇల్లు వెతుక్కుంటున్న బాపతులా లేదు... ఇంటింటికి వెళ్లి వస్తుండటం అంటే ఆవిడ ఏదో అడుగుతున్నదో అమ్ముతున్నదో... ఏదో అయి ఉండాలి...