‘‘వచ్చే నెలలోనే జనరల్‌ ఎలక్షన్స్‌’’ అనే వార్త అన్ని పేపర్లలో వచ్చింది. టీ.వీ కాలువలన్నీ వేరే వార్తలన్నింటినీ పక్కన పడేసి దీన్నే మెయిన్‌ ఐటమ్‌ కింద ఊదర గొట్టేస్తున్నాయి.మేధావులు, పండితులు, ప్రొఫెసర్లంతా ప్రజల కోసం టీ.వి కాలవల్లో తమ జ్ఞాన సంపదనంతా ఒలక పోస్తున్నారు.మల్లయ్య పాక హోటల్లో కూర్చున్న ముఠా కూలీలంతా టీలు తాగుతూ ఆ వార్త గురించే ముచ్చటించుకుంటున్నారు. అక్కడ వ్యవసాయ కూలీలు కూడా చేరి తమ వంతు మాటసాయం చేస్తున్నారు మధ్యమధ్యలో. తాపీ పని చేసే వాళ్లు గోడౌన్లలో పని చేసే హమాలీలక్కూడా మల్లయ్య పాక హోటలే రిలాక్సింగ్‌పాయింటు.

నెహ్రు నుండి మన్మోహన్‌సింగు దాకా, నీలం సంజీవరెడ్డి నుండి కిరణ్‌కుమార్‌ రెడ్డి దాకా ఓట్లేసినోళ్లున్నారక్కడ.నెహ్రూ గొప్పోడనే వాళ్లు, ఎంటీవోడు అదరగొట్టేడ్రా! అని చెప్పేవాళ్లు, ఎర్రజెండానే దేశాన్ని బాగు చేసుద్దని బల్ల గుద్ది చెప్పే ముఠా నాయకులూ ఉన్నారు.తెలుపురంగు ఒక్కటే ఏడు రంగుల ఇంద్రధనస్సు అయినట్టు, ఆ కాలనీలో వాళ్లంతా రకరకాల పార్టీల జండాలు మోస్తున్నారు. వాళ్లలో ప్రతొక్కడు రోజులో ఒక్కసారైనా మల్లయ్యపాక హోటల్‌కొచ్చి కూకుంటాడు. సినిమాల నుంచి రాజకీయాల దాకా, ఇంట్లో బాధల నుంచి ఒంట్లో జబ్బుల దాకా తమ గోడు కలిసి పంచుకుంటారు.ఆ రోజు అందరూ మాట్లాడుకునేది మాత్రం ఒక్కటే! అదే రాబోయే ఎలక్షన్లు. అంద రిలో నూతన ఉత్సాహం.

మరీ ముఖ్యంగా ఓట్ల పండగ వస్తోందంటే, కొత్తల్లుడికి పండగొచ్చినంత! బోలెడన్ని కోరికలు తీర్చుకోవచ్చన్న ఆశ! ఎంత పెద్ద నాయకుడైనా, ఎప్పుడూ కనబడని నాయకుడైనా, ఇంటికొచ్చి మరీ పలకరించి కోర్కెలు తీర్చిపోతాడు. మనుషుల్ని మనుషులుగా గుర్తుపట్టేది, గౌరవించేది ఇప్పుడే. ఈ ఎలక్షన్లే లేకపోతే చేలో గేదెకు, ఇంట్లో మనిషికీ ఒకే గౌరవం!అందుకే అందరూ రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడూ నోరు మెదపనోళ్లు కూడా బల్లగుద్ది మరీ మాట్లాడుతున్నారు.అందరికీ పేపర్లో వార్తలు విన్పిస్తున్నాడు సూరి.‘‘ఈసారి ఎలక్షన్లో ఓ గమ్మత్తుందిరా’’ అన్నాడు పేపర్లోంచి తల బయటపెట్టి.‘‘ఏంటి ఓట్ల రోజున పోసినట్టుగా సంవత్సరం పొడుగునా ఫ్రీగా సారా పోత్తారా! ఏం?’’ అన్నాడు బసవయ్య.