చనిపోయాక నిజంగానే ఆ లోకంలో స్వర్గనరకాలు ఉంటాయో లేదో నాకు తెలియదు. కలికాలంలో పాప పుణ్యాల ఫలం ఈ లోకంలోనే అనుభవించక తప్పదని కదా చెప్తారు.నిజమేనేమో... ఇప్పుడు నా వయసు నలభై యేళ్ళు. ఇన్నేళ్ళ జీవితంలో స్వర్గం ఎలా ఉంటుందో ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు.

నరకం మాత్రం ప్రతిరోజూ చూస్తున్నాను.నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్ళాలంటే నరకయాతన పడాల్సిందే. ఎందుకు దేవుడు నా నుదుట ఇంత హీనమైన బతుకు రాశాడో... ఏం పాపం చేశానని... ఈ జాతిలో పుట్టటం నా తప్పా? పేదరికంలో మగ్గడం నా తప్పా? ఇదంతా ఆ దేవుడేగా చేశాడు. తప్పు దేవుడిదైతే శిక్ష నాకెందుకు? అసలు దేవుడున్నాడా? ఉంటే ఇంత పక్షపాతం ఎందుకు? కొందరి మీద దయ, కొందరి మీద మాత్రం కసి... నా జాతి మీద మరీను..శవం నడుస్తున్నట్టు... నడుస్తూ ఆలోచిస్తు న్నాను. మురిక్కాలువలో రాయి విసిరితే బద్ధ కంగా కదిలే అలల్లా ఆలోచనలు... ఊపిరి ఆగి పోయిన కట్టెలాంటి శరీరాన్ని బలవంతంగా ముందుకు నెడ్తూ... అవును కదూ... స్వచ్ఛమైన గాలి పీల్చి ఎన్నేళ్ళ యింది? ఇప్పుడు శ్వాస తీసుకోవాలన్నా భయమే. ఊపిరితిత్తులనిండా చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్న దుర్గంధం... నా పద్నాలుగో ఏడప్పుడు కదూ మొదటిసారి చనిపోయింది. 

చనిపోయి మలమూత్రాలతో నిండి ఉన్న దారి గుండా ప్రయాణిస్తూ... నరకపు ద్వారాలు తెరుచుకుని... ఎంత బీభత్సంగా ఉందో... చనిపోతే బావుండని పించేంత భయంకరంగా. చనిపోయాకేకదా నర కాన్ని చేరుకున్నాను. మళ్ళా చనిపోవటం ఎలానో తెలీక ఎంత నరకయాతన పడ్తుంటానో నాకే తెలుసు. ఆ దేవుడికీ తెలుసేమో.. తెల్సినా, క్రూరంగా నవ్వుకుని ఉంటాడు. నేనీ భూమ్మీదే నరకం చూడాలని నా నుదుటన రాసిన మహానుభావు డాయనేగా మరి...ఉదయం యాద్గిరి ఫోన్‌చేశాడు. నల్లకుంట చౌరస్తా దగ్గర డ్రైనేజీ పైపు లీకవుతోందట. నీళ్ళు బైటికి పొంగడంవల్ల దుర్గంధాన్ని తట్టుకోలేక ఇప్పటికే ప్రజలు నానా ఇబ్బందులు పడు తున్నారని, దాన్ని వెంటనే బాగు చేయాలని యాద్గిరి ఆర్డర్‌. నాకు కడుపులో దుఃఖమేదో సుళ్ళు తిరిగింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నా రట. మరి నేనో.. నేనా ప్రజల్లో ఒకణ్ణి కాదా? మరి నేనెవర్ని? నా ఇబ్బంది గురించి యాద్గిరికి పట్టదా? ఈ ప్రభుత్వానికి పట్టదా? నాకు దుర్గంధం వేయదా?